పట్రాయని సీతారామశాస్త్రి

పట్రాయని సీతారామశాస్త్రి (1900 - 1957) సుప్రసిద్ధ గాయకుడు, వాగ్గేయకారుడు. ఇతను సాలూరు చినగురువు గా ప్రసిద్ధుడు. ఇతని తండ్రి పట్రాయని నరసింహశాస్త్రి (సాలూరు పెదగురువు) (1872-1931) వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతని పూర్వీకులు ఒకాయన సైనిక అధిపతిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. పట్రాయుడు అంటే సైనికాధికారి అని అర్థం. వ్యాకరణ రీత్యా ఇంటి పేర్లన్నీ తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో పట్రాయడు అనే ఇంటిపేరు పట్రాయనిగా కనిపిస్తోంది. ఇతను బరంపురంలో విద్యాభ్యాసం చేసి, తన పదహారవ ఏటనే పద్యాలు, కీర్తనలు రచన చేశాడు. దేవాలయంలో సంగీత పోటీల్లో తొలి కచేరి చేసి స్వర్ణ పతకం పొందిన ఘనుడు.

పట్రాయని సీతారామశాస్త్రి
జననం20 మార్చి 1900
మరణం17 ఏప్రెల్ 1957
పిల్లలుపట్రాయని సంగీతరావు
తల్లిదండ్రులు

1936 నుండి ఇతను విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గాత్ర పండితులుగా పనిచేశాడు. ఆ కాలంలోనే ఇతను ఘంటసాలకు గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఘంటసాల ఇతనిని ఉత్తమ గురువులుగా ఎల్లప్పుడు ప్రశంసించేవాడు. ఆనాటి శాస్త్రీయ సంగీత ప్రముఖుల అభిప్రాయానికి వ్యతిరేకంగా. ఈయన కర్ణాటక సంగీతానికి హార్మోనియం పనికొస్తుందని శ్రుతిబద్ధంగా, గమకాలతో వాయించి మరీ నిరూపించారట. అలాగే సంగీతంలో సాహిత్యం ఇమడదు అనే ప్రతిపాదన తప్పని ఆయన వాదించేవారట. తన గాత్రకచేరీలలో సంగీత, సాహిత్యాల నుడికారాలు రెంటినీ సమన్వయం చేసి చూపించేవారట.[ఆధారం చూపాలి] ఇలా సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఈయన ధోరణి సంగీతకళాశాల ప్రిన్సిపల్‌ ద్వారం వెంకటస్వామి నాయుడుగారికి నచ్చేది కాదట. పట్రాయని సీతారామశాస్త్రి ప్రభావం 1938లో విజయనగరం కాలేజీలో చేరిన ఘంటసాలకు చాలా మేలు చేసింది. తెలుగు సినీ సంగీతానికీ, లలిత సంగీతానికీ తెలుగుదనాన్నీ, ఆపాదించడంలో అపూర్వ విజయాన్ని సాధించిన ఘంటసాల ద్వారా ఆంధ్రదేశమంతా సీతారామ శాస్త్రికి ఋణపడి ఉంది.

ఈతని సంస్మరణార్ధం సాలూరు పట్టణంలో "పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య పాఠశాల" స్థాపించబడినది.

ఇతని కుమారుడు పట్రాయని సంగీతరావు[1] కూడా ప్రముఖ సంగీత దర్శకుడు.

మూలాలు

మార్చు
  1. "ప్రముఖ సంగీత విద్వాంసుడు పట్రాయని అస్తమయం". andhrajyothy. Retrieved 2021-11-15.
  • రాజునే మృదంగ విద్వాంసునిగా మలచుకున్న మహా కళాకారుడు, ఎందరో మహానుభావులు (అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు), తనికెళ్ళ భరణి, హాసం ప్రచురణలు, హైదరాబాదు, 2007.

బయటి లింకులు

మార్చు

సాలూరు చినగురువుగారు(పట్రాయని సీతారామశాస్త్రిగారి జీవితవిశేషాలు, సంగీత సాహిత్యాల గురించి పరిచయవ్యాసం)- పొద్దు పత్రికలో.http://poddu.net/2010/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/

  1. పట్రాయని వంశవృక్షం