బసవేశ్వరుడు

లింగాయత మత స్థాపకుడు, కన్నడ భక్తుడు, విప్లవకారుడు

మూస:Infobox Lingayat leader

బెంగళూరులో బసవేశ్వరుని విగ్రహం
బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం వద్ద బసవని సమాధి ఉంది.

బసవేశ్వరుడు (1134 మే 3 – 1196) హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు

కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.

ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవన్న వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసారు. బోధనలలోని సమదృష్టి ఎందరినో ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి.

బసవేశ్వరుడు స్థాపించిన 'అనుభవ మండపం' ఇప్పటి పార్లమెంటు తరహాలో వుండేది.అక్కడ అన్ని రకాల కులాలు, జాతులు తమ సమస్యలు వినిపించేవారు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంప్రదాయ వాదులకు నచ్చలేదు. తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు.

బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా లింగాయత మతానికి బీజాలు వేశాడు.శివుడంటే ఒక కనిపించని శక్తి అని విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఆయన ఉపదేశాలు:

 • మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
 • ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం ఇవి మానవుని కనీస హక్కులు
 • శివుడే సత్యం, నిత్యం. శివుడుకి రూపం లేదు.
 • శివుడి పేరిట పురాణాలు అసత్యం.
 • విగ్రహారాధనను వ్యతిరేకించారు.
 • దేహమే దేవాలయం.
 • వాస్తు, జ్యోతిష్యం అసత్యాలు
 • స్త్రీ పురుష భేదంలేదు.
 • శ్రమను మించిన సౌందర్యంలేదు.
 • భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
 • దేవుడికి ప్రజలకు మద్య పూజారులు అవసరం లేదు.
 • వేదాలు, పురాణాల తిరష్కరణ
 • యజ్ఞ యాగాలు, పూజలు మూఢనమ్మకాలు
 • స్వర్గ నరకాలు అబధ్ధం
 • దొంగలింపకు, హత్యలు చేయకు

కల్లలనాడకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల విడువు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు.

కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను పాల్కురికి సోమనాధుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయింది.

బసవన్న సిధ్ధాంతాలను తప్పుగా ప్రచారం చేసి కొంతమంది వీరశైవ మఠాదిపతులు లింగాయతులను మళ్లీ గుడిగుండారాల వైపు, మూఢనమ్మకాల వైపు నడిపించారు. MM కలబర్గి బసవన్న మీద ఎంతో సంశోధన చేసి ఆయన సిధ్ధాంతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన రచించిన ఐదు సంపుటాల మార్గ అనే కావ్యం సంచలనం సృష్టించింది. హిందూ సంప్రదాయ వాదుల నుంచి విమర్శలు ఎదొర్కొంది. ఆ తర్వాత లింగాయత ధర్మాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని పోరాటం పెరిగింది.

బసవన్న Karl Marx కన్నా ముందే సమానత్వం .సోషలిజం కోసం పోరాటం చేసారు. రాజ్యాంగం రాసే సమయంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప బసవన్న గురించి అంబేద్కర్ కి చెప్పినప్పుడు.. అంబేద్కర్ ఆశ్చర్య పోయారట ఇంత గొప్ప ఆలోచనలు వున్న వ్యక్తి కర్ణాటక కే ఎందుకు పరిమితం అయిపోయారా అని. ఆయన వచనాలను ప్రపంచానికి పరిచయం చేయకుండా కన్నడిగులు ఈ దేశానికి అన్యాయం చేసారని బాధ పడ్డారట.

సోమనాధుడు, బసవనకు-ఎనిమిదవయేటనే తండ్రి ఉపనయనము చేయుటకు ప్రయత్నించిననియు, బసవన తండ్రితో తాను కర్మబంధనములను త్రెంచుటకై జన్మించితిననియు, అందుచే ఉపనయనము చేయుటకంగీకరించనని వాదించి వెళ్ళిపోయెనని వ్రాసినాడు.అటుపై బసవన కళ్యాణి నేలిన కలచురి రాజగు బిజ్జలుని యొద్ద మంత్రిత్వము వహించెను. అదే విషయాన్ని బసవన తన వచనములలో తాను బిజ్జలుని కొలువులో ఉన్నట్లు తెలుపుకున్నాడు. కాని అతని మంత్రిత్వ కాలమింతవరకు చక్కగా నిర్ణయించబడలేదు. సా.శ.1157లో తన పదునేడవ యేట ఉద్యోగములో చేరినని తెలుయుచున్నది.బిజ్జలుడు బసవనను సకల నియోగాధ్యక్షనిగా చేసినట్లు సోమనాధుడు చెప్పినాడు.రాజకీయముగా ఈ ఉద్యోగము బసవనకు వీరశైవ మత వ్యాప్తి చాలా తోడ్పడినది.

కొందరు బసవన సా.శ.1168లో హత్య గావించబడినని కొందరు చరిత్రకారులు వ్రాసియున్నారు. కాని అతడు సా.శ.1196 వరకు జీవించినని పలు శాసనములు ఆధారములుగా ఉన్నాయి. సా.శ.1168లో బిజ్జలుడు వేయించిన శికారిపురి శాసనమున ఆతడు తన కుమారుడైన రాయ మురారి సోనిదేవుని గద్దెనెక్కించి తాను రాజపదవిని త్యజించి తాను రచించిన రాజ్యతంత్రములో ఉంది.

పలువురు ఆంధ్ర కవులు బసవనను ప్రసించారు. పోతన వీరభద్ర విజయమున బసవుని స్తుతించుటయేగాక ఆతని వచనములను కూడా అనుసరించినట్లు తెలియుచున్నది. కలియుగంబున కల్యాణ కటక నగరి నాదు భక్తుండు బసవరనాధుడొకండు. అని శ్రీనాఢుడు బసవుని ప్రశంసించాడు.

జయంతి వేడుకలు

మార్చు

ప్రతి సంవత్సరం ఏప్రిల్23వ తేదీన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్దగల ట్యాంక్ బండ్ పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రవీంద్రభారతిలోనూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది.[1] వీరశైవ లింగాయత్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణంకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కేటాయించి, రూ.కోటి నిధులను మంజూరు చేసింది.[2]

మూలాలు

మార్చు
 1. telugu, NT News (2022-05-03). "బ‌స‌వేశ్వ‌ర జ‌యంతి వేడుక‌లు.. నివాళుల‌ర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". Namasthe Telangana. Archived from the original on 2022-05-03. Retrieved 2022-07-14.
 2. telugu, NT News (2022-05-02). "రేపు అధికారికంగా బసవేశ్వర జయంతి". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-07-14.

బయటి లింకులు

మార్చు