పొట్టబత్తిని పద్మావతి

పొట్టబత్తిని పద్మావతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగ కళాకారిణి, సామాజిక కార్యకర్త. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు వంటి పాత్రలను సమర్ధవంతంగా పోషించి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందింది. 2009లో రాష్ట్రపతి అవార్డు, 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా నారీశక్తి పురస్కారాన్ని, 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్‌ మోడల్‌ అవార్డు, 2022లో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం, 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగన్ అవార్డును అందుకున్నది.[1]

పొట్టబత్తిని పద్మావతి
2022లో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న పద్మావతి
జననం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటి, గాయని, సామాజికవేత్త
తల్లిదండ్రులు
  • సత్యం (తండ్రి)
  • కుసుమ (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

పద్మావతి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో సత్యం - కుసుమ దంపతులకు జన్మించింది. పద్మావతికి ఏడాది వయస్సులో పోలియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఐదేళ్ళ వయస్సులో సెయింట్‌ మేరీస్‌ పోలియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన ఫిజియోథెరపిస్టు క్లారా హీటన్ పద్మావతిని దత్తత తీసుకుంది.

క్లారా పర్యవేక్షణలో 8 శస్త్ర చికిత్సలు జరిపి పాదాలు, నడుము భాగాలు సరిచేశారు. అప్పటివరకు మంచానికే పరిమితమైన పద్మావతి క్యాలిపర్సు, కర్రలు సహాయంతో నడవడం ప్రారంభించింది. మంచం మీద ఉంటూనే చదువు నేర్చుకుంది. తరగతిలో ఎప్పుడూ తనే ఫస్టు వచ్చేది. శాస్త్రవేత్త కావాలనుకున్న పద్మావతికి, దివ్యాంగురాలనే కారణంతో బైపీసీలో సీటు నిరాకరించడంతో హెచ్‌ఈసీలోనే చేరింది. ఆపై డిగ్రీ చేసింది.[2]

సామాజిక సేవ మార్చు

గానం, నాటకరంగంలో ఉన్న ఆసక్తితో క్యాలిపర్సు సహాయంతోనే అనేక పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. వేగేశ్న ఫౌండేషన్‌ సహాయంతో సంగీతంలో శిక్షణ పొందడంతోపాటు, డిగ్రీ పూర్తిచేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నది.

తుర్కయాంజాల్‌ పురపాలక సంఘం పరిధిలోని మునుగనూరులో పద్మావతి ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ ది (డిజ్‌) ఏబుల్డ్‌ అనే సంస్థను స్థాపించి, దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్‌.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నది.[3]

పురస్కారాలు మార్చు

తన ప్రతిభకు ఎన్నో పురస్కారాలు అందుకున్న పద్మావతి మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న పద్మావతి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించబడింది. సెన్సార్‌ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించింది.

మూలాలు మార్చు

  1. శ్రీరాం, యాదయ్య (2023-03-23). "దివ్యమైన ప్రతిభ". Sakshi. Archived from the original on 2023-03-23. Retrieved 2023-03-23.
  2. సూర్య, కుమారి (2022-12-03). "క్యాలిపర్సే కళాకారిణిని చేశాయి". EENADU. Archived from the original on 2022-12-03. Retrieved 2023-03-23.
  3. Mary, S. B. Vijaya (2022-12-02). "National recognition to Telangana woman on the International Day of Persons with Disabilities". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Archived from the original on 2023-03-23. Retrieved 2023-03-23.
  4. "Women and Child Development Ministry Presented 'Stree Shakti Puraskar' 2010 on International Women's Day". Press Information Bureau. Government of India. 2011-03-08. Archived from the original on 11 January 2021. Retrieved 2023-03-23.