భువనగిరి కోట

తెలంగాణ లోని భువనగిరి పట్టణంలో ఏకరాతిపై నిర్మించిన కోట

భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి పట్టణంలో ఉంది.[1][2] హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన భువనగిరి కోటఅనేక పోరాటాలకు, చారిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న భువ‌న‌గిరి కోట‌ చెక్కు చెదరని నిర్మాణంగా సాక్షత్కరిస్తోంది. 610 మీటర్ల ఎత్తులోని కొండపై ఈ కోట నిర్మించబడింది.[3][4][5]

కోట లోపలి ప్రాంగణంలో గుర్రాల కోసం కొట్టాలు, ధాన్యాన్ని నిలువచేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైనికాగారాలు ఉన్నాయి. రాజ భవనాల క్రింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలున్నాయని, అవి ఎక్కడికి వెళ్తాయో అంతుచిక్కడంలేదని చెబుతారు. అంతఃపురం పరిసరాల్లో నీళ్ళను నిల్వ చేసుకునే రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రాసాదాలు, పుష్పాలంకరణలు, కాకతీయ శైలిలో అనేక శిల్పా కళాకృతులు చెక్కబడ్డాయి. కోటకు సమీపంలో ఒక శివాలయం, నల్లని నంది విగ్రహం, కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉన్నాయి.[6]

భువనగిరి కోట దృశ్యం

చరిత్ర

మార్చు

భువనగిరి, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలం. భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఇదొక కథనం.

ఇది 3 వేల ఏళ్ళకు ముందే నిర్మించబడిందని, కోట నిర్మించాడానికి ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యరాతియుగం నాటి మానవ నివాస జాడలు, నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలు కనుగొనబడ్డాయి. మధ్యపాతరాతియుగం నాటి బొరిగెలు, బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధులు మొదలైనవి కూడా బయటపడ్డాయి. భువనగిరి కోట కొంతకాలం కుతుబ్ షాహీల పరిపాలనలో కూడా ఉంది.

1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి వచ్చింది. కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

 
భువనగిరి కోట
 
భువనగిరి కోటకు దారి
 
హైవే నుండి భువనగిరి కోట

కోటలోని విశేషాలు

మార్చు

తెలంగాణాను పరిపాలించిన అందరు రాజుల పాలనలో భువనగిరి కూడా వుండేవుంటుంది. చరిత్రలో పేర్కొనబడింది చాళుక్యుల కాలం నుండే...భువనగిరి దుర్గం చాళుక్యుల కాలంలోనో, కాకతీయుల కాలంలోనో బలమైనదుర్గంగా వుండివుంటుందని సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు తన తెలంగాణా చరిత్ర పుస్తకంలో అభిప్రాయపడ్డారు.

చరిత్రలో పేర్కొనబడుతున్న షోడశజనపదాల్లో అస్మక (అశ్మక, అస్సక, అసక, అళక పేర్లతో) జనపదం ఒకటి. సుత్తనిపాతంలో ప్రస్తావించిన బౌద్ధశ్రమణకులు సముద్రతీరం వరకు వెళ్ళడానికి నడిచిన దారి ఇప్పటి జాతీయరహదారేనని చరిత్రకారుల అభిప్రాయం. అంటే భువనగిరి నుండే వారు వెళ్ళివుంటారు. తెలంగాణాలోని వివిథప్రాంతాలలో నాగులు, యక్షులు, అశ్మకులు, మహిషకులు, తెలుగులు వంటి జాతులు నివసించాయి. రామాయణంలో ప్రస్తావించబడిన మహిషకుల రాజ్యం నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వుండేది.

అప్పటికి భువనగిరి దుర్గం లేకపోయినా భువనగిరి (అప్పటి పేరు తెలియదు) మహిషకరాజ్యంలో వున్నదన్నట్టే కదా. పురాణాల వల్ల మగధనేలిన మహాపద్మనందుడు అశ్మకను ఆక్రమించినట్లు, కళింగను ( హాతిగుంఫ శాసనం) జయించినట్లు తెలుస్తున్నది. మౌర్యులు (చంద్రగుప్తుడు, అశోకుడు), శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, పశ్చిమ, కళ్యాణి చాళుక్యులు, కందూరిచోడులు, కాకతీయులు, పద్మనాయకులు, బహమనీలు, కుతుబ్షాహీలు, నిజాం రాజులు తెలంగాణానేలిన అందరి పాలనలో భువనగిరి ఉంది. భువనగిరి ఒక చారిత్రక పట్టణం. విష్ణుకుండినుల నాటి నాణేలు భువనగిరిలో దొరికినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో కనిపిస్తాయి.

