పట్రాయని నరసింహశాస్త్రి

పట్రాయని వెంకట నరసింహశాస్త్రి సాలూరు పెదగురువుగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు. వీరి కుమారుడు సాలూరు చినగురువుగా ప్రసిద్ధిచెందిన పట్రాయని సీతారామశాస్త్రి.

పట్రాయని నరసింహశాస్త్రి
జననం1872
మరణం1931
ఇతర పేర్లుపట్రాయని వెంకట నరసింహశాస్త్రి
జీవిత భాగస్వామిసూరమ్మ
పిల్లలుపట్రాయని సీతారామశాస్త్రి
తల్లిదండ్రులు
  • పట్రాయని పాపయ్యశాస్త్రి (తండ్రి)
  • నరసమ్మ (తల్లి)

పట్రాయని పాపయ్యశాస్త్రి ఏకైక కుమారుడైన పట్రాయని నరసింహశాస్త్రి 1872 భావ నామ సంవత్సరంలో జన్మించారు. పట్రాయని వంశం పూర్వీకులు సంపన్నులే అయినా తాతగారు పట్రాయని పెదనరనన్నగారి అమాయకత్వానికి, దుర్వ్యయానికి కుటుంబపు ఆస్తులన్నీ హరించుకుపోయాయి. చామలాపల్లిలో పట్రాయనివారికి సెంటు భూమి లేకపోయినా వారి పేరుతో పిలవబడుతున్న చెరువులు, తోటలు ఉన్నాయి. నరసింహ శాస్త్రి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి. తండ్రి పాపయ్యశాస్త్రి 35 సంవత్సరాల వయసులోనే మరణించగా తల్లితో పాటు ఆమె పుట్టిల్లు కారాడ కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారంలోని మధురాపంతుల కూర్మన్న కుమార్తె సూరమ్మతో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరుపడ్డ గొప్ప సంగీత విద్వాంసుడు మధురాపంతుల పేరయ్యశాస్త్రి, నరసింహ శాస్త్రిగారి మామగారైన మధురాపంతుల కూర్మన్నకు సోదరుడు. ఆ విధంగా పినమామ వద్ద నరసింహశాస్త్రికి కూడా శిష్యరికం లభించింది. పేరయ్యశాస్త్రి తంజావూరులో సంగీత సాధన చేసినవారు. ఆనంద గజపతి మహా రాజులతో ఘన సన్మానం పొందినవారు. సుసర్ల దక్షిణామూర్తి, ద్వివేదుల కన్నడు శాస్త్రి, ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి సోదరులు పేరయ్యశాస్త్రి శిష్యులే. పెద కాద అనే పల్లెలో నివాసం ఏర్పరచుకొని భూముల మీద వచ్చే ఆదాయంతో కాలక్షేపం చేసేవారు. సంగీత సాధనలో శిష్యులు ఏమాత్రం అశ్రద్ధ చూపినా భరించలేక పోయేవారుట. పేరయ్యశాస్త్రిగారు చాలా ఆత్మగౌరవం కలిగిన విద్వాంసులు. ఆయన సంగీత కచేరీ చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి పక్కవారితో బాతాఖానీ ప్రారంభించడం చూసి పాడడం ఆపేసారుట. ఆయన ఏదో చెప్పబోతే, నీ కచేరీలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే నీవేం చేస్తావు. ఇది నా కచేరీ అన్నారుట. నరసింహ శాస్త్రికి గురువుగారంటే అమితమైన గౌరవం, భయభక్తులు ఉండేవిట. పేరయ్యశాస్త్రి శిక్షణలో సంగీత రీతులను కంఠస్థం చేసుకొని రాగాలాపన, స్వరకల్పన ప్రావీణ్యం సంపాదించి వివిధ రీతులలో పల్లవి పాడడంలో నిష్ణాతులయేరు శిష్యులు.

అప్పుడప్పుడే కచేరీ పద్ధతి ఆంధ్ర దేశంలో ప్రారంభమవుతున్న రోజులు. దాక్షిణాత్య సంగీత ప్రభావంతో సంగీత త్రిమూర్తుల రచనలను కచేరీలలో పాడడం సంప్రదాయంగా ఉండేది. సంగీత శిక్షణను గురుముఖతః పొందడం తప్ప వేరే దారి లేదు. త్యాగరాజు కీర్తనలు ప్రచారంలోకి వస్తున్న రోజుల్లో నరసింహ శాస్త్రి కీర్తన గ్రంథం నేర్చుకోవడానికి కొన్నాళ్ళు మద్రాసులో మకాం పెట్టారు. మద్రాసులో ఒక పెళ్ళి ఊరేగింపులో నంజుండయ్య అనే విద్వాంసుడు భైరవి రాగాలాపన చేసి ఒక విలంబ కాలం పల్లవి ఎత్తుకున్నారుట. పల్లవి ఆలాపన మీద ప్రత్యేకమైన అభిరుచి ఉన్న నరసింహ శాస్త్రి నంజుడయ్యకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పల్లవి తనకు నేర్పించమన్నాడట. నంజుండయ్య, నరసింహశాస్త్రికి రాజుగారు గౌరవంగా ఇచ్చిన శాలువాను గురుదక్షిణగా స్వీకరించి నరసింహశాస్త్రికి పల్లవి పాడడం నేర్పారుట.

