పరమాణువు

రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్
(పరమాణువులు నుండి దారిమార్పు చెందింది)

పరమాణువు (ఆంగ్లం: Atom) అనేది ఒక పదార్థంలో విభజించడానికి వీలునేని భాగం. ప్రతి ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా పదార్థాలలో తటస్థమైన లేదా అయనీకరణం చెందిన పరమాణువులు ఉంటాయి. ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి (సుమారు 100 పికోమీటర్లు). ఎంత చిన్నవిగా ఉంటాయంటే వీటిని టెన్నిస్ బంతులు అనుకుని వాటి ప్రవర్తనను సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా ఊహించడానికి వీలుకాదు. ఇందుకు కారణం క్వాంటం ఫలితం.

ప్రతి పరమాణువు మధ్యలో ఒక కేంద్రకం, దాని చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోటాన్లు, కొన్ని న్యూట్రాన్లు ఉంటాయి. ఒక్క సాధారణ హైడ్రోజన్ లో మాత్రమే న్యూట్రాన్లు ఉండవు. పరమాణు ద్రవ్యరాశిలో సుమారు 99.94% కేంద్రకానిదే. ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఋణావేశాన్ని కలిగి ఉంటాయి. న్యూట్రాన్లకు ఏ ఆవేశం ఉండదు, అనగా తటస్థంగా ఉంటాయి. ఒక పరమాణులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉంటే ఆ పరమాణువు తటస్థంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువగా ఉంటే అది ధనావేశాన్నీ, ప్రోటాన్ల సంఖ్య తక్కువగా ఉంటే అది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది. అటువంటి వాటిని అయాన్లు అంటారు.

పరమాణువులోని ఎలక్ట్రాన్లు విద్యుదయస్కాంత శక్తి వల్ల కేంద్రకంలోని ప్రోటాన్లవైపు ఆకర్షించబడుతూ ఉంటాయి. కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రక బలం వల్ల పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఈ కేంద్రక బలం ధనావేశం కలిగిన ప్రోటాన్లు ఒకదానిని ఒకటి వికర్షించే బలం కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ వికర్షణ బలం కేంద్రక బలం కంటే ఎక్కువైతుంది. అప్పుడు కేంద్రకం విడిపోయి వేరే మూలకాలు ఏర్పడతాయి. ఇది ఒకరమైన రేడియోధార్మిక క్షయం.

కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. దీన్ని బట్టి పరమాణువు ఏ రసాయనిక మూలకానికి చెందినదో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పరమాణువులో 29 ప్రోటాన్లు ఉంటే అది రాగి మూలకం. న్యూట్రాన్లు సంఖ్య మూలకం యొక్క ఐసోటోపును తెలియజేస్తుంది. పరమాణువులు రసాయనిక బంధాల సాయంతో ఒకదానితో ఒకటి కలిసి అణువులు, స్ఫటికాల వంటి రసాయనిక సమ్మేళనాలుగా ఏర్పడతాయి. ప్రకృతిలో కలిగే మార్పులు సాధారణం పరమాణువులు ఒకదానితో ఒకటి కలవడం, విడిపోవడం ద్వారానే కలుగుతుంటాయి. రసాయన శాస్త్రం ఈ మార్పులు అధ్యయనం చేసే శాస్త్రం.

పరమాణు సిద్ధాంతం చరిత్రసవరించు

తత్వ శాస్త్రంలోసవరించు

పదార్థాలన్నీ ఏదో కొన్ని అత్యంత ప్రాథమికమైన విడి భాగాల కలయికతో ఏర్పడిందనేది చాలా ప్రాచీనమైన భావన. ఇది పురాతన గ్రీసు, భారతీయ సంస్కృతుల్లో కనిపిస్తుంది. ఆటం అనే ప్రాచీన గ్రీకు పదానికి విడగొట్టడానికి వీలు లేనిది అని అర్థం.[1][2]

డాల్టన్ గుణిజ నిష్పత్తి నియమంసవరించు

1800 మొదట్లో జాన్‌ డాల్టన్ తన ప్రయోగాత్మక పరిశీలనలు, ఇంకా వేరే శాస్త్రవేత్తల పరిశీలనలు సంకలనం చేసి గుణిజ నిష్పత్తి నియమాన్ని (law of multiple proportions) ప్రతిపాదించాడు. ఒకేరకమైన రసాయనిక మూలకాలు కలిగిన వివిధ రసాయనిక సమ్మేళనాల్లో వాటి పరిమాణంలో తేడా చిన్న పూర్ణ సంఖ్యల నిష్పత్తిచే సూచించవచ్చు. ఈ సరళిని పరిశీలించగా ప్రతి రసాయనిక మూలకం, వేరే మూలకాలతో ఒక మౌలికమైన, స్థిరమైన ద్రవ్యరాశి ప్రమాణాలతో కలుస్తుందని డాల్టన్ కు అనిపించింది.

ఉదాహరణకు రెండు రకాలైన టిన్ ఆక్సైడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో 88.1% టిన్, 11.9% ఆక్సిజన్ కలిగిన నల్లటి పొడి, ఇంకొకటి 78.7% టిన్, 21.3% ఆక్సిజన్ కలిగిన తెల్లటి పొడి.

పద అయోమయంసవరించు

"atom"అనే ఇంగ్లీషు మాటని తెలుగులో అణువు అని కొన్ని చోట్ల, పరమాణువు అని కొన్ని చోట్ల అంటున్నారు. కొన్ని భారతీయ భాషలలో (హిందీ, కన్నడ భాషలలో) "atom"ని పరమాణువు అంటారుట. "మోలిక్యూల్"ని అణువు అంటారుట. కాని అణుశక్తి వంటి ప్రయోగాలలో అణువు అంటే "atom" అనే అర్థం అవుతోంది. ఈ అయోమయాన్ని నివృత్తి చేసేందుకు పై నిర్వచనాలు ఇవ్వడం జరిగింది.

స్వరూపంసవరించు

అణువు = ఏటం

అణుశక్తి = ఎటామిక్‌ ఎనర్జీ

అణ్వస్త్రం = ఎటామిక్‌ వెపన్‌ (ఉ. ఏటం బాంబు)

పరమాణువు = సబ్‌ ఎటామిక్ పార్టికిల్‌ (ఉ. ఎలక్‌ట్రాన్, ప్రోటాన్‌, నూట్రాన్‌, వగైరా)

పరమాణు రేణువు = సబ్‌ నూక్లియార్‌ పార్టికిల్‌ (ఉ. క్వార్క్)

బణువు = మోలిక్యూల్‌ (ఉ. NaCl, H2O, CH4)

బృహత్‌ బణువు = మెగా మోలిక్యూల్‌ (ఉ. జీవరసాయనంలో కనబడే అనేక పదార్థాలు, ఆంగిక రసాయనంలో కనబడే అనేక పదార్థాలు)

కణిక = నూక్లియస్‌ (జీవశాస్త్రం లోను, భౌతిక శాస్త్రంలోను ఇదే పదం వివిధమైన అర్థాలతో వాడవచ్చు.)

కణ్వస్త్రం = నూక్లియార్‌ వెపన్‌ (హైడ్రొజన్‌ బాంబు)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Pullman, Bernard (1998). The Atom in the History of Human Thought. Oxford, England: Oxford University Press. pp. 31–33. ISBN 978-0-19-515040-7.
  2. Melsen (1952). From Atomos to Atom, pp. 18-19
"https://te.wikipedia.org/w/index.php?title=పరమాణువు&oldid=3047368" నుండి వెలికితీశారు