శాసనాలలో భువనగిరి

మార్చు

నల్గొండ జిల్లా శాసనాల సంపుటిలోని 26వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో సా.శ.1105లో కొలనుపాకలో వుంటున్న పారమార జగద్దేవుని కాలంలో ధక్కన నాయకుని కొడుకు బమ్మదేవరనాయకుడు ఆలేరు-40 కంపణంలోని గోష్టీపాళులో సోమేశ్వర దేవునికి సకలదేవరభోగాలతో (మఠం అనుసంధానం) మఠ విద్యార్థులకు భోజన వసతికిచ్చిన దానం తెలుపబడింది.

34వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో సా.శ. 1111లో భువనగిరి లోని సోమేశ్వరదేవునికి భువనగిరి దండనాయకుడైన లక్ష్మీదేవుడు ‘నందాదివిగె’ (perpetual lamp) కానుకగా యిచ్చినట్లుంది. 39 వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో సా.శ. 1123లో సోమేశ్వరదేవునికి భువనగిరి సర్వాధ్యక్ష దండనాయకుడు కేసియరసరు (సుంక సాహనవెగ్గడ) నూనెగానుగలవారి నుండి బకాయీకానుకలను ఇప్పించినట్లున్నది.

46వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో సా.శ. (తెలియదు) దండనాయకుడు సొద్దలయ్య (భీమనారాయణ దండనాయుడు ప్రతిష్ఠించిన) భీమనారాయణ దేవుడికిచ్చిన కానుకల గూర్చి చెప్పబడింది.49వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన ప్రతాపచక్రవర్తి జగదేకమల్లుని కాలంలో సా.శ.1146లో తన సేనాధిపతి ( పేరు లేదు) దేవునికి యిచ్చిన కానుకల గూర్చి చెప్పబడింది. భువనగిరికి చెందిన ఖాజీ ఇంటిదగ్గర రాయిమీద ‘వెలమ సింగనాయక..... అనవోతానాయకుని’ పేర్లున్నాయి.

కరీంనగర్ రామడుగు వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట. ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది.

మౌఖిక కథనాల ప్రకారం భువనగిరిలో కోట కట్టాలనుకున్న త్రిభువనమల్లునికి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారట. అరణ్యంలో తీగెలతో కప్పబడివున్న ఈ కొండ కోట నిర్మణానికి అనుకూలంగా భావించి దుర్గం నిర్మించి ఆ బోనయ్య, గిరమ్మ దంపతుల పేరు మీదనే పట్టణానికి నామకరణం చేసాడట చక్రవర్తి త్రిభువనమల్లుడు. చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.

సర్వాయి పాపన్న గోల్కొండను గెలిచే ముందర భువనగిరి దుర్గాన్ని స్వాధీనపరచుకుని తన అపారధనరాశుల్ని కొండ అంతర్భాగంలోని కాళికాలయంలో దాచిపెట్టాడని ఈ కొండలో ఇప్పటికి కనుగొనని అనేక గుహలు సొరంగాలున్నట్లు చెప్పుకుంటారు. ఇది అతిశయోక్తే. కొండపైన ఒక శివాలయం ఉంది. కొండకింద రెండు దేవాలయాలు ఒకటి పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉన్నాయి.

