భారత స్వాతంత్ర్య కమిటీ

1914 లో జర్మనీలో భారతీయులు స్థాపించిన సంస్థ
(బెర్లిన్ కమిటీ నుండి దారిమార్పు చెందింది)

భారత స్వాతంత్ర్య కమిటీ, 1914 లో జర్మనీలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ విద్యార్థులు, దేశంలో నివసిస్తున్న రాజకీయ కార్యకర్తలూ స్థాపించిన సంస్థ. మొదట్లో దీన్ని బెర్లిన్ కమిటీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సాధనను ప్రోత్సహించడమే ఈ కమిటీ ఉద్దేశ్యం. 1915 లో దీనికి ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ అని పేరు మార్చారు. హిందూ-జర్మను కుట్రలో ఇది అంతర్భాగంగా మారింది. ఈ కమిటీలో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (అలియాస్ చట్టో), చంపకరామన్ పిళ్లై, డాక్టర్ జ్ఞానేంద్ర దాస్ గుప్తా, అబినాష్ భట్టాచార్య సభ్యులుగా ఉండేవారు.

నేపథ్యం

మార్చు

అనేక మంది భారతీయులు , ముఖ్యంగా శ్యామ్జీ కృష్ణ వర్మ 1905లో ఇంగ్లాండ్‌లో ఇండియా హౌస్‌ను ఏర్పాటు చేశారు. దాదాభాయ్ నౌరోజీ, లాలా లజపత్ రాయ్, మేడమ్ భికాజీ కామా తదితరుల వంటి భారతీయ ప్రముఖుల మద్దతుతో ఈ సంస్థ భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించి, జాతీయవాద కృషిని ప్రోత్సహించింది. వలసరాజ్య వ్యతిరేక అభిప్రాయాలు, దృష్టికోణాలకూ అది ప్రధాన వేదికగా నిలిచింది. కృష్ణ వర్మ ప్రచురించిన ది ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక వలసవాద వ్యతిరేక ప్రచురణగా పేరుపొందింది. ఇండియా హౌస్‌తో సంబంధం ఉన్న ప్రముఖ భారతీయ జాతీయవాదులలో వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్), వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, హర్ దయాళ్ ఉన్నారు.

ఇండియా హౌస్ పని స్వభావం, బ్రిటిష్ వలస అధికారులను చంపమని ప్రతిపాదించిన ది ఇండియన్ సోషియాలజిస్ట్ రెచ్చగొట్టే స్వరం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం దానిపై నిఘా పెట్తింది. ఆంగ్లేయుల డిటెక్టివులు ఇండియా హౌస్లో విద్యార్థి నాయకులను పరిశీలనలో పెట్టారు. 1909లో మదన్ లాల్ ధింగ్రా ఇండియా హౌస్‌కు సన్నిహితంగా ఉండేవాడు. అతను భారత విదేశాంగ కార్యదర్శికి రాజకీయ ఎడిసి అయిన విలియం హట్ కర్జన్ విల్లీని కాల్చి చంపాడు. ఆ హత్య తరువాత ప్రభుత్వం, ఇండియా హౌస్‌ను వేగంగా అణచివేసింది. సాయుధ విప్లవం తీసుకురావడానికి బ్రౌనింగ్ పిస్టల్స్ భారతదేశానికి పంపుతున్నారని ఆధారాలు కనిపించాయి. సావర్కర్‌ను ఇంగ్లాండ్ నుండి బహిష్కరించారు. మార్సైల్స్‌లో ఆగినప్పుడు అతను ఆశ్రయం అడగ్గా ఫ్రెంచి ప్రభుత్వం నిరాకరించింది. కృష్ణ వర్మ విజయవంతంగా ఐరోపాకు పారిపోయాడు. ఈ పోరాటాన్ని కొనసాగించిన వారు - వీరేంద్రనాథ్ చటోపాధ్యాయతో సహా - జర్మనీకి తరలివెళ్లారు. అనేక మంది నాయకులు పారిస్కు తరలివెళ్లారు..[1] ఈ పారిపోయిన వారి సమూహం తరువాత బెర్లిన్ కమిటీలో కలిసిపోయింది.

