బొబ్బట్టు

(బొబ్బట్లు నుండి దారిమార్పు చెందింది)

బొబ్బట్లు తెలుగువారు పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే వరలక్ష్మీ వ్రతం మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

బొబ్బట్లు

కావలసిన పదార్ధాలు

మార్చు
  • మైదా పిండి
  • శనగపప్పు
  • పంచదార
  • ఏలకులు తగినన్ని

తయారుచేయు విధానం

మార్చు
  • మైదాపిండిని కొద్దిగా నూనె, ఉప్పు వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.
  • ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్థం బయటకు రాకుండా వత్తుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
  • రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
  • ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఈ బొబ్బట్టునే కర్నూలు వైపు వారు, తక్కువ నూని వేసి, తీపి రొట్టెలలాగ చేస్తారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, నెయ్యి నూనెలు వాడకం తగ్గిస్తున్నారు కనుక ఈ విధంగా చేయడం కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు, వత్తడానికి పిండినే ఉపయేగిస్తారు. మామూలుగా చపాతీ వత్తినట్లే వత్తుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ (సన్నగా) ఉంటాయి. నూని, నెయ్యి ఎక్కువగా ఉండవు కనుక, వీనిని పాలల్లో కూడా వేసుకుని తింటారు. వీనిని తెలుగువారే కాక ఈ విధంగా మహారాష్ట వారు కూడా చేస్తారు.