విద్యా సముపార్జన పూర్తయాక అనేక చోట్ల సంగీత కచేరీలు చేసి గొప్ప విద్వాంసులుగా పేరు పొందారు. ముగ్గురు పిల్లలు కలిగారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు మరణించగా, కుమార్తె నేల నూతిలో పడి పసితనంలోనే మరణించింది. భార్య కూడా మరణించింది. నరసింహ శాస్త్రిగారి జీవితంలో ఈ మరణాలు కలిగించిన విరక్తితో మిగిలిన ఏకైక కుమారుడు సీతారామ శాస్త్రిని మాతామహులు కూర్మన్న సంరక్షణలో వదలి దేశ సంచార బాట పట్టారు. అనేక చోట్ల కచేరీలు చేస్తూ, సంగీత శిక్షణ ఇస్తూ చివరకు బరంపురంలో స్థిరపడ్డారు.

బరంపురంలో త్రిపాసూరి సోదరులు ముఖ్య ప్రాణరావు, చక్రవర్తి పంతులు నరసింహ శాస్త్రితో ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. సీతారామశాస్త్రికి పది సంవత్సరాలు వచ్చేసరికి నరసింహ శాస్త్రి బరంపురంలో మానసికంగా, ఆర్థికంగా కుదురుకొని ఉన్నారు. కొడుకు తండ్రి వద్ద పెరగడమే మంచిదని భావించి కూర్మన్న సీతారామ శాస్త్రిని నరసింహ శాస్త్రికి తిరిగి అప్పగించారు. బరంపురంలో తండ్రితో పాటుగా సీతారామశాస్త్రి కూడా తిరుగుతూ కచ్చేరీలలో ఆ విద్యార్థులతో పాటుగా సంగీతాన్ని నేర్చుకున్నారు. తన ప్రతిభా విశేషాల వల్ల సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథాన్ని పూర్తి చేయడమే కాక కొందరు విద్యార్ధులకు సంగీత పాఠాలు చెప్తూ బాల గురువుగా ఆదరణ పొందారు. పన్నెండేళ్ళ వయసుకి ఒక దేవాలయంలో జరిగిన కచేరీలో సంగీత ప్రదర్శన చేసి స్వర్ణ కంకణాన్ని బహుమతిగా పొందారు.

బరంపురం కేంద్రంగా తండ్రీ కొడుకులు జీవన యాత్ర సాగించారు. ఒడిషా, ఆంధ్ర, బెంగాల్ రాష్ట్రాలలోని అనేక ప్రదేశాలలో సంగీత కచేరీలు చేసేవారు. చాలా సంస్థానాలలో ఘన సన్మానాలు పొందారు. బరంపురంలో నివసించిన కాలంలో ఎవరికి వారే ధన సంపాదన చేసేవారు. సీతారామశాస్త్రి తన సంపాదనంతా తండ్రి చేతికి ఇస్తే రూపాయకి కాణీ వంతున కొడుకు ఖర్చుకోసం ఇచ్చి మిగిలిన సొమ్మను నరసింహశాస్త్రిగారి జాగ్రత్త చేసారు. నరసింహ శాస్త్రి తల్లి బొబ్బిలి సమీపంలోని ఆనవరం అగ్రహారంలో కూతురు వద్ద ఉండేవారు. అలా జాగ్రత్త పరచిన సొమ్ముతో ఆనవరంలో భూమిని కొన్నారు. వృద్ధురాలైన తల్లిని తీసుకొని వచ్చి సాలూరులోని లూథరన్ చర్చి వెనక చిన్న ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికి సీతారామ శాస్త్రిగారికి 20 సంవత్సరాలు.

