భువనగిరి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

గణాంక వివరాలు

మార్చు

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 1,03,538 - పురుషులు 52,720 - స్త్రీలు 50,818

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

భువనగిరి ఒక ముఖ్య పటణం. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

రవాణా సదుపాయాలు

మార్చు
 
భువనగిరి బస్టాండ్

భువనగిరిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు హామీలకే పరి మితమైంది. డివిజన్‌కు పొరుగునే రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. డివిజన్ మొత్తంలో ఒక యాదగిరిగుట్టలోనే బస్‌డిపో ఉంది. ఇక్కడా సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేటికీ బ స్సులు వెళ్లని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలకు ఉదయం, సాయంత్రం వేళ ల్లో మాత్రమే బస్ సౌకర్యం ఉండటంతో ప్రజలకు ఎదురుచూ పు తప్పడం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ విఫలం కావడంతో అధిక శాతం ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

భువనగిరి కోట చరిత్ర

మార్చు

భువనగిరిలో ఒక ప్రాచీనమైన కోట ఉంది. దీనిని భువనగిరి కోట అంటారు ఈ కట్టడం రాతి కట్టబడింది.

భువనగిరి కొండః

భూమ్యుపరితలం కిందవున్న మాగ్మా చల్లారుతున్నపుడు భౌగోళికంగా విస్తారంగా పరచుకుని ఏర్పడిన శిలారూపమే ‘బాతోలిథ్స్’.గ్రీకుభాషలో బాథ్+లిథిక్ అంటే లోతైనరాళ్ళు అని అర్థం.ప్లుటాన్ లోని స్టాక్స్,డైక్స్,సిల్స్, లాక్కోలిథ్స్,లాపోలిథ్స్ మరియు లావాభాగాలలో ఒకరకమైన శిలానిర్మితులు బాథోలిథ్స్.ఇవి ఆఫ్రికా,ఆసియా, యూరోపు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఓసీనియాలలో ఉన్నాయి. నిర్వచనపరంగా ఒకబాథోలిథ్ కనీసం 10,000 కి.మీ.లు విస్తరించివుండాలి.ఉదాహరణకు ఇదాహో బాథోలిథ్ ఉపరితలవిస్తరణ 40,000కి.మీ.వుంటుంది.ఇవి ఏర్పడి నపుడు కాక కోట్లసంవత్సరాలుగా వాటి పైపొరలు క్షయకరణంవల్ల తొలగిపోయినపుడే బయటపడ్తాయి.ప్రపంచంలోని ఇటువంటి బాథోలిథ్స్ లో ఒకటి భువన‘గిరి’.భూమి యొక్క ఒక పురాతన ఖండభూమికైన తూర్పుధార్వార్ శిలాస్తరం మన భువనగిరికొండ.ఇది మహారాష్ట్ర,తమిళనాడు,తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుకనుమలదాకా విస్తరించివుందని, ఈకొండ 250 నుండి 270కోట్లయేండ్ల వయస్సుకలిగినదని భూగర్భశాస్త్రవేత్తల అభిప్రాయం.

బోనగిరి ఖిలాః  జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని బోనగిరిఖిలా ఉంది. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ (ఒకప్పటి తిరుమలగిరి తండా)   దగ్గరి మల్లన్నగుట్ట మీద కోటను చూసి బోనయ్యనే గొల్లాయన ‘ఈడ కోటేం కడ్తరుగని మీకు మంచి జాగ జూపిస్త రమ్మ’ని తీసుకపోయి బోనగిరిగుట్టను చూపెట్టిండంట. దాని మీది కప్పివున్న తీగెలపొద మొదలు హనుమపురం దాకుండెనట. దాన్ని నరికి రాజుకు గుట్ట చూపెడితే రాజు రాయిగిరిలో కోటకట్టుడాపి బోనగిరిగుట్ట మీద ఖిల్లా కట్టిండట. రాజు ఇనామిస్తనంటే బోనయ్య తనపేరు, తనభార్యపేరు గిరమ్మ కలిసొచ్చేటట్ల ఊరు కట్టియ్యమన్నడంట. రాజు తథాస్తన్నడు. బోనయ్య, గిరమ్మల పేరుమీద ‘బోనగిరి’ని కట్టించిండు రాజు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇపుడు భువనగిరిగా పిలువబడుతున్నది. ఇది జానపదుల కథే. దీనికి చారిత్రకసాక్ష్యం లేదు. కాని, భువనగిరికోటే చరిత్రకు సాక్ష్యం. నల్గొండ జిల్లా కేంద్రానికి 71 కి. మీ. దూరంలో, హైద్రాబాద్ కు 47 కి. మీ. ల దూరంలో భౌగోళికంగా 17. 0523 డిగ్రీల ఉత్తరఅక్షాంశం,79.2671డిగ్రీల తూర్పురేఖాంశంపై వుంది భువనగిరిపట్టణం.  భువనగిరికొండ ఎత్తు 610 మీటర్లు. అండాకారపు ఏకశిలాపర్వతం ఈ కొండ. దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది. ఇది తెలంగాణాలోని ఉండ్రుకొండ, ఉర్లుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. ఈ కోటకు నైరుతి, ఆగ్నేయ దిశల నుండి పైకి వెళ్ళే మార్గాలున్నాయి. ప్రస్తుతమార్గం నైరుతి నుండే ప్రారంభమవుతుంది.

