ప్రతాపగిరి రామమూర్తి

మహాత్మాగాంధీ పిలుపునందుకొని 1920లో వేలాదిమంది విద్యార్థులు తమ కళాశాల విద్యకు స్వస్తి చెప్పారు. అలాంటి వారిలో కడప జిల్లా నందలూరుకు చెందిన ప్రతాపగిరి రామమూర్తి ఒకడు.[1]

ప్రతాపగిరి రామమూర్తి
ప్రతాపగిరి రామమూర్తి
జననంప్రతాపగిరి రామమూర్తి
ఆగష్టు 25, 1900
కడప జిల్లా నందలూరు
మరణంఅక్టోబర్ 7, 1955
ఇతర పేర్లుఆర్.ప్రతాపగిరి
వృత్తిఅధ్యాపకుడు
ఉద్యోగంఆంధ్ర విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
పదవి పేరురీడర్
మతంహిందూ
భార్య / భర్తశాంతాబాయి
పిల్లలురవీంద్రనాథ్, ప్రమీల
బంధువులువేదాంతం కమలాదేవి
తండ్రిప్రతాపగిరి గోపాలకృష్ణయ్య
తల్లిప్రతాపగిరి భ్రమరాంబ

విశేషాలు

మార్చు

కడప జిల్లా నందలూరులో 1900 ఆగష్టు 25వ తేదీన ఇతడు జన్మించాడు.[2] ఇతని తండ్రి గోపాలకృష్ణయ్య ప్రముఖ న్యాయవాది. జాతీయ భావాలు కలవాడు. ఇంటిల్లిపాది ఖద్దరు దుస్తులు ధరించేవారు. ఇతని అక్క "దేశసేవిక" వేదాంతం కమలాదేవి భర్త కాకినాడ నివాసి కావడంతో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని పలుమార్లు జైలుకెళ్లింది. అక్కగారి ప్రభావంతో రామమూర్తి కాంగ్రెసులో చురుకుగా పనిచేశాడు. రాష్ట్ర కాంగ్రెసు ఆదేశానుసారం "పిల్లుట్ల హనుమంతరావు"తో కలసి కడప జిల్లాలో తీవ్రంగా కాంగ్రెసు ప్రచారం చేసి కల్లుసారాయి దుకాణాలు మూతపడేటట్లు, గ్రామోద్యోగులు రాజీనామా చేసేటట్లు చేశాడు. 1916లో వివాహమయిన శాంతాబాయి చిన్న వయసులోనే రామమూర్తితో పాటు ఉద్యమంలో పాల్గొంటూ వచ్చింది. 1920లో రామమూర్తిని శిక్షించగా ఏడాదిపాటు వేలూరు, కడలూరు జైళ్లలో గడిపాడు. వేలూరిలో ఉన్నవ లక్ష్మీనారాయణ రాస్తున్న ‘మాలపల్లి’ నవలకు ఇతడే శుద్ధ ప్రతి తయారు చేశాడు. కడలూరు జైలులో రాజాజీ ఇతని సహచర ఖైదీగా వుండేవాడు. 1921లో తిలక్ స్వరాజ్య నిధికి గాంధీజీ విరాళాలకు విజ్ఞప్తి చేయగా రామమూర్తి భార్య శాంతాబాయి తన ఒంటిమీద నగలు మంగళసూత్రంతో సహా మహాత్మునికి సమర్పించింది. తిరిగి 1933లో హరిజన్ నిధికి గాంధీజీ రాజమండ్రి రాగా మరొకసారి శాంతాబాయి తన ఒంటిమీది మిగిలివున్న ఆభరణాలను మహాత్మునికి అర్పించింది. ప్రతాపగిరి రామమూర్తి బొంబాయి చేరి ఒక సంవత్సరం జౌళి మిల్లులో పనిచేసి డబ్బు సమకూర్చుకొని మరుసటి సంవత్సరం విల్సన్ కాలేజీలో చదివి బీఏ, ఎం.ఏ డిగ్రీలు సంపాదించేడు. విల్సన్ కాలేజీలోనే అధ్యాపకునిగా చేరిన రామమూర్తి మేధస్సును గుర్తించిన బొంబాయి విశ్వవిద్యాలయం ‘డాక్టరేట్’ లేకపోయినా ఆచార్యునిగా నియమించింది. ఆయన రాసిన "ద ప్రాబ్లం ఆఫ్ ఇండియన్ పాలిటీ(The Problem of Indian Polity)"ను గొప్పగొప్ప పండితులు ప్రమాణ గ్రంథంగా స్వీకరించారు. రామమూర్తి, ఆయన శిష్యులు రచించిన పరిశోధనా గ్రంథాలయిన ‘‘గోల్కొండ చరిత్ర’’ గాంధీజీ దృక్పథంలాంటి గ్రంథాలకు మార్గనిర్దేశనం చేశాడు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగాన్ని ప్రారంభించిన ఖ్యాతి ఇతడిదే. బొంబాయి ఆంధ్రమహాసభ స్థాపకులలో ఇతడు ఒకడు. కమ్యూనిస్టు నేత డాంగే, రణదివే, సోషలిస్టు నేత అశోక్‌మెహతాలు రామమూర్తికి సన్నిహితులు. 1952-54లో ఒంగోలులో శర్మ కాలేజీకి తొలి ప్రిన్స్‌పాల్‌గా విచ్చేసిన రామమూర్తి కాలేజీని సుస్థిరపరిచాడు. 1954లో ఆంధ్ర యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ‘రీడరు’గా పనిచేస్తూ 1955 అక్టోబర్ 7న అకాల మరణం పాలయినాడు.

మూలాలు

మార్చు
  1. రావినూతల, శ్రీరాములు (10 January 2018). "బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతాపగిరి రామమూర్తి". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 2018-02-17.[permanent dead link]
  2. రావినూతల శ్రీరాములు (2018-01-10). ప్రతిభాశాలి ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి. సికిందరాబాదు: చైతన్య గ్రంథమాల. p. 10.