సాలూరులో సంగీత పాఠాలు చెప్తూ, శ్రీ శారదా గాన పాఠశాల పేరుతో ఒక సంగీత పాఠశాలను నెలకొల్పారు నరసింహ శాస్త్రి. తండ్రీ కొడుకులు ఇద్దరూ సంగీత గురువులుగా ఎందరో విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యాదానం చేసేవారు. సాలూరు ప్రజలు ఇరువురినీ ఎంతో ఆత్మీయంగా ఆదరించారు. నరసింహ శాస్త్రి "పెద గురువుగారు" అని, సీతారామ శాస్త్రిని "చిన గురువుగారు" అని పిలిచేవారు. ఇద్దరూ ఆంధ్ర, ఒడిషా, బెంగాలు వంటి ప్రాంతాలలో కచేరీలు చేసేవారు. చీకటి కోట, ధారాకోట, పెద కిమిడి, చిన కిమిడి, జరడా వంటి అనేక సంస్థానాలలో వీరిద్దరూ సన్మానం పొందారు.

సీతారామ శాస్త్రికి వివాహం జరిగాక, జీవన భృతి కోసం కొంతకాలం శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ ముగ్గురు మగ పిల్లలు కలిగాక భార్య మరణించింది. తల్లి లేని పిల్లలను తీసుకొని సీతారామ శాస్త్రి సాలూరుకి వచ్చేసారు. సాలూరులో ఆనాడు సాధు కూటాలు చాలా ఉండేవి. అక్కడ స్థిరపడే నాటికి నరసింహ శాస్త్రిని ఈ సాధు కూటాలు ఆకర్షించాయి. ఆయన అటువంటి వైరాగ్య స్థితిలో ఉండేవారు. చాలా నిరాడంబరంగా, ఒక యోగి లాగ జీవితం సాగించారు నరసింహ శాస్త్రి. ఆరడుగుల ఎత్తు, బోడి తల మీద జడ కట్టిన చిన్న పిలక, చెవులకి ఒడిషాలో రూపొందిన కుండలాలు, మెడలో పెద్ద సైజు రుద్రాక్ష తావళం, కాషాయం రంగు దేరిన ధోవతి, పంచె కట్టు, పైన శాలువా - అప్పటికి ఎనిమిదేళ్ళ వయసులో ఉన్న మనవడు సంగీత రావు మనసులో స్థిరపడిన తాతగారి రూపం.

ఆ రోజుల్లో సాలూరు లోను, బొబ్బిలి లోను సంతర్పణలు నిరంతరం జరుగుతూ ఉండేవి. సంభావనలకి కూడా లోటులేదు. ఎప్పుడూ ఏకాహాలు, సప్తాహాలు, నవరాత్రులు, వసంత నవరాత్రులు, వనభోజనాలు జరుగుతూ ఉండేవి. అటువంటి వాటికి మనవడు సంగీతరావును తీసుకుని వెళ్ళేవారు పెదగురువుగారు. అక్కడ భజన కార్యక్రమాలు జరిగేవి. మనవడి సంగీత శిక్షణతో పాటు ప్రదర్శన కూడా వాటితో సాగేది.

పెదగురువుగారుగా నరసింహ శాస్త్రిని సాలూరు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవించినా చినగురువుగారైన సీతారామశాస్త్రి అంటేనే అప్పటి ప్రజలకు ఆకర్షణ. సీతారామశాస్త్రిది జనాకర్షణ శైలి, సృజనాత్మకమైన స్వతంత్ర మార్గం. నరసింహ శాస్త్రి అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయమైన శైలిలో సంగీతాన్ని నేర్చుకొని, ఆ మార్గంలోనే జీవించిన వారు. సంప్రదాయంపై తిరుగుబాటు ధోరణి ప్రదర్శించే కుమారుని పద్ధతి నరసింహ శాస్త్రిని అసంతృప్తికి గురిచేసేది. ఈ విషయమై తండ్రీ కొడుకులిద్దరి మధ్య అభిప్రాయ భేదాలుండేవి.

1931, అంగీరస నామ సంవత్సరంలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో నరసింహ శాస్త్రి మరణించారు. పరమ ప్రశస్తమయిన రోజని, ఎంతో పుణ్యం చేసిన వారికి గానీ మరణం రాని తిథి అని చెప్పుకునే రోజు భాద్రపద బహుళ ఏకాదశి నాడు ఆయన భగవత్సన్నిధిని చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా సాలూరు ప్రజలనుండి నరసింహశాస్త్రి ప్రత్యేకమైన గౌరవం, ఆత్మీయతలను అందుకున్నారు. సంగీత శిక్షణతో ఎందరో విద్వాసులను రూపొందించి ఆంధ్రదేశంలో సంగీతపరంగా సాలూరుకు ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టిన సాలూరు పెదగురువుగారిగా ఆయన పాత్ర చిరస్మరణీయం.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  1. పట్రాయని వంశవృక్షం