ఆదిమయుగంలో భువనగిరిః

భువనగిరిలో, దాని పరిసరాల్లోని   రాయగిరి వంటి చోట్ల మధ్యపాతరాతియుగం (క్రీ. పూ.50000-23,000)  నాటి మానవ ఆవాసచిహ్నాలు న్నాయి. రాతిగొడ్డళ్ళు, కత్తులు, బొరిగెలు, బాణాలువంటి రాతిపనిముట్లు లభించాయి.సమాధులు కూడా కనుగొనబడ్డాయి. భువనగిరిలో మధ్యరాతియుగం (క్రీ.పూ.8,000- 2500) నాటి మానవనివాసజాడలు లభించాయి. నవీనశిలాయుగం (క్రీ. పూ. 2500-1800)నాటి మానవ ఆవాసాలు భువనగిరికొండ కింద ఉన్నాయి. కొండ ఎక్కే మెట్లదారికి మొదట్లోనే ఎడమవైపున కొద్దిదూరంలో ఒకచిన్నరాతిగుండ్లగూడు వంటిది ఉంది.దానిలో ఉత్తరందిశలో వున్న రాతిగుండుపైన పదునైన పనిముట్టుతో తొలిచిన చుక్కలవంటి గుర్తులు 52 ఉన్నాయి.ఇవి 5వరుసల్లో స్పైరల్ గీతలున్నాయి.ఇవి ఏ పురాతనమానవుని కళాత్మకసృష్టో?ఇలాంటి రాతితొక్కుడుబొమ్మలు తెలంగాణలో పూర్వమానవుని ఆవాసాల్లో,రాతినెలవుల్లో కనిపిస్తున్నాయి. ఇది ఏ నక్షత్రమండలంవలె లేదు.భువనభాండం కాదు.రాతికళ (Rock Art)ను వ్యాఖ్యానించే పండితులే అర్థం చెప్పాలి వీటికి. భువనగిరిలో మధ్య,చివరి పాతరాతియుగాలనుండి కొత్తరాతియుగం వరకు రాతిపనిముట్లు దొరికాయి. కాబట్టి, ఈ రాతితొక్కుడుబొమ్మ చివరిరాతి యుగం నాటిదై వుంటుంది.ఇట్లాంటివి కరీంనగర్ జిల్లా నర్ర ఏశాలపల్లిలో ఠాకూర్ రాజారాంసింగ్ చూసిన రాతితొక్కుడుబొమ్మ (Rock Bruisings)లతో పోల్చదగినది. భువనగిరిలో రైలుకట్ట వెంట దిగువకు రాయగిరి దాకా, పైకి బీబీనగర్ పై వరకు అక్కడక్కడ సిస్తులు, కైరన్లు అగుపిస్తున్నవి. వీటిని పరిశోధిస్తే ఇంకా కొత్తచారిత్రకవిషయాలు బహిర్గతమయే అవకాశముంది. భువనగిరికి దగ్గరగా ఆలేరునది (భిక్కేరు),మూసీనదులున్నాయి.భువనగిరికి వాయవ్యాన భువనగిరి చెరువుంది.చెరువుకు బీబీనగరుచెరువు గొలుసుకట్టు చెరువు. అక్కడనుండి కట్టుకాలువ ఉంది.

