తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2006
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్ 27 న అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.
రెండవ తెలంగాణా ఉద్యమ ప్రస్థానం | |
2001 - 2002 - 2003 | |
2004 - 2005 - 2006 | |
తెలంగాణా ------- ఉద్యమం | |
కె సి ఆర్ - నరేంద్ర - జయశంకర్ |
జనవరి 2006
మార్చుకాంగ్రెసు పార్టీ హైదరాబాదులో అట్టహాసంగా జరిపిన ప్లీనరీ, కె.సి.ఆర్, నరేంద్రలు హాజరైన తెరాస శాసనసభా పక్ష సమావేశం, సంగారెడ్డిలో జరిగిన అసంతృప్త శాసన సభ్యులుల బహిరంగసభ - రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సంబంధించి జనవరి నెలలో చోటు చేసుకున్న సంఘటనలు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జరుగుతున్న జాప్యాన్ని ఇక చూస్తూ కూర్చునే ఓపిక తమకు లేదని కేంద్ర మంత్రి, కె.చంద్రశేఖరరావు జనవరి 4 న స్పష్టం చేశాడు. ఎనిమిది వారాల్లో ఇస్తామన్న ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఏడాదైన వెలుగు చూడకపోవడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తెరాస అసంతృప్త శాసన సభ్యులులు ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని జనవరి 7 న తెరాస హెచ్చరించింది. అన్నింటికీ సమాధానమిస్తానని అధినేత కేసీఆర్ చెప్పినా... ప్రజా ఉద్యమం చేయొద్దంటూ మీడియా ముందుకు వెళ్ళటంతో వారి అసలు రంగు బయటపడిందని తెరాస స్పష్టం చేసింది.
తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నరేంద్ర చేసిన వ్యాఖ్యలపై నరేంద్ర, కాంగ్రెసు నేత పి.జనార్ధనరెడ్డి ల మధ్య వాగ్యుద్ధం జరిగింది. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసుకు పుట్టగతులుండవని నరేంద్ర అనగా, మాకు అప్పుడుండవేమో గాని, మీకు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయాయి అని జనార్ధనరెడ్డి అన్నాడు.
ప్రత్యేక తెలంగాణ ఇచ్చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెసు చెప్పలేదని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా తెరాసతో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్ జనవరి 9 న వెల్లడించాడు.
తెలంగాణా విషయమై కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి జనవరి 10 న ఇలా అన్నాడు: "కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాదుగాక రాదు. వస్తుందనుకోవడం బక్వాస్. తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉన్నా... ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యమైతలేదు. తెలంగాణకు అడ్డుకాలేసిన లెఫ్ట్ పార్టీల వద్దే 64 ఎంపీల బలముంది. ఇగ తెలంగాణ ఎట్లొస్తది? సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి. రెండో ఎస్సార్సీ ఏర్పడాలి. అప్పుడే ప్రత్యేక తెలంగాణ సాధ్యం."
జనవరి 15 న హైదరాబాదులో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశం వాగ్వివాదాలతో హోరెత్తిపోయింది. అగ్రనేతలు కె.సి.ఆర్, నరేంద్రలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసమ్మతి శాసన సభ్యులులు దుగ్యాల శ్రీనివాసరావు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బండారు శారారాణిలు హాజరు కాలేదు. వారు శాసన సభ్యులు పదవులకు, పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా తీర్మానించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. వాడివేడి చర్చ జరిగింది. ఇద్దరు అసమ్మతి శాసన సభ్యులులు వాకౌట్ చేశారు. చివరికి సమావేశానికి హాజరుకాని ముగ్గురు శాసన సభ్యులులూ తెలంగాణ ఉద్యమ ద్రోహులని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించాడు. అసమ్మతి నాయకుడిగా ఇంతకాలం వ్యవహరించిన మందాడితో పాటు కంభంపాటి లక్ష్మారెడ్డి కూడా అధిష్ఠానంతో గళం కలిపారు. ఈ సమావేశంతో అసంతృప్త శాసన సభ్యులులలో కొంతమందిని కె.సి.ఆర్ తనవైపుకు తిప్పుకున్నాడు.
తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడం పట్ల ఆ పార్టీ శాసన సభ్యులు శారారాణి తీవ్రంగా విమర్శించింది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ద్రోహం చేస్తే సహించేది లేదని, ప్రళయ బీభత్సాన్ని సృష్టిస్తామని కె.చంద్రశేఖరరావు జనవరి 16 న హెచ్చరించాడు. వచ్చేనెలలో యు.పి.ఎలోని భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రత్యేక తెలంగాణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని ప్రకటించాడు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే వారిని రాళ్ళతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చాడు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలంగాణపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్ జనవరి 16 న సూచనప్రాయంగా వెల్లడించాడు. ప్రత్యేక తెలంగాణపై ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బిజెపి, డిఎంకె తమ వైఖరులు వెల్లడించలేదని తెలిపాడు. శాసనసభలో తీర్మానం ఆమోదిస్తేనే తెలంగాణ ఏర్పాటు సాధ్య మవుతుందని స్పష్టం చేశాడు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన వారిని బట్ట లూడే వరకు కొట్టి, ప్రజా బహిష్కారం చేయాలని కె.చంద్రశేఖర్‌రావు జనవరి 17 న కార్యకర్తలకు పిలుపు ఇచ్చాడు. ఆంధ్రప్రాంతం వారికన్నా ఇంటి దొంగలే ప్రమాదమంటూ, దొంగలు కాబట్టే వారు లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి రాలేదని ముగ్గురు శాసన సభ్యులులపై విరుచుకు పడ్డాడు. ద్రోహులు, వెన్నుపోటుదారులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించరాదని, అలాంటి వారిని రాళ్లతో కొట్టాలన్నాడు. ఉద్యమ ద్రోహులకు ఆ జిల్లా నాయకులే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని అన్నాడు
రాష్ట్ర పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత ఉమాభారతిని జనవరి 20 న కె.సి.ఆర్ కలిసాడు. "యూపీఏ మంత్రివర్గంలో మీరిద్దరూ సభ్యులు. మీ మాటకే అక్కడ విలువ లేనప్పుడు ఇంకా పదవుల్లో కొనసాగడంలో అర్థం లేదు. తెలంగాణ కోసం ఒత్తిడి తెండి. ససేమిరా అంటే తక్షణం పదవులు వదిలి రండి. తెలంగాణ కోసం ఉద్యమించండి." అని తెరాస అగ్రనేతలు కేసీఆర్, నరేంద్రలకు ఉమాభారతి హితవు పలికింది.
మెదక్ జిల్లా సంగారెడ్డిలో తెలంగాణ అభివృద్ధి శంఖారావం పేరుతో తెరాస అసమ్మతి శాసన సభ్యులులు భారీ బహిరంగ సభ జరిపారు. జయప్రకాశ్‌రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి, ముకుందరెడ్డి ఇందులో పాల్గొన్నారు.
జనవరి 22 న కాంగ్రెసు ప్లీనరీ సందర్భంగా హైదరాబాదు వచ్చిన యు.పి.ఎ. ఉపసంఘం అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఇలా అన్నాడు. "తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని 2000 సంవత్సరంలో సీడబ్ల్యూసీలో తీర్మానించాం. యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ అంశాన్ని సీఎంపీలో చేర్చాం. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ ఈ అంశం ఉంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా రెండో ఎస్సార్సీ అనే పరిస్థితి లేదు. ఏకాభిప్రాయం, సంప్రతింపుల ద్వారానే తెలంగాణా అన్నది మా వైఖరి. ఇందుకోసం ఉపసంఘం వేశాం. పలు పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం. కొన్ని పార్టీలు అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాయి. ప్రధాన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటివరకూ తన అభిప్రాయం వెల్లడించలేదు. ఆ పార్టీకి రెండుసార్లు లేఖ రాసినా స్పందన లేదు. వాళ్లు ఏదో ఒక నిర్ణయం చెబితే, మా కమిటీ నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. తెలంగాణా కోసం తెరాస అధినేత కేసీఆర్ పెట్టారంటున్న రెండు నెలల గడువుతో మాకు సంబంధం లేదు. నేనెప్పుడూ గడువు చెప్పలేదు. చెప్పలేను కూడా. ఎందుకంటే అది చాలా కష్టం. తెలంగాణా ఇన్‌స్టంట్ కాఫీ కాదు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు."
జనవరి 30 న "ఆంధ్రప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా చేయడం కోసం ఉద్యమిద్దాం" అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు.
- ఇంకా చూడండి: జనవరి 2006