పాపనాశం రామయ్య శివన్ (26 సెప్టెంబరు 1890 – 1 అక్టోబరు 1973)[1]) ఒక భారతీయ కర్ణాటక సంగీత స్వరకర్త, గాయకుడు. ఇతడు 1930, 40 దశకాలలో కన్నడ, తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[2]

పాపనాశం శివన్
జననం
పాపనాశం రామయ్య శివన్

26 సెప్టెంబరు 1890
తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, పొలగం గ్రామం
మరణం1973 అక్టోబరు 1(1973-10-01) (వయసు 83)
వృత్తికర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, స్వరకర్త

ఇతడు "తమిళ త్యాగరాజు"గా పేరు గడించాడు. ఇతడు స్వరపరచిన కృతులను ఎం.కె.త్యాగారాజ భాగవతార్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ప్రచారంలోకి తెచ్చారు.[3]

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు తంజావూరు జిల్లాలోని పొలగం గ్రామంలో ఒక శ్రోత్రీయ కుటుంబంలో జన్మించాడు. ఇతని జన్మనామం రామయ్య. ఇతని 7 యేళ్ళ వయసులో ఇతని తండ్రి మరణించాడు. దానితో ఈమె తల్లి యోగాంబాళ్ తన కొడుకులతో తంజావూరు వదిలి కేరళలోని తిరువనంతపురానికి తన సోదరుని వద్దకు వెళ్ళింది.రామయ్య తిరువనంతపురంలో మలయాళభాషను నేర్చుకున్నాడు. తరువాత మహారాజా సంస్కృత కళాశాలలో వ్యాకరణశాస్త్రాన్ని అభ్యసించాడు.

రామయ్య ఎక్కువ దైవభక్తి కలవాడు. తన 20 యేళ్ళ వయసులో 1910లో తల్లి కూడా మరణించడంతో ఊరూరా తిరిగి దేవాలయాలలో భగవంతుని కీర్తనలను పాడేవాడు. తిరువంతపురంలో నీలకంఠశివన్ గానకచేరీలకు తరచుగా హాజరయ్యేవాడు. ఆ విధంగా ఇతడు నీలకంఠశివన్ కృతులన్నింటినీ నేర్చుకున్నాడు. ఈ సమయంలో ఇతడు తరచుగా పాపనాశంలోని దేవాలయానికి వెళ్ళి అక్కడ భస్మాన్ని తన ఒంటి నిండా పూసుకునేవాడు. దానితో ప్రజలు ఇతడిని పాపనాశం శివన్ అని పిలిచేవారు. చివరకు ఇతనికి ఈ పేరే స్థిరపడి పోయింది.

ఇతడు మొదట నూరని మహాదేవ భాగవతార్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. తరువాత కోనేటిరాజపురం వైద్యనాథ అయ్యర్ వద్ద తన సంగీతాన్ని మెరుగు పరచుకున్నాడు.

ఇతనికి భక్తి సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. ఇతరులను తనతో పాటుగా భక్తి పాటలను పాడటానికి ప్రోత్సహించేవాడు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆలయాలలో జరిగే సంగీత ఆరాధన ఉత్సవాలలో ఇతడు తరచుగా పాల్గొనేవాడు.

1962లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.[4] 1969లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారు "సంగీత కళాశిఖామణి" పురస్కారం అందజేశారు. 1971లో మద్రాసు సంగీత అకాడమీ నుండి సంగీత కళానిధి పురస్కారం స్వీకరించాడు. 1972లో భారత ప్రభుత్వం ఇతడిని మూడవ అత్యంత గొప్ప పౌరపురస్కారం పద్మభూషణ్‌తో గౌరవించింది.

కుటుంబం

మార్చు

ఇతడు లక్ష్మీ అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, రామదాసు, కృత్తివాసన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమార్తె రుక్మిణీ రమణి, మరో కుమార్తె నీలా రామమూర్తి, మనుమడు అశోక్ రమణి కూడా సంగీత విద్వాంసులు. ఇతడు రచించిన కృతులలో ఎక్కువగా తన కుమారునికి నివాళిగా "రామదాస" ముద్రతో ఉన్నాయి. ఇతని అన్న రాజగోపాల్ అయ్యర్ కుమార్తె వి.ఎన్.జానకి. ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ సతీమణి.

ఫిల్మోగ్రఫీ

మార్చు

ఇతడు కొన్ని తమిళ, కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని:

శిష్యులు

మార్చు

ఇతని శిష్యులలో డి.కె.జయరామన్, ఎస్.రాజం, డి.కె.పట్టమ్మాళ్ మొదలైనవారున్నారు.

మూలాలు

మార్చు
  1. Tamizh Thyaagayyar – The life and Music of Paapanaasam Sivan : Lec-Dem by Dr.Rukmini Ramani[permanent dead link]
  2. Mark Slobin (29 September 2008). Global Soundtracks: Worlds of Film Music. Wesleyan University Press. pp. 122–. ISBN 978-0-8195-6882-3. Retrieved 10 July 2013.
  3. శంకరనారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 129. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 19 February 2021.
  4. "SNA: List of Sangeet Natak Akademi Ratna Puraskar winners (Akademi Fellows)". Official website. Archived from the original on 2017-01-01. Retrieved 2021-02-19.