పులికంటి కృష్ణారెడ్డి

పులికంటి కృష్ణారెడ్డి (జూలై 30, 1931 - నవంబర్ 19, 2007) కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా "రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి - రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవాణ్ణి" అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి.[1]

పులికంటి కృష్ణారెడ్డి
పులికంటి కృష్ణారెడ్డి
జననంపులికంటి కృష్ణారెడ్డి
(1931-07-30)1931 జూలై 30
India జక్కిదోన గ్రామం,వెదురుకుప్పం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2007 నవంబరు 19
ప్రసిద్ధికథా రచయిత, నాటక రచయిత, కవి, గాయకుడు, నటుడు
మతంహిందూ
భార్య / భర్తసుదేష్ణా దేవి
పిల్లలు1 కుమారుడు, 5 కుమార్తెలు
తండ్రిపులికంటి గోవిందరెడ్డి
తల్లిపాపమ్మ

జీవిత విశేషాలు సవరించు

1931, జూలై 30చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. పులికంటి గోవిందరెడ్డి, పాపమ్మ దంపతులు ఇతని తల్లిదండ్రులు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదోనలోనే సాగింది. ఉన్నతపాఠశాల విద్యకోసం తిరుపతిలోని తిరుపతి దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాల (నేటి ఎస్వీ ఉన్నత పాఠశాల) లో చేరాడు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు. నాటకాలు వ్రాయడంలో, వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమాలు నేర్పింది చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ.

రచనలు సవరించు

ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు. రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. ఇతని కథలు ఇంగ్లీషు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ళ మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది. ఈయన రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి. ఇతడు ఎన్నో జాతీయ కవిసమ్మేళనాలలో పాల్గొని తన కవితాగానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవాడు.

నాటకరంగం, బుర్రకథలు సవరించు

ఇతడు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. నాటకరచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందాడు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇతడిని నటనాగ్రేసరుడు అని కొనియాడాడు. ఇతడు బుర్రకథ గాయకుడు కూడా. కమ్మని గానంతో, చమత్కారవ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతడిని పొగడ్తలతో ముంచెత్తినారు. ఇతడు మంచి వక్త కూడా. జానపద వాజ్మయం మీద, నాటకరంగం మీద ఈయనకు మంచి పట్టు ఉంది.

కామధేను సవరించు

ఇతడు తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్యపత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపాడు. ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా కవులకు, ఇతర రచయితలకు ప్రోత్సాహం కలిగించాడు. ఈ పత్రక చేసిన సాహిత్యసేవ గణనీయమైనది.

పురస్కారాలు సవరించు

అగ్గిపుల్ల' నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్‌ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించాడు. నటుడిగా, రచయితగా కవిగా పలుబిరుదులు, సన్మానాలు అందుకున్నాడు. ఈయన రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పీహెచ్‌డీ, ముగ్గురు ఎంఫిల్‌ పట్టాపొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఈయనను గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. తన సాహితీ, కళారంగాల కృషికిగాను ఎన్నో ఆవార్డులు, రివార్డులు పొందిన ఈయన పులికంటి సాహితీ సత్కృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించాడు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాలు పేరుతో పుస్తకంగా తెచ్చాడు.

మరణం సవరించు

తిరుపతిలో 2007 నవంబరులో జరగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా సన్మాన గ్రహీతల్లో కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఈ లోపే, 2007, నవంబర్ 19 న పులికంటి కన్నుమూశాడు.

మూలాలు సవరించు

  1. విశ్వనాథ, అరుణాచలం (2017-03-01). "సీమ చిన్నోడు చాల పెద్దోడు". పెన్నేరు పక్షపత్రిక: 13.

బయటిలింకులు సవరించు