పదహారేళ్ళ వయసు

1978 సినిమా

తెలుగు చిత్రసీమలో శ్రీదేవిని తారగా నిలిపిన చిత్రమిది. 1978 ఆగస్టు 31 న విడుదలైన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంది. అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్, పల్లెటూరి పోకిరిగా మోహన్ బాబు నటించారు.

పదహారేళ్ళ వయసు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం మిద్దే రామారావు
తారాగణం చంద్రమోహన్ ,
శ్రీదేవి,
మోహన్ బాబు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

చిత్ర విశేషాలు

మార్చు

ఈ చిత్రానికి మాతృక పదునారు వయనదిలే అనే తమిళ చిత్రం. భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడ కూడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా కమల్ హాసన్, పోకిరిగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమా వెనుక ఒక తమాషా సంఘటన ఉంది. ఈ చిత్రానికి ఎస్.ఎ.రాజకన్ను నిర్మాత. ఈయన ఒక సొంత లారీ ఉన్న డ్రైవర్. సినిమా పిచ్చి. కొంత సొమ్ము సంపాదించాక భారతీరాజాను కలిసి సినిమా తీస్తాను అంటే ఈ కథ చెప్పారు. 4.5 లక్షల రూపాయల్లో పూర్తవుతుందని చెప్పారు. సినిమా మొదలయ్యాక 1.5 లక్షలు బడ్జెట్ పెరిగింది. అందుకోసం లారీ, కొన్ని వస్తువులు కూడా అమ్మేశాడు రాజకన్ను. ఆరు ప్రింట్లతో తమిళనాడులో విడుదలైంది. ఓ మాదిరి చిత్రం అన్నారు. నాలుగు వారాల తరువాత ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఎక్కడచూసినా ఇళయరాజా బాణీలు, శ్రీదేవి-కమల్-రజనీ ల నటన గురించే చర్చ. పూర్తి చేసేందుకు లారీ అమ్ముకున్న రాజకన్ను, ఆదాయపు పన్ను వారి నుంచీ, రీమేక్ ల కోసం వస్తున్న ఒత్తిళ్ళ నుంచి తప్పించుకొనేందుకు దాక్కోవలసి వచ్చింది. విశ్రాంతి కోసం మైలాపూర్ లోని దేవకీ ఆస్పత్రిలో చేరిపోయారు. ఆ ఆచూకీ తెలుసుకొని తెలుగు నిర్మాత మిద్దే రామారావు అక్కడికి వెళ్ళి 1.25 లక్షల రూపాయలిచ్చి రీమేక్ హక్కులు పొందారు. అప్పట్లో రీమేక్ హక్కులకు 40 వేల రూపాయలకు మించి ఇచ్చేవారు కాదు.

మిద్దే రామారావుతో అంగర సత్యం, అంగర లక్ష్మణ రావు కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే దీనికి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావించారు. అప్పటికే ఆయన అడవి రాముడు విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రీమేక్ ని ఒప్పుకుంటాడా లేదా అన్న సందేహంతో నిర్మాతలు ఆయన్ను సంప్రదించారు. అప్పటికీ తమిళ చిత్రం చూసిన ఆయన సినిమా పై ఆసక్తి చూపించి చేశారు. శ్రీదేవినే నాయికగా తీసుకున్నారు. ఆమె 50,000 రూపాయలు పారితోషికం అడిగితే 35,000 రూపాయలు ఇచ్చారు నిర్మాతలు. చంద్రమోహన్ కి 17,000 మోహన్ బాబుకి 10,000 రూపాయలు ఇచ్చారు. సంగీత దర్శకుడు చక్రవర్తి మాతృక నుంచి ఒక్క బాణీనే తీసుకున్నాడు. అదే సిరిమల్లె పువ్వా అనే పాట. దీనిని జానకి గానం చేశారు. అప్పట్లో ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందింది.

చిత్రం ప్రారంభం కాకమునుపే ఈ సినిమా వైపు పలువురు ఆసక్తి చూపించారు. తమిళ చిత్రం చూసి కమల్ చేసిన పాత్రపై శోభన్ బాబు కూడా మోజు పెంచుకున్నారు. అయితే గోచీ పెట్టుకుని, డీ గ్లామరస్ గా శోభన్ బాబు కనిపిస్తే బాగుండదని సినీ ప్రముఖులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. అలాగే రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు. దీనికి ముందు ఆమె అనురాగాలు అనే చిత్రంలో నటించింది. అది అంతగా ఆడలేదు. పదహారేళ్ళ వయసు సినిమాను ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తయ్యాక శ్రీదేవిని తమ తదుపరి చిత్రం వేటగాడు కోసం ఎంపిక చేశారు. హిందీలో ఈ సినిమాకి భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా అమోల్ పాలేకర్ నటించారు. అయితే ఇది అక్కడ అంతగా ప్రజాధరణ పొందలేదు. [1]

పాటలు

మార్చు
  • సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా, గానం. ఎస్. జానకి
  • పువ్వులాంటి మల్లి పుస్పించేనమ్మ , గానం . కోరస్
  • వయసంత్తా ముడుపుకట్టి, గానం.ఎస్.జానకి
  • కట్టుకతలు చెప్పి నన్ను నవ్విస్తే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • పంటచెలో పాలకంకి నవ్వింది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .జానకి.

మూలాలు

మార్చు
  1. ఆదివారం ఆగస్టు 31, 2008 ఈనాడు సినిమా ప్రచురించిన వార్త ఆధారంగా