పేరేప మృత్యుంజయుడు

పేరేప మృత్యుంజయుడు (అక్టోబర్ 5, 1914 - మే 16, 1950) భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్ర్యసమర యోధుడు

పేరేప మృత్యుంజయుడు

జీవిత విశేషాలు

మార్చు

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో పేరేప వెంకటసుబ్బయ్య, మహాలక్ష్మిలకు 1914, అక్టోబర్ 5 న జన్మించారు. ఆచంటలో మాధ్యమిక పాఠశాల చదువయ్యాక ధవళేశ్వరం వెళ్లి మేనమామ మొక్కపాటి శేషయ్య గారి ఇంట్లో ఉంటూ రాజమండ్రి ప్రభుత్వ మోడల్‌ సెకండరీ స్కూలులో చదివారు. చదువయ్యాక (1933-34) పి.డబ్ల్యు.డిలో రోజు కూలికి మేస్త్రీగా పనిచేశారు.1925-26 ప్రాంతంలో భానుమతి (1917)తో పెళ్లయింది. 1936 లో నెక్కంటి నరసింహారావు, మీరా లతో పాటు కమ్యూ నిస్టు పార్టీ సభ్యులయ్యారు. బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మీరాతో పాటు బస్సు కార్మికుల్ని సంఘటితపరచటం మొదలుపెట్టారు.1941-42 ప్రాంతంలో యంవియన్‌ కపర్దీని కూడా మోటారు కార్మిక సంఘ నిర్మాణంలో పాల్గొనేందుకు ప్రోత్సహించారు.1937-39 కాలంలో కాళీపట్నం రైతుల పోరాటానికి నాయకత్వం వహించిన అల్లూరి సత్యనారాయణరాజు, ఉద్దరాజురామం లతో కలిశారు.

1940-42 కాలంలో చినమల్లంగ్రామం వద్ద 60- 70 మంది పార్టీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణా శిబి రంలో సైద్ధాంతిక శిక్షణతో బాటు కొంత మిలటరీ శిక్షణ కూడా యిచ్చారు. దీనికి మృత్యంజయుడు ప్రిన్సిపా లుగా ఉన్నారు. ఇందుకూరి సుబ్బరాజు మిలటరీ శిక్షణ నిచ్చారు. వ్యవసాయ కూలీ లతో ఆచంట నుంచి నరసా పురం తహశీల్దారు ఆఫీసుకి 1940లో ఆకలి యాత్ర నిర్వ హించారు. 1940-42 మధ్య కొంత కాలం ఆయన జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.ఆ కాలంలో ఏలూరులో కాపురం ఉన్నారు. ఏలూరులో జిల్లా పోలీసు స్పెషల్‌ బ్రాంచి వారు అరెస్టు చేసి, స్థానిక జిల్లా సబ్‌జైలులో 15 రోజులు రిమాండులో వుంచారు.1944-45లో జైలు నుంచి విడుదలయి వచ్చాక పాలకొల్లులో కాపురం పెట్టారు. నరసాపురం తాలూకా పార్టీ కార్యదర్శిగా వుంటూ, జిల్లా ప్రజానాట్యమండలి ఆర్గనైజరుగా ఉన్నారు. అల్లురామలింగయ్య, పినిశెట్టి శ్రీరామ మూర్తి, చలం మొదలగు కళాకారులను ప్రజానాట్య మండలిలోకి తెచ్చారు.నెక్కల పూడి సుబ్బాయమ్మ గారితో కలిసి అన్నా చెల్లెలు పాట (బెంగాలులో కరువు) వేదికల మీద పాడే వారు.చావుకు వెరవ కురా అన్న పాట తరచు ఒంటరిగా కూడా పాడుకొంటుండేవారని చండ్ర సావిత్రమ్మ, కొండేపూడి రాధ మొదలగు వారు చెప్పారు. పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లుస్వరాజ్యం, వావిలాల గోపాలకృష్ణయ్య తెలంగాణా పోరాటానికి సహాయం కూడగట్టడానికి వచ్చారు. పి.సి.జోషి, పి.సుందరయ్యలు ప్రత్యేకంగా వచ్చి చర్చలు జరిపారు.

1950, మే 16బొమ్మూరుమెట్ట దగ్గర ఎన్ కౌంటర్ లో చనిపోయారు. కాల్చిన యస్‌.ఐ తనికెల సుబ్బారావు కానిస్టేబుళ్ళు మృత్యుంజయుని కాల్చడానికి నిరాకరించగా తాను కాల్చవలసివచ్చిందని, ఆఖరి గుండు పేల్చే వరకూ ఆయన జయజయ నినాదాలు చేస్తూ నిలబడి వున్నారని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర రిక్షా కార్మికులు తమ కాలనీకి మృత్యుంజయ నగర్‌ అని పేరు పెట్టుకున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపు రంలో మృత్యుంజయనగర్‌ కాలనీ, లైబ్రరీ ఏర్పడ్డాయి.వీరి రెండవ కుమారుడు ప్రాచీ పబ్లికేషన్స్ పి.పి.సి.జోషి.[1][2]

మూలాలు

మార్చు
  1. "ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరజీవి మృత్యుంజయుడు -విశాలాంధ్ర 5.10.2013, పరిశీలన తేది:27 అక్టోబర్ 2013". Archived from the original on 2016-03-06. Retrieved 2013-10-27.
  2. మా నాన్న మృత్యుంజయుడు -పి.పి.సి.జోషి (మానాన్న) ప్రజాశక్తి 7.10.2013, పరిశీలన తేది: 27 అక్టోబర్ 2013