పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహకనౌక

పిఎస్ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహకనౌకను భారత దేశపు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసి, ఈ వాహక నౌక ద్వారాఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ (IRNSS-1C) అను నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టుటకు పిఎస్ఎల్‌వి వాహకనౌక అంత్యంత నమ్మకమైన రాకెట్. పిఎస్ఎల్‌వి-రాకెట్ శ్రేణికి సంబంధించి పిఎస్ఎల్‌వి-సీ26 వాహకనౌక 28 వది. పిఎస్ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహక నౌక పిఎస్ఎల్‌వి-రాకెట్ శ్రేణిలో Xl రకానికి చెందినది. XL రకపు రాకెట్ ద్వారా 1400-1700కిలోల వరకు బరువు ఉన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టవచ్చును. పిఎస్ఎల్‌వి-రాకెట్ శ్రేణిలో Xl రకానికి చెంది, పిఎస్ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహక నౌక 7 వ వాహక నౌక. అంతకు ముందుప్రయోగించిన ఆరు పిఎస్ఎల్‌వి-రాకెట్ శ్రేణిలో Xl రకానికి చెందిన వాహక నౌకలలో పిఎస్ఎల్‌వి-సీ11 ద్వారా చంద్రయాన్ -1, పిఎస్ఎల్‌వి-సీ17 ద్వారా జీశాట్-12, పిఎస్ఎల్‌వి-సీ19 ద్వారా రీశాట్-1, పిఎస్ఎల్‌వి-సీ22 ద్వారాఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ, పిఎస్ఎల్‌వి-సీ25ద్వారా మార్స్ ఆర్బిటర్ అంతరిక్షనౌకను, పిఎస్ఎల్‌వి-సీ24 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.[1]

పిఎస్ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహక నౌక నిర్మాణ వివరాలు మార్చు

పిఎస్ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహక నౌక బరువు 320 టన్నులు. పొడవు 44.4 మీటర్లు. వాహక నౌక 4 అంచెలు/ దశలు కలిగి ఉంది. మొదటి, మూడవ దశలో ఘన ఇంధనాన్ని, రెండవమరియు నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు. మొదటి దశకు అదనంగా 6 స్ట్రాపాన్ మోటరులు అనుసంధానం చెయ్యబడి ఉన్నాయి. పిఎస్ఎల్‌వి-ఎక్సుఎల్ శ్రేణి రాకెట్ లలో పెద్దవైన, అధిక శక్తి వంతమైన స్ట్రాపాన్ బుస్టరు మోటరు లను ఉపయోగించడం వలన, ఈ రాకెట్ యొక్క మొదటి దశ/అంచె/స్టేజి యొక్క చోదకశక్తి ద్విగుణికృతం చెయ్యబడింది. PS1 అనబడు మొదటి దశ, ఘని ఇంధనం నింపబడిన S-138 రాకెట్ మోట రును కలిగి ఉంది, దీనికి బాహ్య వలయంలో ఆరు PS0M-XL బూష్టరులు అనుసంధానింపబడి ఉండును. ప్రతి స్ట్రాపాన్ బూస్టరు S-12 మోటరును కలిగి ఉంది. PS2 అనబడు రెండవ L-40 దశ, మొదటి దశ పైభాగాన ఉండును. ఇందులో ద్రవ ఇంధనంద్వారా పనిచేయు వికాస్ ఇంజను అమర్చబడి ఉంది. ఈ దశలో UH25మరియు డై నైట్రోజన్ టెట్రాక్సైడ్లు ద్రవచోదకం/ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ దశలోఉపయోగించు వికాస్ ఇంజను ఫ్రాన్స్కు చెందిన వైకింగ్ ఇంజన్ (ఏరియన్ రాకెట్ సంస్థ ) నుండి లైసెన్సు తీసికొని ఇస్రో సంస్థ స్వంతగా భారతదేశంలో నిర్మించి ఉపయోగిస్తుంది. మూడవ దశ PS3. దీనిలో S-7 అను ఘన ఇంధనాన్ని మండించు రాకెట్ మోటరు అమర్చబడింది. మూడవ దశపైన PS4అను నాల్గొవదశ తిరిగి ద్రవ ఇంధనం మండించు మోటరు కలిగిన దశ, ఇందులోద్రవ ఇంధనాన్ని మండించుటకు రెండు ఇంజన్లు అమర్చబడి ఉన్నవి[2]

పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానంతర వివరాలు మార్చు

కౌంట్‌డౌన్‌కు మూడు సెకన్ల ముందు మొదట రోల్‌కంట్రోల్ త్రస్టరులు మండటం ప్రారంభించాయి. కౌంట్‌డౌన్ సున్నాకు చేరగానే మొదటిదశ ఇంజను మోటరులు మండటం మొదలైనది, 0. 4 సెకన్లకు మొదటి రెండు స్ట్రాపాన్ మోటరులు మండటం ప్రారంభించాయి, 0. 6 సెకన్ల తరువాత మరో రెండు స్ట్రాపాన్ మోటరులు మండటం ప్రారంభించాయి. వాహకనౌక కచ్చితంగా 20:02 గంటలకు (UTC కాలమానం) కు వేదికనుండి అంతరిక్షము వైపు తనప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో మండించిన స్ట్రాపాన్ ఇంజనులు సెకనుకు 1. 6 మెట్రిక్ టన్నుల చోదక ఇంధనాన్ని ఉపయోగిస్తూ మండటం ప్రారంభించాయి. ఈసమయంలో ఏర్పడినమొత్తం లిప్ట్ ఆఫ్ త్రస్ట్ 700,600 కిలో గ్రాము-ఫోర్స్. రాకెట్ తన గమనం మొదలు పెట్టిన 25 సెకన్ల తర్వాత మిగిలిన రెండు స్ట్రాపాన్ మోటరులు మండటం ప్రారంభించాయి. ఈ రెండు బుస్టారు/స్ట్రాపాను మోటరుల దహనం వలన, రాకెట్ కు అదనంగా 102,500kgf శక్తి అందుబాటులోకి రావటం వలన రాకెట్ త్వరణం పెరుగుటకు దోహదపడినది. బూస్టరు/స్ట్రాపాన్ మోటరుల పొడవు 13. 5 మీటర్లు, అందులో నింపిన చోదక పరిమాణం 12. 0 మెట్రిక్ టన్నులు. దహన సమయం 49. 5 సెకన్ల కాలం.[2]

50 సెకన్ల తర్వాత భూస్థాయిలో మండించిన స్ట్రాపాన్ బూస్టరుల దహన చర్య ముగిసింది. బూస్టరుల దహన చర్య ముగిసిన 1 నిమిషం పది సెకన్లకు, ఈ నాలుగు బూస్టారులు రాకెట్ నుండి రెండువేరువేరు జతలుగా 0. 1 సెకను కాల వ్యత్యాసవ్యవధిలో వేరు పడినవి. బూస్టరులు వేరుపడు సమయానికి వాహకనౌక సెకనుకు 1.47 కిలోమీటర్ల త్వరణంతో, 23 కిలోమీటర్ల ఎత్తులో పయనిస్తున్నది. రాకెట్ తన పయనాన్ని ప్రారంభించిన 92 సెకన్ల తరువాత, మిగిలిన రెండు బూస్టరు/స్త్రాపాను మోటరులు వాహననౌక నుండి వేరుపడినవి. 1:40 నిమిషాలకు మొదటి దశ PS1దహన క్రియ పూర్తయి, వేరుపడిన రెండు సెకన్ల తరువాత రెండవ దశచోదక దహన క్రియ మొదలైనది, మొదటి దశ వేరు పడు సమయానికి వాహకనౌక 56 కి. మీ ఎత్తులో, 2. 4 కి. మీ /సెకనుకు త్వరణంతో పయనిస్తున్నది. మూడు నిమిషాల 19. 8సెకన్ల తరువాత,113 కిలోమీటర్ల ఎత్తులో, ఉపగ్రహం చుట్టూ 3.2 మీటర్ల వ్యాసము తో, 8.3 మీటర్ల పొడవున్న ఉన్నరక్షక పేటిక/కవచం వేరుపడినది[2].

రెండవదశ దహనచర్య 4:21 నిమిషాలపాటు కొనసాగినది. ఈ సమయంలో రాకెట్ భూమికి 132 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రెండవదశ వేరుపడిన 1. 1 సెకన్లకు మూడవదశ దహనక్రియ మొదలైనది. రాకెట్ త్వరణం 5. 4 నుండి 7.7 కి. మీ/సెకండుకు పెరిగింది. మూడవదశలో దహనక్రియ 113 సెకన్లపాటు జరిగింది. మూడవదశ చోదనక్రియ 6 నిమిషాల 15 సేకన్ల వరకు జరిగింది. 11 నిమిషాల 2 సెకన్లకు మూడవ దశ నాల్గవదశ నుండి వేరుపడినది. తదుపరి 10 సెకన్ల తరువాత నాల్గవ దశలోని రెండు ఇంజన్లు మండటం మొదలై, 8.5 నిమిషాలవరకు కొనసాగింది. రాకెట్ వేగం 9.64 కి.మీ./సె. కు పెరిగింది. వాహక నౌక ప్రయోగ వేదిక నుండి బయలు దేరిన19. 5 నిమిషాలకు, భూమినుండి 448 కి. మీ ఎత్తులో, 284 కి. మీ పెరిజీ, 20,648 కి. మీ అపోజి, 17. 86 డిగ్రీల ఏటవాలు తలానికి చేరింది,20 నిమిషాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహం కక్ష్యలొకి విడుదల చెయ్యబడినది[2].

ఉపగ్రహ ప్రయోగ వేదిక మార్చు

పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి, అక్టోబరు 16 2014 న ఉదయం 01:32 గంటలకు ప్రయోగించారు.[3]

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింకుల వీడియో మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. "PSLV-C26/IRNSS-1C" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2015-07-12. Retrieved 2016-02-10.
  2. 2.0 2.1 2.2 2.3 "Indian PSLV successfully launches third IRNSS Navigation Satellite". spaceflight101.net. Archived from the original on 2016-02-10. Retrieved 2016-02-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "PSLV-C26 Successfully Launches India's Third Navigation Satellite IRNSS-1C". isro.gov.in. Archived from the original on 2015-01-15. Retrieved 2016-02-10.