భోగి

దక్షిణ భారత పండుగ సంక్రాంతిలో మొదటి రోజు
(భోగిమంటలు నుండి దారిమార్పు చెందింది)

భోగిమంటలు సినిమా కొరకు చూడండి భోగిమంటలు (సినిమా)


భోగి
భోగి
భోగి మంటలు
రకంసాంప్రదాయ
ప్రాముఖ్యతశీతాకాల పండుగ
జరుపుకొనే రోజుజనవరి 14
ఉత్సవాలుభోగి మంటలు
సంబంధిత పండుగసంక్రాంతి
Pongal
Bihu (Bhogali / Magh /Bhogi in Telugu)
భోగి పండుగ రోజు తెల్లవారుజామున వేస్తున్న భోగిమంటలు

భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది.[1][2] దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.[3][4][5]

విశేషాలు మార్చు

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

భోగి మంటలు మార్చు

చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.[6]

కొత్త బట్టలు మార్చు

ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.

ముగ్గులు మార్చు

పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

భోగి పళ్ళు మార్చు

భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పలు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

భోగి పులక మార్చు

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

కోడి పందాలు మార్చు

గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి.

గాలిపటాలు మార్చు

భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.

సెలవు మార్చు

భోగి రోజు దాదాపు విద్యార్థులందరికి సెలవు ఉంటుంది, వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ స్వంత ఊరు చేరుకుంటారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Bhogi 2022: What Bhogi Means? How Is It Celebrated?". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-01-11. Retrieved 2022-01-13.
  2. Srih, Sri Sri Rangapriya Sri (2019-03-23). Festivals of Bharata (in ఇంగ్లీష్). Bharatha Samskruthi Prakashana. ISBN 978-93-89028-69-0.
  3. "About Bogi Festival | Bhogi Festival | Bhogi Celebrations". 1 January 2017.
  4. "bhogi pandigai: Bhogi Pandigai 2022: Check date, time & significance of Bhogi Pandigai". The Times of India (in ఇంగ్లీష్). January 13, 2022. Retrieved 2022-01-13.
  5. Murthy, Neeraja (2020-01-13). "Citizens speak about the change they would want to see this Bhogi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-13.
  6. [1] Post Jagran Article 15 01 2014

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భోగి&oldid=3576019" నుండి వెలికితీశారు