ఇతర వివరాలు

మార్చు

జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని మా బోనగిరిఖిలా ఉంది. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ ( ఒకప్పటి తిరుమలగిరి తండా) దగ్గరి మల్లన్నగుట్ట మీద కోట కట్టబోతుంటే బోనయ్యనే గొల్లాయన ‘ ఈడ కోటేం కడ్తరుగని మీకు మంచి జాగ జూపిస్త రమ్మ’ని తీసుకపోయి బోనగిరిగుట్టను చూపెట్టిండంట. దాని మీది కప్పివున్న తీగెలపొద మొదలు హనుమపురం దాకుండెనట. దాన్ని నరికి రాజుకు గుట్ట చూపెడితే రాజు రాయిగిరిలో కోటకట్టుడాపి బోనగిరిగుట్ట మీద ఖిల్లా కట్టిండట. రాజు ఇనామిస్తనంటే బోనయ్య తనపేరు, తనభార్యపేరు గిరమ్మ కలిసొచ్చేటట్ల ఊరు కట్టియ్యమన్నడంట. రాజు తథాస్తన్నడు. బోనయ్య, గిరమ్మల పేరుమీద ‘బోనగిరి’ని కట్టించిండు రాజు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇపుడు భువనగిరిగా పిలువబడుతున్నది. ఇది జానపదుల కథే. దీనికి చారిత్రకసాక్ష్యం లేదు. కాని, భువనగిరికోటే చరిత్రకు సాక్ష్యం.

నల్గొండ జిల్లా కేంద్రానికి 71 కి.మీ. దూరంలో, హైద్రాబాద్ కు 47 కి.మీ.ల దూరంలో భౌగోళికంగా 17.0523 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.2671 డిగ్రీల తూర్పు రేఖాంశంపై వుంది భువనగిరి పట్టణం. భువనగిరికొండ ఎత్తు 610 మీటర్లు. అండాకారపు ఏకశిలాపర్వతం ఈ కొండ. దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది. ఇది తెలంగాణాలోని ఉండ్రుకొండ, ఉర్లుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. ఈ కోటకు నైరుతి, ఆగ్నేయ దిశల నుండి పైకి వెళ్ళే మార్గాలున్నాయి. ప్రస్తుతమార్గం నైరుతి నుండే ప్రారంభమవుతుంది.

భువనగిరి పరిసరాల్లోని తుమ్మలగూడెం, వలిగొండ, రాయగిరి వంటి చోట్ల మధ్యపాతరాతియుగం (క్రీ.పూ. 50000-10000) నాటి మానవ ఆవాస చిహ్నా లున్నాయి. రాతిగొడ్డళ్ళు, కత్తులు, బొరిగెలు, బాణాలు వంటి రాతిపనిముట్లు లభించాయి. సమాధులు కూడా కనుగొనబడ్డాయి. భువనగిరిలో మధ్యరాతియుగం (క్రీ.పూ. 10,000- 2000) నాటి మానవనివాసజాడలు లభించాయి. నవీనశిలాయుగం (క్రీ.పూ.2500-1000) నాటి మానవ ఆవాసాలు భువనగిరికొండ కింద చాలా ఉన్నాయి.

భువనగిరిలో రైలుకట్ట వెంట దిగువకు రాయగిరి దాకా, పైకి బీబీనగర్ పై వరకు అక్కడక్కడ సిస్తులు, కైరన్లు అగుపిస్తున్నవి. వీటిని పరిశోధిస్తే ఇంకా కొత్త చారిత్రక విషయాలు బహిర్గతమయే అవకాశముంది. భువనగిరికి దగ్గరగా ఆలేరునది (భిక్కేరు), మూసీనదులున్నాయి. భువనగిరికి వాయవ్యాన భువనగిరి చెరువుంది. చెరువుకు బీబీనగర్ చెరువు గొలుసుకట్టు చెరువు. అక్కడనుండి కట్టుకాలువ ఉంది.

కీ.శే. ఆదిరాజు వీరభద్రరావుగారు రాసిన ‘ప్రాచీనాంధ్రనగరాలు’లో భువనగిరి దుర్గం 3వేల ఏళ్ళ క్రితం నుండి వున్నదని ఒకపారశీకప్రతిలో రాసున్నదని తెలిపారు. 1898లో అచ్చయిన ‘Glimpses of the Nizam’s Dominions లో CampBell భువనగిరికోట గూర్చి రాసాడని నిఖిలేశ్వర్ గారొక వ్యాసంలో పేర్కొన్నారు. భువనగిరి నగరానికి చుట్టూ మట్టిగోడలు, 3ద్వారాలుండేవట. ఇపుడు మట్టిదిబ్బలే ఆనవాళ్ళుగా మిగిలివున్నాయి.

