పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

పేరిణి శివతాండవం
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పేరిణి నాట్య కళాకారుల ప్రదర్శన
గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియం ప్రారంభోత్సవం సందర్భంగా 2019 డిసెంబరు 15న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన సాంస్కృతిక సంబరాలులో పేరిణి నాట్య ప్రదర్శన

నృత్యం తీరు

మార్చు
 
శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర దేవాలయంలో 2019, మార్చి 4న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన శివార్చన కార్యక్రమంలో పేరిణి నాట్య ప్రదర్శన

పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరణికి అతి ముఖ్యమైనది. ఓ పరమశివా? నాలో శివ శక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నాశరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు.[1]

పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివ తాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం.

ఈ నృత్య భంగిమలు రామప్ప దేవాలయంలోని శిల్పంలో కనబడుతాయి. సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది ఉమా వైజయంతీమాల.

కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, హనుమకొండ వెయ్యి స్థంభాల గుడి ముఖ మండపంలోనూ, పాలం పేట రామప్ప దేవాలయంలోనూ చూడ వచ్చును.

శివ కేశవుల ఎదుట పేరిణి

మార్చు

మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన కోటప్ప కొండ, శ్రీశైలం మొదలైన పుణ్య క్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.

ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న కారంపూడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయా లున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్న జతులు ప్రదర్శీప బడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేక పర్చేవి. పూర్వ వీరులు ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, సాంబ్రాణి ధూపంలో మునిగి పోయి, సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పీయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.


మూలాలు

మార్చు
  1. మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). "  పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం".   తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 

బయటి లింకులు

మార్చు