పూసపాటి విజయరామ గజపతి రాజు

రాజకీయ నాయకుడు

పూసపాటి విజయరామ గజపతి రాజు, (పి.వి.జి.రాజు) "The Raja Saheb of Vizianagaram" (b. 1 మే, 1924 - d. 14 నవంబర్, 1995) భారతదేశపు పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, దాత. విజయనగరం రాజవంశానికి చెందిన మహారాజా అలక్ నారాయణ గజపతి, మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కొడుకు.

పూసపాటి విజయరామ గజపతి రాజు

వీరు విజయనగరం ఫూల్ బాగ్ ప్యాలెస్లో జన్మించారు. విశాఖపట్నంలోని సెయింట్ అలోయిసిస్ కాన్వెంటులోనూ, బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలోను, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదువుకున్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

వీరు సింహాచలం దేవస్థానంతో సహా ఇంచుమించుగా 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు. వీరు కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ ప్యాలెస్‌తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేశారు. దీని మూలంగా మొత్తం దేశంలోని 20 సైనిక్ పాఠశాలలో మొదటిదైన కొరుకొండ సైనిక పాఠశాల ఇక్కడ ప్రారంభించబడింది. ఇలాంటి పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. వీరు తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) విద్యాసంస్థను స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు.

వీరు 1952, 1956 లలో మద్రాసు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికైనారు. మరలా 1960, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించారు. వీరు రెండవ, ఐదవ లోక్‌సభకు విశాఖపట్టణం నుండి, ఆరవ, ఏడవ లోక్‌సభకు బొబ్బిలి నుండి ఎన్నికైనారు. సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ (ఇండియా)కి చైర్మన్‌గా పనిచేశాడు.

వీరు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కరివెన ఈనాం రైతు సత్యాగ్రహంలోను, గుంటూరు జిల్లా మాచర్ల వద్ద నాగార్జున సాగర్ ప్రాంత రైతు యాత్రలోను, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో సత్యాగ్రహాలకు నాయకత్వం వహించి జైలుశిక్షను అనుభవించారు.

వీరు క్రీడాభిమానులు. ఈత, గుర్రపు పందెములు మొదలైన బాహ్య క్రీడలయందు అభిరుచి కలిగి ఉన్నారు. విల్లింగ్‌టన్ స్పోర్ట్స్ క్లబ్ (బొంబాయి), క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (బొంబాయి), మద్రాసు రేస్ క్లబ్, కాస్మాపాలిటన్ క్లబ్ (మద్రాసు), మద్రాసు జింఖానా క్లబ్, ఢిల్లీ జింఖానా క్లబ్, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్ మొదలైన వాటిలో సభ్యత్వము కలిగి క్రీడారంగానికి సహకారాన్నందించారు. ఆంధ్రా క్రికెట్ సంఘానికి చాలా సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు