బండి రాజన్ బాబు (ఫిబ్రవరి 9, 1939 - ఆగష్టు 24, 2011) ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు.

బండి రాజన్ బాబు

జననం మార్చు

దృశ్య ప్రధానమైన ఛాయాగ్రహణంలో పేరు తెచ్చుకొన్న బండి రాజన్ బాబు 1939, ఫిబ్రవరి 9కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించాడు. రాజన్ బాబంటే తొలుత గుర్తుకొచ్చేది అరకులోయల్లో తీసిన బొండా గిరిజన మహిళల ఛాయా చిత్రాలు ఇంకా న్యూడ్ (నగ్న) ఛాయాచిత్రాలు. నలుపు తెలుపు ఛాయాగ్రహణంలో వెలుగు నీడలతో ఆడుకున్నాడు. చిన్న పిల్లలు మెట్లు ఎక్కుతున్న చిత్రంలో ఈ వెలుగు నీడల సౌందర్యం స్ఫుటంగా వ్యక్తమౌతుంది.

మంచి చిత్రకారుడు కావల్సిన రాజన్ బాబు కుంచె నుంచి కెమేరాకు పరిణతి చెందిన వైనం ఆసక్తికరంగా ఉంటుంది. బాల్యం నుంచి చిత్రకళ పై మక్కువ ఉన్న రాజన్, 7వ తరగతి చదువుతున్నప్పుడు తన కజిన్ బహుకరించిన సాధారణ కొడాక్ 620 కెమేరాతో తీసిన చిత్రాలు పెక్కుమంది ప్రశంసలు అందుకొని రాజన్ లోని ఛాయాగ్రాహకుడిని వెలికి తీసింది. హైదరాబాదులోని J.N.T.U.Fine Arts College లో కమర్షియల్ ఆర్ట్ (వ్యాపార చిత్రకళ) లో డిప్లొమా కోర్స్ లో చేరిన సమయం లో, రాజన్ బాబు ప్రఖ్యాత ఛాయాగ్రహకుడు దివంగత రాజా త్రయంబక్ రాజా బహదూర్ ARPS ను కలవటం జరిగింది. రాజా త్రయంబక్ రాజ్ రాజన్ ను కుంచె స్థానంలో కెమేరా పట్టుకోమన్న సలహా రాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది. 5 సంవత్సరాల డిప్లొమా చేసి, కళాశాలలో విలక్షణమైన తరగతి (Distinction) లో ఉత్తీర్ణుడయి, కళాశాల యాజమాన్యం మెప్పు పొంది అదే కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. తరువాత ఇక్రిశాట్ లో సైంటిఫిక్ ఫొటొగ్రాఫర్ గా పనిచేశాడు. 1978 లో తన ఫొటో స్టుడియో స్థాపించి, దరిమిలా Rajan's School of Photography ప్రారంభించి ఎందరో విద్యార్థులను నిపుణులైన ఛాయాగ్రాహకులుగా తీర్చిదిద్దాడు.

ఛాయాగ్రహణంలో రాజన్ తొక్కిన కొత్త పుంతలు తనకు దేశీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. 1987లో నగ్న చిత్రాలపై ఛాయాచిత్ర కళాకృతులను (Portfolio) సమర్పించి రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందాడు. A.P. State Academy Of Photography కార్యదర్శిగా ఉంటూ, భగవాన్ దాస్ తర్వాత Lens Light అనే ఛాయాగ్రాహక పత్రికకు సంపాదకత్వం వహించాడు.

డిజిటల్ ఛాయాగ్రహణానికి ముందు ఛాయాచిత్రాలు డార్క్‌రూం (చీకటి గది) లోనే స్థిర రూపం దాల్చేవి. నెగటివ్ లు వృద్ధి చేయటానికి, స్థిరపరచడానికై రాజన్ తానే రూపొందించుకొన్న రసాయనిక సూత్రం పై ద్రవణాలు కలిపి డెవలపర్ తయారు చేసి, నెగటివ్ లను స్థిరపరిచేవాడు. ఈ విధానం లో, చిత్రం లో, నలుపు, తెలుపులను ప్రస్ఫుటంగా చూపే హైడ్రోక్వినాన్ లేకుండా కేవలం మెటాల్ తోనే ఫిల్మ్ ను వృద్ధిపరచి, స్థిరపరచి, నలుపు తెలుపులో ఎన్నో కళాఖండాలు సృష్టించాడు. ఇది రాజన్ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును. ఫొటొషాప్ లాంటి సాఫ్ట్వేర్లు లేని సమయంలో కూడా రాజన్ అద్భుతాలు చేశాడు తన కళా నైపుణ్యంతో. తన ఛాయాచిత్రాలను పలు మార్లు One man show లో ప్రదర్శించి, పలువురి ప్రశంసలందుకున్నాడు. రాజన్ తీసిన నగ్న చిత్రాలలో రసికత ఉంటుంది కాని అసభ్యతకు చోటు లేదు. అందుకే అవి రసజ్ఞుల ప్రశంసలు పొందాయి.

కొడాక్ 620 తో మొదలుపెట్టిన రాజన్, తన విద్యార్థులకు ఛాయాగ్రహణ పాఠాలలో భాగంగా బోధించటానికై, చాలా కెమేరాలు సేకరించాడు. వాటిలో ఛాయాచిత్రకారులలో హోదాకు చిహ్నమైన Hasselblad-medium-format camera కూడా ఉంది. ఫిల్మ్ కెమేరా Asahi Pentax నుంచి, ఛాయాగ్రహణం డిజిటల్ దిశగా సాగిన పయనంలో రాజన్ Canon 400D వాడే వాడు. ఛాయాగ్రహణ శాఖలలో ఒకటైన Industrial Photography లో కూడా రాజన్ తన సత్తా చూపాడు. ఈ రంగం లో, Andhra Pradesh Dairy Development Corporation, the National Mineral Development Corporation, E.C.I.L., Vizag Shipyard వంటి సంస్థలు తన ఖాతాదారుల చిట్టాలో ఉన్నాయి.నగ్న చిత్రాలకు, అసభ్య చిత్రాలకు మధ్య ఒక గీత ఉందంటాడు రాజన్. ఛాయాగ్రహణం ఒక భాషైతే, అందులోని వ్యాకరణమే Composition, Color, Space, Form, Proper Exposure, Angle and Light అంటాడు. ఈ మెళకువ గ్రహించినవాడు మంచి ఛాయాగ్రాహకుడవుతాడని రాజన్ చెప్తాడు.

మరణం మార్చు

పిక్టోరియల్ ఫొటొగ్రఫీలో తనదైన ముద్ర వేసిన రాజన్ బాబు 2011, ఆగష్టు 24 న అనారోగ్యంతో, తన 73వ ఏట, హైదరాబాదులో మరణించాడు. దివంగత రాజన్ కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.