పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. నీలం సంజీవరెడ్డి మొదటి మంత్రివర్గంలో వ్యవసాయశాఖా మంత్రిగా పనిచేశాడు. ఆచార్య ఎన్.జి.రంగా శిష్యుడు.
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి 1914లో వాయల్పాడు తాలూకా, కంభంవారిపల్లె మండలం చీనేపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రి అన్నారెడ్డి. తిమ్మారెడ్డి మదనపల్లె దివ్యజ్ఞాన సమాజ కళాశాలలో బి.ఏ. వరకు చదివాడు. ఎన్.జి.రంగా నిర్వహించిన రామానీడు రాజకీయ పాఠశాలలో పాల్గొన్నాడు.[1] 1938లో కొన్నాళ్ళు రంగా ఆధ్వర్యంలో ప్రచురించబడిన వాహినీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. 1941లో రాయలసీమ రైతు రక్షణ యాత్రలో భాగంగా 500 మైళ్లు కాలినడకన నడిచాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 డిసెంబరు నుండి 1945 జనవరి వరకు వెల్లూరు, తంజావూరు జైళ్ళలో గడిపాడు. 1946 నుండి రెండు పర్యాయాలు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1952లో మద్రాసు శాసనసభ్యుడిగా ఎన్నికై, టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రి అయ్యాడు.[2]
భారత జాతీయ కాంగ్రేసు అగ్రనేత, ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్రమంత్రిగా పేరుగాంచిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఎన్నికల రాజకీయ జీవితం 1952లో తొలిసారి పీలేరు శాసనసభ నియోజకవర్గం నుండి గెలవడంతో ప్రారంభమైంది. 1952లో కృషీకార్ లోక్ పార్టీ సభ్యుడిగా పోటీచేశాడు.[3] ఆ తర్వాత కాంగ్రేసు పార్టీలో చేరి వాయల్పాడు నియోజకవర్గం నుండి మూడు సార్లు (1955, 1964 ఉప ఎన్నిక, 1967) శాసనసభకు ఎన్నికయ్యాడు. [3] 1962లో నల్లారి అమరనాథరెడ్డి చేతిలో ఓడిపోయాడు. కానీ అమరనాథరెడ్డికి, అర్హతల ప్రకారం, ఎన్నికల సమయానికి పాతికేళ్లు నిండలేదన్న కారణంగా, ఆయన ఎన్నిక చెల్లదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. తత్ఫలితంగా జరిగిన 1964 ఉపఎన్నికలో తిరిగి తిమ్మారెడ్డి గెలిచాడు.[3]
తిమ్మారెడ్డి, 1956లో నీలం సంజీవరెడ్డి తొలి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశాడు. 1964 ఉప ఎన్నికలో తిరిగి శాసనసభ ఎన్నికైన తర్వాత, అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1967 నుండి 1971 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.[2]
ఈయన సతీమణి లక్ష్మీదేవమ్మ. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి రైతు సంఘపు నాయకుడు. కుమార్తె బృందమ్మ, చిత్తూరు జిల్లాకే చెందిన మరో రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి[4]
ఈయన పేరు మీదుగా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అవార్డును స్థాపించారు.
మూలాలు
మార్చు- ↑ మాదాల, వీరభద్రరావు (1986). జాతీయ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రుల ఉజ్జ్వల పాత్ర (PDF). హైదరాబాదు: కల్చరల్ రినైజాన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా. p. 297. Retrieved 22 September 2024.
- ↑ 2.0 2.1 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 512. Retrieved 12 August 2024.
- ↑ 3.0 3.1 3.2 కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 149.
- ↑ "బొజ్జల కుటుంబంలో మరో విషాదం - Andhrajyothy". web.archive.org. 2022-05-08. Archived from the original on 2022-05-08. Retrieved 2022-05-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)