బారిష్టర్ పార్వతీశం (నవల)

తెలుగు నవల

బారిష్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి కలం నుండి వెలువడిన హాస్యంతో కూడిన నవల.[1] ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరు నుండి బయలుదేరి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటాడు

బారిష్టరు పార్వతీశం నవల ముఖ చిత్రం

నేపథ్యం

మార్చు

రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి అత్తగారి ఊరు నర్సాపురం తాలూకా, గుమ్మలూరు అనే గ్రామం. ఇతను అక్కడికి వెళ్ళినపుడు తన బంధువుల కోసం ఒక పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, తమాషాలు సరదాగా చెప్పాడు. వాళ్ళు ఆనందించి దాన్ని ఓ కథలా రాయమన్నారు. అప్పటికి ఆయన రాసిన మూడు కథలు సాహితి, భారతి పత్రికలలో అచ్చయి ఉన్నాయి. అప్పటికి ఆయనకు దీన్ని ఓ రచనగా మలచాలనే సంకల్పం లేదు. కానీ శ్రోతలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుగా ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు, అక్కడ నుంచి మద్రాసు చేరినట్లు రాసి కుర్రవాళ్ళకు చదివి వినిపించాడు. వారు బాగుందనడంతో ఉత్సాహంతో కథానాయకుడు అక్కడి నుంచి బారిష్టరు చదువు కోసం ఇంగ్లండు ప్రయాణించడం వరకు రాయాలనుకున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు చదవడమంటే గొప్ప. అప్పటి దాకా పేరు పెట్టని పాత్రకు పార్వతీశం అని పేరు పెట్టి చదువు ఇతర వివరాలన్నీ రాశాడు. తర్వాత అంతా పార్వతీశం తన కథను చెప్పుకుపోతుంటాడు.[2]

బారిష్టర్ పార్వతీశం మొదటి భాగం

మార్చు

పార్వతీశం మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు. ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా చిత్ర్రించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా హాస్యవత్తరంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.

బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం

మార్చు

ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరుతాడు. ఒక లా కళాశాలలో చేరుతాడు. ఆంగ్లం కూడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడంతో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగంలో తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకంలో బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.

 

బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం

మార్చు

మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. బారిష్టరు పార్వతీశం : నూరేళ్ళ తెలుగు నవల 1878-1977 (పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం - పరిశీలన), రచన: సహవాసి, సంపాదకుడు: డి.వెంకట్రామయ్య, పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2007. పేజీలు: 27-32.
  2.   బారిష్టరు_పార్వతీశం_-_ప్రథమ_భాగము. వికీసోర్స్. 

బయటి లింకులు- వనరులు

మార్చు