భువనగిరికోట మొదటిద్వారాన్ని ‘ఉక్కుద్వార’మంటారు.ఈ ద్వారాన్ని నిజాం తన సొంతఖర్చుతో నిర్మించినట్లు ప్రతీతి.అందువల్ల ఇది కొత్తద్వారమై వుంటుంది. సా.శ.1900ల ప్రాంతంలో ప్రతి ఉదయం ముగ్గురు వాద్యగాళ్ళు తమవాద్యాలను వినిపించేవారట. ఈ ప్రవేశద్వారం గోల్కొండకోటలోని ‘బాలాహిస్సార్’ మొదటిద్వారం ఫతేదర్వాజా లాగే వుంటుంది.తలుపులు వెడల్పైన చెక్కలతో, ఇనుపగుబ్బలతో గజంపొడుగు బేడాలతో నిర్మించబడింది. రెండోద్వారం గుళ్ళోని చౌకోటులెక్క వుంటుంది. పనితనం కనిపిస్తుంది. మూడోద్వారం సాధారణం. అక్కడే వెనకటి మసీదుండేదని కాంప్ బెల్ రాసాడు. నాలుగోద్వారం కూడా సామాన్యంగానే ఉంది.బేడాలరంధ్రాలు గోడల్లోకి ఉన్నాయి.ఈ ద్వారం దాటి పైకిళ్ళితే ఒక కొలను కనపడుతుంది. నీళ్ళున్నపుడు అందులో తెల్లకలువలు విరబూసి కనపడుతుంటాయి.

పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు, అంతఃపురం (బారాదరి) కనిపిస్తాయి. అంతఃపురంలోనికి మెట్లు లేవు. ఎత్తైనగోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో ఉన్నాయి. పైన గచ్చు నమాజుకు వీలుగా మసీదులాగా కనిపిస్తుంది. ఈ అంతఃపురం గోల్కొండ బారాదరిని పోలివుంటుంది. బారాదరికి పడమట లోతుతెలియని ‘ఏనుగుల మోటబాయి’ (గుండం) ఉంది. తోడిన నీళ్ళు నిలువచేసుకోవడానికి బారాదరికానుకుని 9తొట్లు (హౌసులు) కట్టివున్నాయి. పరిసరాలను పరిశీలిస్తే బారాదరికి ఉత్తరాన ఒక నల్లని నంది విగ్రహం ఉంది. శివలింగం, గుడిలేవు. అంతదూరాన ఆంజనేయుని శిల్పం ఉంది. రాజప్రాసాదాల వద్ద చాళుక్యులశిల్పరీతిని ప్రతిబింబించే నాలుగురేకుల పుష్పాలంకారాలు, ఏనుగుముఖాల్లోంచి సర్పాకారాలు, కాకతీయశైలిలో మకరతోరణాలు, ద్వారపాలకులు, గజలక్ష్మి చెక్కబడివున్నాయి. బోనయ్య కథ లోని బోనమ్మ (భువనేశ్వరీదేవి) గుడి కనిపించదు. కాని గుట్టకింద లోయల్లో పడివున్న దేవాలయశిథిలాలు కొండపైన ఒక అపురూపమైన దేవాలయం వుండి వుంటుందని సాక్ష్యమిస్తున్నాయి.

కోటలోపల ప్రాకారాల్లో ధాన్యాగారాలు, సైనికాగారాలు, గుర్రపుకొట్టా లున్నాయి. రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.ఈ సొరంగాల తొవ్వలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరు కనుక్కోలేకపోయారు. కోటలో పడివున్న ఫిరంగులు ఎనిమిది. మరికొన్ని కొండకిందలోయల్లో పడిపోయివుంటాయని స్థానికులు చెప్పారు.అందులో ఒకటి కుతుబ్షాహీలతో షితాబుఖాన్ (సీతాపతి) చేసిన యుద్ధంలో వాడిన ఫిరంగియని డి.సూర్యకుమార్ (చారిత్రకపరిశోధకులు) గారు రాసారు. చరిత్రలో తెలంగాణాను ఏలిన అందరి ఏలుబడిలో భువనగిరిప్రాంతం ఉంది. మూసీనది ప్రాంతాన్ని జయించిన మహాపద్మనందులు, ఆ తర్వాత మౌర్యులు, పిదప మహిషకుడు ఖారవేలుడి ఏలుబడిలో వుండి వుంటుంది భువనగిరి. శాతవాహనుల నుండి ఆసఫ్జాహీల దాకా వివిధరాజుల, రాజ్యాలలో భువనగిరి భాగమై ఉంది. శాసనాల దాఖలా ప్రకారం సా.శ. 1100 లకు ముందునుండే భువనగిరిదుర్గం కళ్యాణీచాళుక్యుల పాలనలో ఉంది.అపుడిది కొలనుపాకకు రక్షణ, సైనికదుర్గంగా వుండేది.

