ఆచంట

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం

ఆచంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం లోని గ్రామం.[1] ఇది సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది.పాలకొల్లుకి 16 కి.మీ రోడ్ మార్గంఉంది.తణుకుకి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములు బహుళ ప్రసిద్ధి చెందినవి.ఊరిలో ఆర్యవైశ్యులు, కమ్మవారు, బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. చుట్టు ప్రక్కల గల దాదాపు పదిహేను గ్రామాలకు ఆచంట పెద్ద వ్యాపార కేంద్రం.

ఆచంట
—  రెవెన్యూ గ్రామం  —
ఆచంట is located in Andhra Pradesh
ఆచంట
ఆచంట
అక్షాంశరేఖాంశాలు: 16°36′19″N 81°48′30″E / 16.605192°N 81.808223°E / 16.605192; 81.808223
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఆచంట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 20,477
 - పురుషులు 10,235
 - స్త్రీలు 10,242
 - గృహాల సంఖ్య 5,036
పిన్ కోడ్ 534123
ఎస్.టి.డి కోడ్
రామేశ్వర స్వామి వారి మూల విరాఠ్

చరిత్ర

మార్చు

రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను. తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను. అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.[2]

 
రామెశ్వర స్వామి వారి ఆలయ గోపురం

పేరు వెనుక చరిత్ర

మార్చు

ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి, పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయం. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు.[3] శృంగవరపుకోట దానశాసనగ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్తుడని సా.శ.5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు వుండేదని కచ్చితంగా తెలుస్తోంది. సా.శ.1256లో ఆచంట సూర్పరాజుకు అప్పటి ప్రభువు మైలారదేవిని ఇచ్చి వివాహం చేస్తూ, ఆచంట రామేశ్వరునికి పోకతోటలు సమర్పించినట్టు శాసనాలు చెప్తున్నాయి.[2]

ఇతరదేవాలయాలు

మార్చు
 • ఉమా రామలింగేశ్వర ఆలయం, ఆచంట - ఆచంటలోని ఉమారామలింగేశ్వరాలయం బాగా ప్రాచుర్యం పొందింది. ఆలయంలోని రామలింగేశ్వరుణ్ణి సంబోధిస్తూ మేకా బాపన్న కవి వంటివారు ఆచంట రామేశ్వర శతకం వంటి రచనలు చేశారు.[4]
 • శ్రీ మదన గోపాలస్వామి ఆలయం
 • శ్రీ ముత్యాలమ్మ ఆలయం,
 • శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం
 
మదన గోపాల స్వామి వారి దేవాలయం

ఇతర సౌకర్యాలు

మార్చు
 • రక్షణభట నిలయము {ముప్పై గ్రామాలు దీనిపరిధిలో ఉన్నాయి}
 
రాత్రి సమయంలో ఆచంటీశ్వర స్వామివారి గోపుర వెలుగులు

ప్రముఖులు

మార్చు
 • పేరేప మృత్యుంజయుడు: (1914 అక్టోబరు 5- 1950 మే 16,) భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్ర్యసమర యోధుడు.
 • నెక్కంటి సుబ్బారావు: ప్రముఖ రైతుశాస్త్రవేత్త. ఐఆర్ 8 రకం వరి వంగడాన్ని తయారుచేసి ప్రపంచ కరువు తగ్గటానికి దోహదపడ్డారు. (ఈనాడు 5.12.2016).వ్యవసాయాన్ని విద్యాలయాల్లో కాక తన స్వంత పొలంలో ప్రయోగాల ద్వారా నేర్చుకుని దిగుబడుల్లో వ్యవసాయశాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించే పంటతీసిన వ్యక్తి. ఆయన ద్వారా శాస్త్రవేత్తలు కొత్త వరివంగడాలను మార్కెట్లోకి పంపబోయేముందుగా ప్రయోగాత్మకంగా వేసి చూస్తారు. ఏయే వరిరకాలు మన సాగుస్థితిగతులకు నప్పుతాయో ఆచంటలోని పొలంలో వేసి ప్రయోగించి చూసే సుబ్బారావు ఆ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతులు.[5]

ఊరి విశేషాలు

మార్చు

ఆచంటలో ప్రజా వినోదనికై మూడు సినిమా ప్రదర్శన శాలలు ఉన్నాయి.

 • శ్రీ రంగరాయ చిత్రమందిర్
 • శ్రీ నటరాజ్ సినీచిత్ర
 • శ్రీ కళ్యాణ చక్రవర్తి

ఆచంటలో ప్రతి శుక్ర వారం సంత జరుగుతుంది. ఇది పరిసర గ్రామాలలోకెల్ల పెద్దసంత.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,477.[1] ఇందులో పురుషుల సంఖ్య 10,235, మహిళల సంఖ్య 10,242, గ్రామంలో నివాసగృహాలు 5,036 ఉన్నాయి.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5604 ఇళ్లతో, 19507 జనాభాతో 2101 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9786, ఆడవారి సంఖ్య 9721. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 95. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588688[6].పిన్ కోడ్: 534123.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 18, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప బాలబడి ఆచంటలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల పాలకొల్లులో ఉంది. పాలీటెక్నిక్‌ పోడూరు లోను, మేనేజిమెంటు కళాశాల పెనుగొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మార్టేరు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.శ్రీ ముప్పన వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇది రామేశ్వరస్వామి వారి ఆలయము యొక్క చెరువుకు ఆవలివైపున ఉంది.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ఆచంటలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ఆచంటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ఆచంటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 294 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1807 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1807 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ఆచంటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1807 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

ఆచంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, కొబ్బరి, కూరగాయలు

చేతివృత్తులవారి ఉత్పత్తులు

మార్చు

లేసులు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-25.
 2. 2.0 2.1 బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
 3. https://archive.org/details/in.ernet.dli.2015.333133
 4. మేకా, బాపన్న (1956). ఆచంట రామేశ్వర శతకం (1 ed.). ఆచంట: మేకా పల్లమ్మ. Retrieved 10 March 2015.
 5. రాంబాబు, పతంగి (7 జనవరి 2015). "ఆచంట శిగలో ఆకుపచ్చని సిరి". వై.ఎస్.భారతి. సాక్షి. Retrieved 17 February 2015.
 6. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆచంట&oldid=4126357" నుండి వెలికితీశారు