భువనగిరిచరిత్రః

కీ.శే.ఆదిరాజు వీరభద్రరావు రాసిన ‘ప్రాచీనాంధ్ర నగరాలు’లో భువనగిరిదుర్గం 3వేలఏళ్ళ క్రితం నుండి వున్నదని ఒక పారశీకప్రతిలో రాసున్నదని తెలిపారు.1898లో అచ్చయిన ‘Glimpses of the Nizam’s Dominions లో CampBell భువనగిరికోట గూర్చి రాసాడని నిఖిలేశ్వర్ గారొక వ్యాసంలో పేర్కొన్నారు. చరిత్రలో తెలంగాణాను ఏలిన అందరి ఏలుబడిలో భువనగిరిప్రాంతం వుంది.మూసీనది ప్రాంతాన్ని జయించిన మహాపద్మనందులు,ఆ తర్వాత మౌర్యులు,పిదప మహిషకుడు ఖారవేలుడి ఏలుబడిలో వుండి వుంటుంది భువనగిరి.శాతవాహనుల నుండి ఆసఫ్జాహీల దాకా వివిధరాజుల, రాజ్యాలలో భువనగిరి భాగమై వుంది. శాసనాల దాఖలా ప్రకారం క్రీ.శ.1100లకు ముందునుండే భువనగిరిదుర్గం కళ్యాణీచాళుక్యుల పాలనలో వుంది.అపుడిది కొలనుపాకకు రక్షణ, సైనికదుర్గంగా వుండేది.        

భువనగిరిని పేర్కొన్న శాసనాలుః

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 26వ శాసనం. పశ్చిమ చాళుక్యులు-త్రిభువనమల్లదేవుని కాలం- క్రీ. శ. 1105 ఏప్రిల్ 6వ తేది కొలనుపాక-7000నాడును మహామండలేశ్వరుడుగా పాలిస్తున్న పారమార జగద్దేవుడు భువనగిరిదుర్గ దండనాయకుడు ధక్కననాయకుని కొడుకు బమ్మదేవనాయకునిచేత నిర్మించబడ్డ మఠానికి, సోమేశ్వరదేవునికి అక్షయతృతీయ సందర్భంగా అంగరంగభోగాలకింద ఆలేరు కంపణంలోని ‘గోష్టీపాళు’ గ్రామాన్ని కానుకగా యిచ్చాడు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 34వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం-క్రీ. శ. 1111. భువనగిరిలో దొరికిన శాసనంలో భువనగిరి దండనాయకుడైన లక్ష్మిదేవుడు  (క్రీ.శ. 1111)   పచ్చలకట్ట సోమేశ్వరదేవునికి నందాదీపం కానుకగా ఇచ్చాడు.

• నల్గొండజిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 38వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- క్రీ.శ.1123 సం. శాసన వివరాల్లేవు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 39వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం

భువనగిరికోట ద్వారం వద్ద రాతిమీద వున్నక్రీ. శ. 1123, శోభకృతు వైశాఖ అక్షయతృతీయ నాడు భువనగిరితీర్థంలోని సోమేశ్వరదేవునికి నూనెగానుగలవారు ఇవ్వవలసిన కానుకలను సుంక, సాహనవెగ్గడ, దేహారదాధినాయక వంటి బిరుదాంకితుడు సర్వాధ్యక్ష, దండనాయకుడైన కేశియరసరు ఇప్పించాడు.

• నల్గొండజిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 41వ శాసనం. . . పశ్చిమచాళుక్యులు-త్రిభువనమల్లదేవుని కాలం

క్రోధన సం.ఎవరో మహామండలేశ్వరుడు. . వివరాలు లేవు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 43వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు-త్రిభువనమల్లదేవుని కాలం