మొదటి ప్రపంచ యుద్ధం

మార్చు

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో, భారతీయ జాతీయవాదులు తమ లక్ష్యాలకు మద్దతుగా వివిధ దేశాల మధ్య ఉన్న శత్రుత్వాలను ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించారు. 1912 లోనే, జర్మన్ విదేశాంగ కార్యాలయం బ్రిటిషు స్థితిని బలహీనపరిచేందుకు భారతదేశంలో పాన్-ఇస్లామిస్ట్ ఉద్యమానికి, బెంగాలీ విప్లవాత్మక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భావించింది. [2]

రష్యా సైనిక సమీకరణ చేస్తున్నదని నిర్ధారించబడినప్పుడు కైజర్, 1914 జూలై 31 న పై అవకాశాన్ని పరిశీలించాడు. జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటిషు సమీకరణ పరిధి స్పష్టంగా కనిపించింది. [2] 1914 సెప్టెంబరులో, బ్రిటిషు భారతదేశానికి వ్యతిరేకంగా జర్మన్ కార్యకలాపాలను ఆమోదించడానికి కైజర్, జర్మన్ ఛాన్సలర్, థియోబాల్డ్ వాన్ బెత్‌మాన్ హోల్‌వెగ్‌కు అధికారం ఇచ్చాడు.[2][3] జర్మన్ ప్రయత్నానికి పురావస్తు శాస్త్రవేత్త, కొత్తగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఫర్ ది ఈస్ట్ అధిపతి అయిన మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ నాయకత్వం వహించాడు. భారతీయ విద్యార్థి సంఘాలను ఓ సంఘటిత సమూహంగా ఏర్పాటు చెయ్యడం అతని బాధ్యత. ఓపెన్‌హీం, ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల గురించి హర్ దయాల్‌ను ఒప్పించాడు.

జర్మనీలో నివసిస్తున్న కొందరు భారతీయులు ఎమ్. ప్రభాకర్ (అప్పుడు హైడెల్‌బర్గ్ నుండి పట్టభద్రుడయ్యాక డ్యూసెల్‌డార్ఫ్‌లో బోధిస్తున్నాడు) నేతృత్వంలో అబ్దుర్ రెహ్మాన్, A సిద్ధిఖీతో పాటు, రష్యాలోని జార్‌కు మద్దతు ఇచ్చినందుకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ విద్యార్థులు రాజకీయ అనుభవం లేనివారు కాబట్టి, సమాజంలో ఎక్కువ బరువును మోయగల ప్రముఖ విప్లవకారులను కనుగొనడానికి ఒపెన్‌హీమ్ ప్రయత్నించాడు. ఆస్వర్టిజెస్ ఆమ్ట్ లోని యువ అధికారి అయిన ఒట్టో గున్థర్ వాన్ వెసెండోంక్‌కు, భారతదేశం రష్యా సరిహద్దులలో విప్లవాన్ని వ్యాప్తి చేసే పనిని అప్పగించారు. [4] అభినాష్ భట్టాచార్య, వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయలు తమ సన్నిహితురాలైన అన్నా మారియా సైమన్ సహాయంతో, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు జారీ చేశారు. వీటిని జర్మనీతో పాటు ఆస్ట్రియా-హంగేరీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లలో పంపిణీ చేశారు. వీటిపై సంపాదకీయ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ ద్వయం, అన్నా మారియా సైమన్ సహాయంతో, బెర్లిన్ విదేశాంగ కార్యాలయంతో సమావేశాలను ఏర్పాటు చేశారు. [1]

బెర్లిన్ కమిటీ

మార్చు

బెర్లిన్ చేరుకోగానే, వారి కొత్త ప్రధాన కార్యాలయంగా స్కోనెబర్గ్ శివారులో ఒక భవనాన్ని కేటాయించారు. 1915 సెప్టెంబరు 3 న విదేశీ కార్యాలయ అనుసంధానకర్త మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్‌తో జరిగిన మొదటి సమావేశంలో, ఛటోపాధ్యాయ (చట్టో అని కూడా పిలుస్తారు) కమిటీ లక్ష్యాలు, అవసరాలను పేర్కొన్నాడు: [1]

  • జర్మన్లు డబ్బు, ఆయుధాలు, సైనిక వ్యూహంలో నిపుణులను అందించాలి
  • విఫలమైతే, ఐరోపాలోని భారతీయ దేశభక్తులను జర్మనీకి రప్పించడాన్ని సులభతరం చేసి, ఆశ్రయం కల్పించాలి (సావర్కర్ విషయంలో జరిగినట్లుగా ఒత్తిడికి లొంగకూడదు)
  • సముద్ర గర్భ మందుపాతరలతో సహా స్పాండౌ తదితర సైనిక స్థావరాలలో భారతీయులకు శిక్షణ ఇవ్వాలి
  • భారతీయ భాషలలో సాహిత్యాన్ని ప్రచురించాలి
  • ప్రచార సామాగ్రిని పడవేసేందుకు విమానాలను అందించాలి
  • రహస్య ఉపయోగం కోసం 10 రూపాయల నోట్లను అందించాలి
  • రేడియో కమ్యూనికేషను సౌకర్యాన్ని కల్పించాలి
  • సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటు ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ ప్రిన్సిపాలిటీలకు ఎటువంటి రాయితీ ఇవ్వరాదు

