బండ్రు నర్సింహులు

బండ్రు నర్సింహులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నాయకుడు. దొరల దౌర్జన్యాలకు, పోలీసుల దాడులకు ఎదురొడ్డి నిలిచి ప్రజల పక్షాన పోరాటం చేసాడు. రైతు కూలీలు, రైతులకు అండగా నిలబడ్డాడు. 1980/90వ దశకంలో జనశక్తి/పిడియస్‌యూ రాజకీయాలకు ఆలేరులో కేంద్ర బిందువుగా నిలిచాడు.

బండ్రు నర్సింహులు
జననం(1915-10-02)1915 అక్టోబరు 2
మరణం2022 జనవరి 23(2022-01-23) (వయసు 106)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నాయకుడు
జీవిత భాగస్వామినర్సమ్మ
పిల్లలుఇద్దరు కుమారులు (ప్రభాకర్, భాస్కర్),
ముగ్గురు కుమార్తెలు (అరుణ, జయమ్మ, విమలక్క)
తల్లిదండ్రులుబుచ్చిరాములు - కొమురమ్మ

యువకుడిగా ఉన్నప్పుడే ఆరుట్ల రాంచంద్రారెడ్డి స్ఫూర్తితో నిజాం సైన్యంతో పోరాడాడు. శివారెడ్డి నాయకత్వంలో వంగపల్లిలో నిజాం పోలీసులను ఎదుర్కొని వారి తుపాకులతోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన సీపీఐ (ఎంఎల్)లో దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశాడు.[1]

నర్సింహులు 1915 అక్టోబరు 2న బుచ్చిరాములు - కొమురమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ననర్సింహులుకు నర్సమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (ప్రభాకర్, భాస్కర్), ముగ్గురు కుమార్తెలు (అరుణ, జయమ్మ, విమలక్క). విమలక్క అరుణోదయ కళాకారిణి, ప్రజా ఉద్యమాల పోరాట నాయకురాలిగా జనశక్తిలోని అరుణోదయ కళామండలిలో పనిచేస్తున్నది. చిన్న కోడలు బండ్రు శోభారాణి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు.

ఉద్యమ జీవితం

మార్చు

సాయుధ పోరాట రాజకీయాలతో నర్సింహులు జీవితం ముడిపడి ఉంది, ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని కేటాయించాడు. భారత కమ్యూనిస్టు పార్టీలో ముఖ్య నాయకుడిగా కీలకపాత్ర పోషించాడు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే అరెస్ట్ చేయబడి, కొంతకాలం జైలుశిక్ష అనుభవించాడు.[2]

1944 భువనగరి ఆంధ్రమహాసభ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజా ఉద్యమంలోకి ప్రవేశించాడు. వామపక్ష భావాలతో ఉన్న నర్సింహులు తాను నమ్మింది ఆచరించి ప్రచారంలో పెట్టాడు. సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేసి నల్లగొండలో చిత్రహింసలకు గురి చేయగా, నర్సింహులు తల్లి చావు బతుకుల్లో ఉన్న కొడుకుని ఆస్పత్రిలో చేర్పించి, బతకడు అనుకున్న కొడుకుని డాక్టర్ల మంచి వైద్యంతో బతికించుకుంది. ఆలేరు కేంద్రంగా చుట్టుపక్కల ఎక్కడ ఏ దొర దౌర్జన్యానికి పాల్పడ్డా నేనున్నాను అంటూ అండగా నిలిచాడు. ఈ పరంపర 1945 నుంచి 1985ల వరకూ కొనసాగింది. రైతుల నుంచి మాయోపాయం చేత గుంజుకున్న భూములను మళ్ళీ వాళ్ళకు దక్కేలా పోరాటం చేసాడు. 1948లో కొలనుపాక ఎదురు కాల్పుల్లో అరెస్టయి, నాలుగు సంవత్సరాల నల్లగొండ, చంచల్‌గూడ జైళ్లలో ఉన్న బంధీ చేయబడ్డాడు. జైలు గోడల మధ్య ఇతరుల సహకారంతో తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

1977లో భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుండి, 1982లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశాడు. 1984లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటిచేశాడు.[4]

ఇతర వివరాలు

మార్చు
  1. 2015, అక్టోబరు 1న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నర్సింహులు 100వ జన్మదిన వేడుకల సందర్భంగా నూరేళ్ళ సభ- నూటొక్క పాట కార్యక్రమం జరిగింది. ప్రజా నాట్యమండలి, తెలంగాణ ప్రజానాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, అరుణోదయ ప్రజాకళామండలి, ఐక్య ప్రజా నాట్యమండలి, విశ్వజన కళామండలి, జై తెలంగాణ సాంస్కృతిక సమితి, జానపద వృత్తికళాకారుల సంఘం, ఒగ్గు కళాకారుల సంఘం, జజ్జెనక కళామండలి వంటి సంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిస్సార్‌, సైదులు, కోటి తదితర కళాబృందం సభ్యులు నూటొక్క పాటలు పాడారు.[5] బండ్రు నర్సింహులు జీవితంపై పి.చంద్ రాసిన ‘బండ్రు నర్సింహులు-సాయుధ పోరాటయోధుని కథ’ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
  2. 1975 ప్రాంతంలో బండ్రు నర్సింహులు జీవితంపై బొజ్జా తారకం రెండు పుస్తకాలు (“నది పుట్టిన గొంతుక”, “ఒక తెలంగాణ (1946 – 51) రైతాంగ గెరిల్లా (కా. బండ్రు నర్సింహులు) అనుభవాలు”) రాశాడు.
  3. నర్సింహులు 2015 నుండి ప్రజావిమోచన పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు.

ఊపిరితిత్తుల వ్యాధికి చికిత్సపొందిన నర్సింహులుకు తన 104వ ఏళ్ళ వయసులో 2022, జనవరి 22న బాగ్ అంబర్ పేటలోని తన పెద్దకుమారుడు బండ్రు ప్రభాకర్ ఇంట్లో గుండెపోటుతో మరణించాడు. అతని పార్థివదేహం గాంధీ మెడికల్ కాలేజీకి అందించబడింది.[6]

మూలాలు

మార్చు
  1. Velugu, V6 (2022-01-23). "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు మృతి". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-23. Retrieved 2022-01-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "తెలంగాణ పోరాట యోధుడు-పల్వెల". Sakshi. 2015-10-07. Archived from the original on 2015-10-09. Retrieved 2022-01-22.
  3. "సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నేత బండ్రు నర్సింహులు కన్నుమూత". andhrajyothy. 2022-01-23. Archived from the original on 2022-01-23. Retrieved 2022-01-23.
  4. "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు కన్నుమూత". EENADU. 2022-01-23. Archived from the original on 2022-01-23. Retrieved 2022-01-23.
  5. "సాయుధ కామ్రేడ్‌ అంటే బండ్రు నర్సింహులు: వరవరరావు". m.andhrajyothy.com. 2015-10-01. Archived from the original on 2022-01-22. Retrieved 2022-01-22.
  6. Sakshi (23 January 2022). "సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత". Archived from the original on 23 జనవరి 2022. Retrieved 23 January 2022.