చందుపట్లశాసనంలో చందుపట్ల (చంద్రపట్టణం) లోని విద్దేశ్వర దేవునికి విద్ధమయ్య దండనాయకుడు చేసిన భూదానాల గ్రామాలలో భువనగిరి పేర్కొనబడింది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 46వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవునికాలం-సం. లేదు భువనగిరిలోని భీమనారాయణదేవునికి భువనగిరికి అధిపతిగా వున్న దండనాయకుడు శోద్దాలయ్య ఏదో కానుక ఇచ్చినట్లు శాసనంలో చెప్పబడింది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 49వ శాసనం. . . పశ్చిమ చాళుక్యులు- ప్రతాపచక్రవర్తి- జగదేకమల్లుడు కళ్యాణి నుండి పాలిస్తున్న కాలం క్రీ.శ.1146 సం. ఏప్రిల్ 15న భువనగిరిపాలకుడు సంధి, విగ్రహ సేనాధిపతి దేవుడి (పేరు లేదు) పూజాదికాలకు 4చిన్నాలు, 2 ద్రమ్మాలు,కొంతభూమి కానుకగా యిచ్చినట్లున్నది.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 50వ శాసనం. . . పశ్చిమచాళుక్యులు-ప్రతాపచక్రవర్తి క్రీ.శ. 1147లో వేయబడిన బొల్లెపల్లి శాసనంలో భువనగిరి ‘ప్రతిబద్ధం’గా ప్రభువు మేడియభట్టు బొల్లెపల్లిలో మైలారదేవుని ప్రతిష్టించారు.

• నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 114వ శాసనం. . . భువనగిరిలో ఖాజీ ఇంటిముందరి రాయిపై వుంది. రేచెర్ల పద్మనాయక రాజైన అనపోతానాయకుని కుమారుడు భుజబలభీమ, సోమకుల పరశురామ,ఖడ్గనారాయణ బిరుదాంకితుడు సింగమనాయకుని పేరున్నది.క్రీ. శ. 1369ని ఐనవోలు శాసనం ప్రకారం అనపోతానాయడు భువనగిరి దుర్గాధిపతి అని తెలుస్తున్నది.పద్మనాయకరాజులు భువనగిరిదుర్గాన్ని బాగుచేయించారు.

•నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం-129వ శాసనం. . కాలంలేదు. భువనగిరిలోని పీనుగుల దిబ్బ దగ్గర పడివున్న రాతిమీద శాసనం. ఎవరో ‘బాటరాజు’ పేరున్నది.

•ఇటీవల భువనగిరి సమీపగ్రామం వడపర్తిలో లభించిన కొత్తశాసనం కాలం:క్రీ.శ. 1156 సం.,రాజుఃజగదేకమల్లుడు-2 ఏలుబడిలో భువనగిరి దండనాయకుడు విద్ధమయ్య వడపర్తిలోని కందర్పేశ్వర దేవునికి చేసిన దానశాసనాన్ని నేను (వేముగంటి మురళీకృష్ణ,విరువంటి గోపాలకృష్ణలతో కలిసి) పరిష్కరించడం జరిగింది.

పై శాసనాలను బట్టి కళ్యాణీచాళుక్యులకాలంలో కొలిపాక-7000నాడులోని ఆలేరు కంపణం-40కి చెందినదే భువనగిరి.దీనిని కొలనుపాకప్రభువుల దండనాయకులు లక్ష్మీదేవులు,కేశియరసరు,విద్ధమయ్య,శోద్దాలయ్య, బమ్మదేవ నాయకుడు,పేరుతెలియని మరికొందరు పాలించినట్లు తెలుస్తున్నది. కాకతీయులకాలంలో గణపతిదేవచక్రవర్తి రుద్రమదేవి భర్త వీరభద్రునికి అరణంగా యిచ్చిన కొలనుపాకసీమలోనిదే భువనగిరి దుర్గం. కాకతీయుల సామంతుడైన గోనబుద్ధారెడ్డి ఏలిన మానువనాటిసీమలో భువనగిరి అంతర్భాగంగా వుండేది. కందూరిచోడుల పాలనలో భువనగిరి సైనికశిబిరంగా వుండేదని,వారే ఇక్కడ ఆలయాలు, చెరువులు, ఇతర కట్టడాలు నిర్మించారని, భువనగిరిని విస్తరింప జేసారని ప్రముఖకవి,విమర్శకులు డా.లింగంపల్లి రామచంద్ర గారు అభిప్రాయపడ్డారు.రేచెర్ల సింగభూపాలుని కాలంలో క్రీ.శ. 1427లో బహమనీ సుల్తాన్ 2వ అహమద్షా ఓరుగల్లుముట్టడి పిదప దారిలోని భువనగిరిని స్వాధీన పరచుకొని ‘సంజర్ ఖాన్’ను దుర్గపాలకునిగా నియమించాడు. భువనగిరికోట కుతుబ్ షాహీల పాలనలో చాలా యేండ్లున్నది. తర్వాత 1687లో మొగలులు గోల్కొండను ఆక్రమించినపుడు వారి యేలుబడిలోనికి పోయింది. సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తర్వాత భువనగిరిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు.అతని వీరమరణం అనంతరం మొగలులు, వారినుండి ఆసఫ్ జాహీల పాలనకిందకు వచ్చింది భువనగిరి దుర్గం.