శాసనాధారాలు

మార్చు

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 26వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- సా.శ.1105 ఏప్రిల్ 6వ తేది కొలనుపాక-7000 నాడును మహామండలేశ్వరుడుగా పాలిస్తున్న పారమార జగద్దేవుడు భువనగిరిదుర్గ దండనాయకుడు ధక్కననాయకుని కొడుకు బమ్మదేవనాయకునిచేత నిర్మించబడ్డ మఠానికి, సోమేశ్వరదేవునికి అక్షయతృతీయ సందర్భంగా అంగరంగభోగాలకింద ఆలేరు కంపణంలోని ‘గోష్టీపాళు’ గ్రామాన్ని కానుకగా యిచ్చాడు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 34వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం-సా.శ. 1111 భువనగిరిలో దొరికిన శాసనంలో భువనగిరి దండనాయకుడైన లక్ష్మిదేవుడు (సా.శ. 1111) పచ్చలకట్ట సోమేశ్వరదేవునికి నందాదీపం కానుకగా ఇచ్చాడు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 38వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- సా.శ. 1123 సం. శాసన వివరాల్లేవు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 39వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- భువనగిరికోట ద్వారం వద్ద రాతిమీద వున్నసా.శ.1123, శోభకృతు వైశాఖ అక్షయతృతీయ నాడు భువనగిరితీర్థంలోని సోమేశ్వరదేవునికి నూనెగానుగలవారు ఇవ్వవలసిన కానుకలను సుంక, సాహనవెగ్గడ, దేహారదాధినాయక వంటి బిరుదాంకితుడు సర్వాధ్యక్ష, దండనాయకుడైన కేశియరసరు ఇప్పించాడు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 41వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- క్రోధన సం. ఎవరో మహామండలేశ్వరుడు.. వివరాలు లేవు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 43వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- చందుపట్ల శాసనంలో చందుపట్ల (చంద్రపట్టణం) లోని విద్దేశ్వర దేవునికి విద్ధమయ్య దండనాయకుడు చేసిన భూదానాల గ్రామాలలో భువనగిరి పేర్కొనబడింది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 46వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- సం.లేదు. భువనగిరిలోని భీమనారాయణదేవునికి భువనగిరికి అధిపతిగా వున్న దండనాయకుడు శోద్దాలయ్య ఏదో కానుక ఇచ్చినట్లు శాసనంలో చెప్పబడింది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 43వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- ప్రతాపచక్రవర్తి- జగదేకమల్లుడు కళ్యాణి నుండి పాలిస్తున్న కాలం సా.శ.1146 సం.ఏప్రిల్ 15న భువనగిరిపాలకుడు సంధి, విగ్రహ సేనాధిపతి దేవుడి (పేరు లేదు) పూజాదికాలకు 4చిన్నాలు,2 ద్రమ్మాలు, కొంతభూమి కానుకగా యిచ్చినట్లున్నది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 50వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- ప్రతాపచక్రవర్తి సా.శ. 1147లో వేయబడిన బొల్లెపల్లి శాసనంలో భువనగిరి ‘ప్రతిబద్ధం’గా ప్రభువు మేడియభట్టు బొల్లెపల్లిలో మైలారదేవుని ప్రతిష్టించారు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 114వ శాసనం... భువనగిరిలో ఖాజీ ఇంటిముందరి రాయిపై వుంది. రేచెర్ల పద్మనాయక రాజైన అనపోతానాయకుని కుమారుడు భుజబలభీమ, సోమకుల పరశురామ, ఖడ్గనారాయణ బిరుదాంకితుడు సింగమనాయకుని పేరున్నది. సా.శ.1369ని ఐనవోలు శాసనం ప్రకారం అనపోతానాయడు భువనగిరి దుర్గాధిపతి అని తెలుస్తున్నది.పద్మనాయకరాజులు భువనగిరిదుర్గాన్ని బాగుచేయించారు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 129వ శాసనం.. కాలంలేదు. భువనగిరిలోని పీనుగుల దిబ్బ దగ్గర పడివున్న రాతిమీద శాసనం. ఎవరో ‘బాటరాజు’ పేరున్నది.