ఒపెన్‌హీమ్ సహాయంతో, జర్మన్ యూనివర్శిటీలతోపాటు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ ల లోని భారతీయ విద్యార్థులకు సందేశాలు పంపించారు. ఆ సమయంలో సంస్థలో చేరిన వారిలో డాక్టర్ ధీరేన్ సర్కార్, చాంజీ కెర్సాస్ప్, NS మరాఠే, డాక్టర్ JN దాస్‌గుప్తా, సి. పద్మనాభన్ పిళ్లై, అతని సోదరుడు చంపక్ రామన్ పిళ్లై తదితరులున్నారు. 'చంపక్-చట్టో' బెర్లిన్ కమిటీ స్థాపించబడింది.[1]

సమూహం ఒత్తిడి చేసినప్పటికీ ఒపెన్‌హీమ్ జెనీవాలో ఉన్న శ్యామ్‌జీ కృష్ణవర్మను గాని, అమెరికాలో ఉన్న లాలా లజపత్ రాయ్‌ని గానీ సంప్రదించడానికి నిరాకరించాడు. మరొక సామ్రాజ్యవాద శక్తితో పొత్తు పెట్టుకోవడానికి వ్యక్తిగతంగా లాలా నిరాకరించినప్పటికీ, అతను రాజద్రోహ ఉద్యమంలో లోతుగా పాల్గొన్నట్లు యునైటెడ్ స్టేట్స్‌లోని బ్రిటిషు నిఘా వర్గాలు అనుమానించాయి.[5][4] 1915 లో, హర్ దయాళ్, బర్కతుల్లా బెర్లిన్ కమిటీలోను, దాని లక్ష్యాల సాధన లోనూ చురుకుగా పాల్గొన్నారు. ఈ కమిటీ మధ్య ప్రాచ్య నగరాలైన ఇస్తాంబుల్, బాగ్దాద్, కాబూల్, ఆఫ్ఘనిస్తాన్‌లకు దూతలను పంపినట్లు తెలిసింది.

హిందూ జర్మన్ కుట్ర

మార్చు

త్వరలోనే కమిటీ బాఘా జతిన్‌తో సహా భారతీయ విప్లవకారులతో పరిచయాలను ఏర్పరచుకుంది. వారు ఆయుధాలు, పేలుడు పదార్థాల కర్మాగారాలను సందర్శించి, తమకు కావలసిన యుద్ధ సామగ్రిని గుర్తించారు. తమ జాతీయవాద ప్రయోజనం కోసం జర్మనీలో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను నియమించుకున్నారు. అమెరికాలో అరెస్టయిన తర్వాత జర్మనీకి పారిపోయిన లాలా హర్ దయాళ్, కమిటీ వాదానికి తన మద్దతునిచ్చేందుకు ఒప్పించాడు. వారు యునైటెడ్ స్టేట్స్లో గదరైట్ ఉద్యమంతో పరిచయాలను ఏర్పరచుకున్నారు. డాక్టర్ ధీరేన్ సర్కార్, NS మరాఠే 1915 సెప్టెంబరు 22 న వాషింగ్టన్ వెళ్ళారు. అక్కడ జర్మనీ రాయబారి జోహన్ వాన్ బెర్న్‌స్టాఫ్ ద్వారా గదర్ పార్టీతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అమెరికాలో వారి ప్రయత్నాలకు పరాకాష్ట, అన్నీ లార్సెన్ ఆయుధాల వ్యవహారం.

కాబూల్ మిషన్

మార్చు

కమిటీ మూసివేత

మార్చు

భారత స్వాతంత్ర్య కమిటీని అధికారికంగా 1918 నవంబరులో రద్దు చేసారు. చాలా మంది సభ్యులు తమ దృష్టిని కొత్త సోవియట్ రష్యా వైపు మళ్లించారు. 1917, 1920 మధ్య, చాలా మంది సభ్యులు క్రియాశీల కమ్యూనిస్టులుగా మారారు.[6]

గమనికలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Champak-Chatto" And the Berlin Committee". Bharatiya Vidya Bhavan. Archived from the original on 2008-06-08. Retrieved 2007-11-04.
  2. 2.0 2.1 2.2 Fraser 1977
  3. Hoover 1985
  4. 4.0 4.1 Fraser 1977
  5. Dignan 1971
  6. Communist histories. Prashad, Vijay. New Delhi, India. 2016. ISBN 978-93-80118-33-8. OCLC 954115551.{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: others (link)

మూలాలు

మార్చు