భువనగిరికోటః

భువనగిరి నగరానికి చుట్టూ మట్టిగోడలు,3ద్వారాలుండేవట.ఇపుడు మట్టిదిబ్బలే ఆనవాళ్ళుగా మిగిలి వున్నాయి.భువనగిరికోట మొదటిద్వారాన్ని ‘ఉక్కుద్వార’మంటారు.ఈ ద్వారాన్ని నిజాం తన సొంతఖర్చుతో నిర్మించినట్లు ప్రతీతి. అందువల్ల ఇది కొత్తద్వారమై వుంటుంది. క్రీ. శ. 1900ల ప్రాంతంలో ప్రతి ఉదయం ముగ్గురు వాద్యగాళ్ళు తమవాద్యాలను వినిపించేవారట.ఈ ప్రవేశద్వారం గోల్కొండకోటలోని ‘బాలాహిస్సార్’ మొదటిద్వారం ఫతేదర్వాజా లాగే వుంటుంది. తలుపులు వెడల్పైన చెక్కలతో, ఇనుపగుబ్బలతో గజంపొడుగు బేడాలతో నిర్మించబడింది.రెండోద్వారం గుళ్ళోని చౌకోటులెక్క వుంటుంది.పనితనం కనిపిస్తుంది.మూడోద్వారం సాధారణం. అక్కడే వెనకటి మసీదుండేదని కాంప్ బెల్ రాసాడు.నాలుగోద్వారం కూడా సామాన్యంగానే ఉంది. బేడాలరంధ్రాలు గోడల్లోకి ఉన్నాయి. ఈ ద్వారం దాటి పైకిళ్ళితే ఒక కొలను కనపడుతుంది. నీళ్ళున్నపుడు అందులో తెల్లకలువలు విరబూసి కనపడుతుంటాయి.

పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు,అంతఃపురం (బారాదరి)కనిపిస్తాయి. అంతఃపురంలోనికి మెట్లు లేవు. ఎత్తైనగోడలు,విశాలమైన గదులు,ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో ఉన్నాయి. పైన గచ్చు నమాజుకు వీలుగా మసీదులాగా కనిపిస్తుంది.ఈ అంతఃపురం గోల్కొండ బారాదరిని పోలివుంటుంది.బారాదరికి పడమట లోతుతెలియని ‘ఏనుగుల మోటబాయి’ (గుండం)వుంది.తోడిన నీళ్ళు నిలువచేసుకోవడానికి బారాదరి కానుకుని 9తొట్లు (హౌసులు)కట్టివున్నాయి.పరిసరాలను పరిశీలిస్తే బారాదరికి ఉత్తరాన ఒక నల్లని నందివిగ్రహం ఉంది. శివలింగం,గుడిలేవు.అంతదూరాన ఆంజనేయుని శిల్పం ఉంది.రాజప్రాసాదాల వద్ద చాళుక్యులశిల్పరీతిని ప్రతిబింబించే నాలుగురేకుల పుష్పాలంకారాలు,ఏనుగుముఖాల్లోంచి సర్పాకారాలు,కాకతీయశైలిలో మకరతోరణాలు, ద్వారపాలకులు, గజలక్ష్మి చెక్కబడివున్నాయి.బోనయ్య కథ లోని బోనమ్మ (భువనేశ్వరీదేవి)  గుడి కనిపించదు. కాని గుట్టకింద లోయల్లో పడివున్న దేవాలయశిథిలాలు కొండపైన ఒక అపురూపమైన దేవాలయం వుండి వుంటుందని సాక్ష్యమిస్తున్నాయి.కోటలోపల ప్రాకారాల్లో ధాన్యాగారాలు, సైనికాగారాలు,గుర్రపుకొట్టాలున్నాయి.రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భమార్గాలు న్నాయి. ఈ సొరంగాల తొవ్వలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరు కనుక్కోలేకపోయారు. కోటలో పడివున్న ఫిరంగులు ఎనిమిది.మరికొన్ని కొండకిందలోయల్లో పడిపోయివుంటాయని స్థానికులు చెప్పారు.అందులో ఒకటి కుతుబ్షాహీలతో షితాబుఖాన్  (సీతాపతి)చేసిన యుద్ధంలో వాడిన ఫిరంగియని డి. సూర్యకుమార్  (చారిత్రకపరిశోధకులు)గారు రాసారు.