పై శాసనాలను బట్టి కళ్యాణీచాళుక్యులకాలంలో కొలిపాక-7000నాడు లోని ఆలేరు కంపణం-40కి చెందినదే భువనగిరి. దీనిని కొలనుపాక ప్రభువుల దండనాయకులు లక్ష్మీదేవులు, కేశియరసరు, విద్ధమయ్య, శోద్దాలయ్య, బమ్మదేవనాయకుడు, పేరుతెలియని మరికొందరు పాలించినట్లు తెలుస్తున్నది.

కాకతీయుల కాలంలో గణపతిదేవ చక్రవర్తి రుద్రమదేవి భర్త వీరభద్రునికి అరణంగా యిచ్చిన కొలనుపాకసీమలోనిదే భువనగిరి దుర్గం. కాకతీయుల సామంతుడైన గోనబుద్ధారెడ్డి ఏలిన మానువనాటిసీమలో భువనగిరి అంతర్భాగంగా వుండేది.

కందూరిచోడుల పాలనలో భువనగిరి సైనికశిబిరంగా వుండేదని, వారే ఇక్కడ ఆలయాలు, చెరువులు, ఇతర కట్టడాలు నిర్మింర్చారని, భువనగిరిని విస్తరింపజేసారని ప్రముఖకవి, విమర్శకులు డా. లింగంపల్లి రామచంద్రగారు అభిప్రాయపడ్డారు.

రేచెర్ల సింగభూపాలుని కాలంలో సా.శ.1427లో బహమనీ సుల్తాన్ 2వ అహమద్షా ఓరుగల్లు ముట్టడి పిదప దారిలోని భువనగిరిని స్వాధీనపరచుకొని ‘సంజర్ ఖాన్’ను దుర్గపాలకునిగా నియమించాడు.

భువనగిరికోట కుతుబ్ షాహీల పాలనలో చాలా యేండ్లున్నది. తర్వాత 1687లో మొగలులు గోల్కొండను ఆక్రమించినపుడు వారి యేలుబడిలోనికి పోయింది. సర్వాయి పాపడు 1708లో ఓరుగల్లును గెలుచుకుని తర్వాత భువనగిరిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. అతని వీరమరణం అనంతరం మొగలులు, వారినుండి ఆసఫ్ జాహీల పాలనకిందకు వచ్చింది భువనగిరి దుర్గం.

ట్రెక్కింగ్‌

మార్చు

భువ‌న‌గిరి కొండ ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌గా మారింది. 500 అడుగుల ఎత్తులో 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం పర్వతారోహణకు ఎంతో అనువుగా ఉంటోంది. ఈ కొండపైకి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది.

దీపకాంతులలో భువనగిరి కోట

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Proposal to develop Kaulas fort sent to Centre". The Hindu. 2004-02-29. Archived from the original on 2014-11-29. Retrieved 2021-11-10.
  2. Farida, Syeda (2004-10-09). "A fort revisited". The Hindu. Retrieved 2021-11-10.
  3. Reporter, Staff (2017-10-22). "'Bhongir Fort Festival' to be held in January". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-11-10.
  4. Iyer, Lalita (2019-02-03). "Bhongir Fort rocks in the middle of town". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-11-10.
  5. Gopalan, Madhumita (2016-09-10). "Photo Essay: Geology and History come together at Bhongir near Hyderabad". The News Minute. Retrieved 2021-11-10.
  6. Namasthe Telangana (30 April 2021). "Bhuvanagiri Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?". Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.

ఇతర లంకెలు

మార్చు