ఉన్నవ లక్ష్మీనారాయణ

ఉన్నవ లక్ష్మీనారాయణ ( డిసెంబరు 4, 1877 - సెప్టెంబరు 25, 1958) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది.

ఉన్నవ లక్ష్మీనారాయణ
మాలపల్లి నవలా రచయిత
జననం(1877-12-04)1877 డిసెంబరు 4
వేములూరుపాడు
మరణం1958 సెప్టెంబరు 25(1958-09-25) (వయసు 80)
వృత్తితెలుగు నవలాకారుడు
జీవిత భాగస్వామిఉన్నవ లక్ష్మీబాయమ్మ
తల్లిదండ్రులు
  • శ్రీరాములు (తండ్రి)
  • శేషమ్మ (తల్లి)

తొలి జీవితం

మార్చు

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలినీ విద్యను సాధన చేసేవాడు. కులతత్వమంటే విశ్వాసముండేది కాదు.[1] ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.

 
జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు

లక్ష్మీనారాయణ 1900లో గుంటూరులో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.

సాంఘిక సేవ

మార్చు

ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో గుంటూరులో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. 1902లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. రాయవేలూరు జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1922లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.[2]

మాలపల్లి నవల

మార్చు
 

రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది రష్యా విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి, వారి పక్షం వహించి, వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వైతాళికుడు ఉన్నవ.

సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు . అందుకు నిరూపణగా " మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత సంగ విజయం అనే పేరు కూడా పెట్టాడు.

మాలపల్లి నవల నిషేధం

మార్చు

1922 లో ఈ నవలను బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ముద్రించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలా భాగాలపై నిషేధం విధించింది. 1926 లో మద్రాసు శాసనమండలిలో కాళేశ్వరరావుచే మాలపల్లి నిషేధంపై చర్చలు జరిగాయి. 1928 లో కొన్ని మార్పులతో మాలపల్లి ప్రచురణకు తిరిగి అనుమతి లభించింది. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంచే మాలపల్లిని ప్రచురింప చేసి, ఆ నవలను పాఠ్యగ్రంథంగా కూడ ఎంపిక చేసింది. 1936 లో మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం తెలిపి ఆ నవలను పాఠ్యగ్రంథంగా తొలగించింది. 1937 లోసి.రాజగోపాలాచారి మద్రాసు ప్రధానిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెసు మంత్రి వర్గంచే మాలపల్లి నవల పై నిషేధపు ఉత్తర్వుల రద్దు జరిగింది.

మాలపల్లి నవల- చిత్రణ

మార్చు

రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ , వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించాడు. ఆనాడు హరిజనుల కుటుంబ గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల వ్రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక , సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తాడు కాబట్టి ఈ నవలకు సంగవిజయం అనే పేరు కూడా సార్థకమయింది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించాడు.

ఈ నవలకు పీఠిక వ్రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ఈ నవలను గూర్చి " ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి" అని కొనియాడాడు. తెలుగు విప్లప సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం ' మాలపల్లి '. నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశాడు.

ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో, స్వాతంత్ర్య ఉద్యమాల్లో అతనికి చేదోడు-వాదోడుగా ఉంటూ అతని భార్య ఉన్నవ లక్ష్మీబాయమ్మ సహధర్మచారిణిగా విశేష సేవలందజేశారు.

గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా కీర్తి పొందిన ఉన్నవ 1958 సెప్టెంబరు 25 న తుది శ్వాస విడిచాడు.

మూలాలు

మార్చు
  1. గూడూరి నమశ్శివాయ, p. 4.
  2. టి. వి. ఎస్, శాస్త్రి. "సుశాస్త్రీయం: శ్రీ ఉన్న(త)వ లక్ష్మీ నారాయణ పంతులుగారు". గోతెలుగు.కామ్. Archived from the original on 11 March 2019. Retrieved 11 March 2019.

ఆధార గ్రంథాలు

మార్చు