భువనగిరి ఖిల్లా ద్వారానికి ఎదురుగా పడవేసివున్న శిల్పాలెన్నో ఉన్నాయి.కుమ్మరివాడలో అమ్మదేవతల గుళ్ళున్నాయి.ప్రాచీన దేవాలయాల అవశేషాలు అగుపిస్తున్నాయి. అక్కడొక గుడిదగ్గర సింహాస నారూఢుడైన వీరుని శిథిలశిల్పముండేది. అక్కడే ఒక చిన్న గుడిలో శయనస్థితిలో వినాయకుని విగ్రహం వుంది చాలా అరుదైన విగ్రహం. బ్రాహ్మణవాడలోని రామలింగేశ్వరాలయంలో 5 పడగల నాగశిల్పాలు, చిన్న శివాలయంలో చాళుక్యులశైలిలోని గుండ్రనిపానవట్టం, చిన్న శివలింగం,చిన్ననందులు రెండు, మరొక ఆలయంలో పార్వతి  అంశంతో అవతరించి శుంభ, నిశుంభులను వధించిన దేవత ‘కౌశికి’ బాణం, ధనుస్సు, వజ్రం, నాగపాశాలను ధరించి దర్శనమిస్తున్నది. ఈ దేవత కౌశికీవరప్రసాదలబ్ధులమని చెప్పుకునే చాళుక్యుల దేవత. నృత్యగణపతి, ఆంజనేయుడు కూడా ఉన్నారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. కాని, పూర్వరూపం మళ్ళీ కనిపించదు. భువనగిరి చెరువు కింద, ఈద్గా వెనక పచ్చలసోమేశ్వరాలయం ఉంది. ఇది నిజానికి త్రికూటాలయం. పునరుద్ధరణలో రూపుమారినా ప్రధాన, ఉపాలయాలు ఒకే కప్పుకిందనే ఉన్నాయి.ప్రధానాలయం శివాలయం,ఉపాలయంలో సీతా,రామ, లక్ష్మణులను ప్రతిష్ఠించారు. వినాయకు లున్నారు.మరొక చిన్న దేవాలయం ఖిలాకు పడమట రోడ్డువెంట ఉంది. అందులో చతుర్భుజుడైన శివుని శిథిలవిగ్రహం వుండడం విశేషం. భువనగిరిలో వందేళ్ళు నిండని కొత్త ఆలయాలు చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం వున్న బైపాస్ రోడ్డుకు ప్రక్కన, ఫ్లై ఓవరుకు కొద్దిదూరంలో దక్షిణంగా వున్న జాలఎల్లమ్మ గుడివుంది. అక్కడ నిరంతరం వూరే నీటివూట వుండేదట పూర్వం. అక్కడ వెలసిన దేవతనే ‘జల ఎల్లమ్మ’దేవతగా కొలుస్తారట. దానికి కొద్దిగా పైకి గుట్ట అంచున ఒక పెద్దరాయికి అపూర్వమైన ‘కాలభైరవు’ని విగ్రహం చెక్కివుంది. అది రాచకొండలోని భైరవుని శిల్పాన్ని పోలివుంది. భైరోనికుంటలో పడమటదిక్కున వున్న రాతిగుండుపై 9అ. ల ఎత్తున్న మరొక భైరవుడు చెక్కివున్నాడు. భైరవుని కుడి, ఎడమపాదాల కిరువైపుల దిగంబరంగావున్న ఇద్దరు స్త్రీ, పురుషులు (రాజవంశీకులు?)  పూజలు చేస్తున్నట్టుగా వుంది. ఇటీవల కోటగోడపరిసరాల్లో మట్టికోసం తవ్వినపుడు ‘వటుక భైరవుని’ విగ్రహం బయటపడింది.ఖిల్లామీద గుండంలో,బయట భైరవులు చెక్కివుండడం చూస్తే భైరవారాధకులైన రాచకొండప్రభువులు పాలించినపుడు ఇక్కడ ఈ శిల్పాలన్ని చెక్కించివుంటారనిపిస్తుంది. భువనగిరికి ఆగ్నేయప్రాంతంలో వున్న కొసగుట్టల్లో మొదటిగుట్టపై శివాలయం  (బమ్మేశ్వరాలయం?),రామాలయం అని పిలువబడే గుహాలయం ఉంది. అక్కడ ఒక సహజసిద్ధంగా ఏర్పడిన కొలను ఉంది. అక్కడ వున్న రాతిబండలపై చెక్కిన ఆంజనేయుడున్నాడు.

