ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు

హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.

తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వచ్చింది.

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

రెండవ తెలంగాణా ఉద్యమ ప్రస్థానం
2001 - 2002 - 2003
2004 - 2005 - 2006

తెలంగాణా ------- ఉద్యమం

కె సి ఆర్‌ - నరేంద్ర - జయశంకర్‌

తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండవ అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి రెండవ అనే పదం వాడవచ్చు.

ఈ ఉద్యమానికి సారథి కె.చంద్రశేఖరరావు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు. 2001లో ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరిట ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసాడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. చక్కటి కార్యక్రమాలతో సమర్ధవంతమైన నాయకత్వంతో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించుకు వచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆసక్తి, ఈ అంశం యొక్క ఉద్వేగ భరిత చరిత్ర కూడా దీనికి దోహదపడ్డాయి.

ఈ లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లోని ప్రముఖ నేత ఆలె నరేంద్ర ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణ సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉద్యమం ప్రారంభించాడు. కొద్ది కాలానికే - ఆగస్టు 2002లో - తన సంస్థను తెరాసలో విలీనం చేసి, తెరాసలో తాను రెండో ప్రముఖ నాయకుడయ్యాడు.

2004లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని, తెరాస మంచి విజయాలు సాధించింది . ఆ ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లను ఓడించి, కాంగ్రెసు (, దాని నాయకత్వంలోని కూటమి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ చేజిక్కించుకుంది. కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రభుత్వంలో చేరింది.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది.

2009ఎన్నికలలో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న తెరాస పోటీ చేసిన 45 ఎమ్ ఎల్ఎ సీట్లకి 10 మాత్రమే గెలుచుకుంది. అలాగే రెండు ఎమ్పి సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడింది. 2009 నవంబరు 29న నిరాహారదీక్ష ప్రారంభించిన కెసిఆర్ పరిస్థితి విషమించడంతో కేంద్రం 9డిసెంబరున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించుతున్నట్లు ప్రకటన చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆంధ్రలో అల్లర్లు చెలరేగగా23 డిసెంబరున ఏకాభిప్రాయ సాధన వచ్చేంతవరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగదని ప్రకటించింది. ఫిబ్రవరి3, 2010న న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితిని ఏర్పరచింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక 2011 జనవరి 6న విడుదలయింది. దాని ప్రకారం పేర్కొన్న ఆరు పరిష్కారాలలో, రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనే పరిష్కారము ఉత్తమమైనదిగా, తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ ఉత్తమమైన పరిష్కారంగా సిఫారస్ చేయబడింది. ఈ సిఫారస్లు వ్యతిరేకించబడ్డాయి. తెలంగాణ వుద్యమం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ వార్తలలో వుంటున్నా పరిష్కారం దిశగా పురోగతి లేదు.

తెలంగాణా వాదుల వాదనలు

  • పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.
  • కృష్ణా గోదావరి నదుల పరీవాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి. కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.
  • శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
  • తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.
  • ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది.
  • రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు.
  • తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు.
  • భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే.
  • విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.
  • బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.

సమైక్యాంధ్రుల వాదనలు

  • పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు,
  • తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది.
  • తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.
  • తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత ఉంది.
  • దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి. ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం.
  • ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు.
  • చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి.
  • తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.
  • ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రత్యేకాంధ్రుల వాదనలు

  • కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.
  • హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడూ ఆలోచించలేరు.
  • రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా?
  • 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు.
  • తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు.
  • ఒక వేళ తెలంగాణా ఇవ్వదలిస్తే పూర్వం భద్రాచలం డివిజన్ ను మళ్ళీ తూర్పు గోదావరి జిల్లాలో కలపాలి.[1]
  • ఆంధ్రులకు మరో ముఖ్య పట్టణం అవసరం ఉంది. ఆరోగ్య, విద్య, న్యాయ, వ్యాపార, సాంకేతికపరమైన అంశాలకు హైదరాబాద్‌ అందరికీ అందుబాటులో లేదు.
  • కోస్తా ఆంధ్రులకు సుదీర్ఘమైన 960 కి.మీ తీర ప్రాంతం ఉంది. అనేక నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అవేవీ అక్కడి పేద ప్రజలకు ఉపయోగపడటం లేదు.
  • విశాఖపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా, కర్నూలుని న్యాయవ్యవస్థా కేంద్రంగా, తిరుపతిని సాంస్కృతిక కేంద్రంగా మలుచుకోవచ్చు.
  • భౌగోళికంగా విడిపోవడంవల్ల తెలుగు భాషకు నష్టం లేదు. వివిధ మాండలికాలు అభివృద్ధి చెందుతాయి.
  • తెలంగాణ ఇవ్వడంవల్ల తెలంగాణ వారికి ఎంత ప్రయోజనమో ఆంధ్రా వారికి అంతకు రెట్టింపు ప్రయోజనం.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-08-10. Retrieved 2013-10-04.