వేదాంతం కమలాదేవి

స్వాతంత్ర్య సమర యోధురాలు

వేదాంతం కమలాదేవి (1897 - 1940) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు, ప్రముఖ సంఘసేవకురాలు. ఆమె ఆదర్శ కాంగ్రెసువాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న సుప్రసిద్ధ తెలుగు మహిళలలో ఒకరు.

వేదాంతం కమలాదేవి

జీవిత విశేషాలు

మార్చు

ఆమె 1897 మే 5 వ తేదీన కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరు గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.[1] ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్యతో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా కలకత్తాలో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవితో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది. ఈమె సోదరుడు ప్రతాపగిరి రామమూర్తి స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

స్వాతంత్ర్యోద్యమంలో..

మార్చు

1920 లో కాకినాడలో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు. దేశ బాందవి దువ్వూరి సుబ్బమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసలను పొందారు. 1923 లో కాకినాడలో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు మహర్షి బులుసు సాంబమూర్తి ప్రోత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశెషసేవలు అందించారు[2].

ఒక ప్రక్క స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలో జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాథమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాథ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.

ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాన్ని విశాఖపట్నంలో నిర్వహించే బాధ్యతను బులుసు సాంబమూర్తి అప్పచెప్పినపుడు ఆ బాధ్యతను చక్కగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా నౌపడ లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20 న అరెస్ట్ అయ్యారు[3].ఫలితంగా రాయవెల్లూరులో 6 నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 1931 లో ఇచ్చాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిళాసభకు అద్యక్షత వహించారు. 1932 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం తీవ్రదశలో ప్రభుత్వం కాంగ్రెసు సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు ప్రకటించిన చోటులో కాకుండా వేరొక చోటులో కాంగ్రేసు సమావేశాలు జరిగేవి. ఆ పద్ధతిలో వేదాంతం కమలాదేవి గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభను తెల్లవారుజామున ప్రకటించిన ప్రకారమే నిర్విఘ్నంగా జరిపి తన అద్యక్షతన తీర్మానాలు అమోదించారు. మళ్ళీ రెండవసారి రాయవెల్లూరులో 6 నెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలైన తరువాత తన ఆరోగ్యం సహకరించకున్నా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రేసు ప్రచారం చేసారు. 1935 చట్టం ప్రకారం 1937 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేసారు.

ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగేసు స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు. మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఢిల్లీలో సరోజినీ నాయుడు పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.

ఈమె 1940, జూలై 14 వ తేదీన తన 43 వ ఏట పక్షవాత కారణంగా మృతిచెందారు.

మహాత్మా గాంధీ పిలుపికి స్పందించిన మహిళగా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవించి, సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

మూలాలు

మార్చు
  1. కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.
  2. salt satyagraha in the costal andhra districts
  3. Gandhi, Women, and the National Movement, 1920-47

ఇతర లింకులు

మార్చు