ఇటీవల భువనగిరిలో నేలలో దేవాలయా స్తంభాలు, సింహయాళీలు బయటపడ్డాయి. ఒక శాసనం కూడా బయటపడ్డది. శిలాఫలకానికి ఒకే పక్క చెక్కబడిన శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో రాసిన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు కాలం నాటిది. ఆ వివరాలు:[2]

భువనగిరి శాసనం:

1. స్వస్తిశ్రీ మన్మహామండలేశ్వర కాకతి

2. య్య ప్రతాపరుద్రదేవ మహారాజు

3. లు సుఖసంకథావినోదంబుల

4. 0 బ్రదివి రాజ్యంబు సేయుచుం

5. డంగాను శక వరుషాలు 1240 అ

6. వు కాళయుక్తి సంవత్సర ఆషాఢ

7. శు 15గు భునగిరి అష్టాదశప్రజను

8. మహారాజునకూను లెంకలకూను

9. అధికారులకూను కరణాలకూను తమ

10. కూం బుణ్యముగాను గొని ఆయూరి శ్రీవి

11. రద్రేశ్వర దేవరకూను ఆ పురోతు

12. లకు అంగభోగార్తమై బలంజ

13. లు పెఱుకందెచ్చిన బండానను పెఱు

14. కను సోలెండూను ప్రతి మలగను

15. ఫలమెండూను వా02కలు అసి

16. బెనులయిదు పొంకలూను దీపా

17. నకు వడ్డలగండెగానుగును నిత్య

18. సోలెండు నూనెను ఆచంద్రస్తాయిగా

19. ను చెల్లను ధారవొస్తిమి ...క్రమ

20. ము యట్లచెల్లించుట మహాపుణ్య

21. ము అయినందుగాను శ్రీరామ

22. వాక్యం శ్లోకం ..సామాన్యోయం

శాసన సారం:

మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు పాలిస్తుండగా శక సం.లు 1240, కాళయుక్తి సం. ఆషాఢ శు.15/పౌర్ణిమ గురువారం అనగా క్రీ.శ.1318 జూన్ 14వ తేదీన

భువనగిరి చెందిన అష్టాదశప్రజలు, మహారాజుకు, లెంకలకు, అధికారులకు, కరణాలకు, తమకు పుణ్యంగా ఆవూరి అనగా భువనగిరి శ్రీవీరభద్రేశ్వర దేవరకు, పురోహితులకు, అంగభోగ నిమిత్తం

బలంజలు పెఱుకలో తెచ్చిన బండా(రం)ను పెఱుకకు సోవందు ప్రతిమలకుగాను ఫలం నిమిత్తం, వాకలు అసిబెనులు అయిదు పొంకలు దీపానికి వడ్డెలగండెగానుగునూనె నిత్యం సోలెడు నూనెను ఆచంద్ర(ఆ సూర్య, చంద్రులున్నంతవరకు) చెల్లేటట్లు ధారవోసినాము. ఈ క్రమం చెల్లించటం పుణ్యం.

శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం

శాసనప్రతి సహకారం: ఆవుల వినోద్, భువనగిరి

గ్రామ, మండల ప్రముఖులు

మార్చు

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వీక్షించేందుకు లాగిన్ లేదా సైన్ అప్ చేయండి". www.facebook.com. Retrieved 2024-08-19.

ఇవి కూడా చూడండి

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భువనగిరి&oldid=4302604" నుండి వెలికితీశారు