నిర్మల్ కోట తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో పేరు సంపాదించిన నిర్మల్ కు సుమారు 400 ఏళ్ల ఘన చ‌రిత్ర ఉంది.[1] చారిత్రక ఖిల్లాగా.. నిజాం జమానాలోనే రెవెన్యూ జిల్లాగా.. రాజకీయ కేంద్రంగా.. పేరొందిన నిర్మల్‌ ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది. నిర్మ‌ల్ లో ఏడు చెరువులు, ఏడు ద‌ర్వాజాలు, ఎత్తైన బురుజులే కాకుండా, కొయ్య‌బొమ్మ‌లు, చిత్ర‌లేఖ‌నం వంటివి ఉంటాయి. హైదరాబాద్‌ నుండి నాగపూర్కు వెళ్ళే జాతీయ రహదారిపై వున్న ఈ పట్టణం డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ నుండి 58 కి.మీ., నిజామాబాద్‌ నుండి 75 కి.మీ. దూరంలో ఉంది. గోదావరికి ఉత్తరాన 6 కి.మీ. దూరంలో వున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవుతో నిండి వుండేది. చుట్టూ గుట్ట, కొండ మధ్య ఈ పట్టణ నిర్మాణం జరిగింది. ఈ పట్టణం చుట్టూ వున్న గుట్టపై కోటగోడ, బురుజు లాంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి.[2]

ఎంతో మహత్తర చరిత్ర కలిగిన ఉత్తర తెలంగాణలో నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది నిర్మల్‌ కోట.

కోట మార్చు

1747లో ప్రెంచి ఇంజనీర్ల సహాయంతో నిర్మల్‌ గిరిదుర్గాను నిర్మించడం జరిగింది. నిర్మల్‌ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. శత్రువులు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశారు. పట్టణం చుట్టూ నిర్మించిన ప్రధానమైన రక్షణ గోడతో పాటు, రాజ సౌధం (ఖిల్లా గుట్ట) చుట్టు మరొక పటిష్ఠమైన రాతి గోడను నిర్మించారు. దీనినే ‘ఆంజనేయదుర్గం’ అంటారు.

కోటలోకి వెళ్ళడానికి తూర్పువైపు సింహద్వారం, దక్షిణ, ఉత్తర దిశల్లో మరో రెండు ప్రధాన ద్వారము, సింహ ద్వారానికి దగ్గరలో తూర్పుకు ఒక చిన్న ద్వారం, సభాభవనం, హవామహల్‌, అంతఃపురసౌధం, మంచినీటి కోనేరుబావి, ఇలా ఆనాటి రాతినిర్మాణాలు ఉన్నాయి.

రాజభవనం (ఖిల్లా గుట్ట) శ్రీనివాసరావు కాలంలో నిర్మించబడింది. బుడతకీచు అనే సన్నిహితుడి సలహాతో, శ్రీనివాసరావు ఫ్రెంచ్‌వారి సహాయంతో దీనిని కట్టించారు. కోట చుట్టూ సున్నంతో ఎత్తయిన బలిష్టమైన రాతి, ఇటుక గోడ, గోడపొడవునా లోతైన కందకం త్రవ్వించి కందకంలో ఎల్లప్పుడూ నీరు వుండే విధంగా అమర్చి బయటనుండి శత్రువు కోటలోకి రాకుండా మొసళ్ళను దింపేవారు.

వీటిన్నింటిలో ప్రత్యేకమైనది గొలుసు దర్వాజ. ఈ దర్వాజకి పెద్ద ఇనుప పలక వుండేది. వీటని బలిష్టమైన గొలుసుతో పెద్ద చక్రాలకు చుట్టి వుంచేవారు. ద్వారం మూసివేయడానికి తెరవడానికి గొలుసును, వీటిని లాగడానికి ఏనుగును ఉపయోగించేవారు. ఈ దర్వాజా నిర్మాణ తీరును చూస్తే శత్రువు రాకను అడ్డుకోవడానికి ఎంత నైపుణ్యంతో నాటి నిర్మాణాలు చేసారో అర్థమవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి వెడల్పు పనుల కారణంగా దర్వాజకు సంబంధించిన ఒక దిమ్మె ధ్వంసం అవటంతో మరొక దిమ్మె మాత్రమే ఇప్పుడు ఉంది.

మొత్తంగా నిర్మల్‌ పట్టణంలో ఏడు సింహ ద్వారాలు ఉండేవి. రాజా శ్రీనివాసరావు కాలంలో మొదటి ప్రహరీలో సైనిక శిబిరం ఏర్పాటు చేసేవారు. అప్పటికాలంలో పెట్టిన పేర్ల ఆధారంగా నేటికీ కొనసాగుతున్న నివాస వాడు ఇప్పటికీ మనకు పట్టణంలో కనిపిస్తాయి. నాటి సింహద్వారాలు మాత్రం మనకు శిథిలావస్థలో కనిపిస్తాయి. కొన్ని ద్వారాలు అసు ఆనవాళ్ళే లేకుండా పోయాయి. నిర్మల్‌ కోటల్లో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న కోటల్లో ‘బత్తీస్‌ ఘడ్‌’ కోట కూడా ఒకటి.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. మన నిర్మల్.కాం. "నిర్మ‌ల్ చ‌రిత్ర‌". mananirmal.com. Archived from the original on 7 అక్టోబరు 2016. Retrieved 14 October 2016.
  2. ఈ తెలంగాణ మాగజైన్. "నిర్మల్‌ కోట". magazine.telangana.gov.in. Retrieved 14 October 2016.

ఇతర లంకెలు మార్చు