మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మట్టపల్లి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] ఈ దేవాలయం రెండవ యాదగిరిగుట్టగా పేరొందింది. చెంచు లక్ష్మీ తాయర్, రాజ్యలక్ష్మి తాయర్, ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దైవం. వెండితో చేసిన కవచం, మీసాలు కలిగి ఉంటాడు.[2]

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సూర్యాపేట జిల్లా
ప్రదేశం:మట్టపల్లి, మట్టంపల్లి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:నరసింహస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
11 వ శతాబ్ధం

చరిత్ర

మార్చు

పూర్వకాలంలో 11 వ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి ప్రభువు పరిపాలించేవాడు. ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి ‘మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయంవ్యక్తంగా ఉన్నాను’ అని చెప్పాడు. వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టుకింద పడుకొని, నిద్రించాడు. కలలో ‘నిన్ను కనిపెట్టలేని బతుకు వృథా! ఇక్కడే తనువు చాలిస్తాన’ని మాచిరెడ్డి చెప్పగా, స్వామి కరుణించి, ‘ఎదురుగా ఆరె చెట్టుపై ఉన్న గరుడపక్షి, ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని’ చెప్పాడు. నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి, గరుడపక్షి వాలిన చోట గుహను తొలగించగా అందులో లక్ష్మీనరసింహస్వామి కనిపించాడు. అప్పటినుండి ఈ ప్రాంతం మహాక్షేత్రంగా విలసిల్లుతోంది.[1] స్వామిని సామాన్య ప్రజలు కూడా సేవించుకోవడానికి వీలుగా స్వామికి ప్రతి నిత్యమూ సకల సేవలూ జరపటానికీ అన్ని ఏర్పాట్లూ చెయ్యటమేగాక, ముఖ మంటపాన్ని కూడా నిర్మింపచేసి ఆలయాభివృద్ధికి కృషి చేశాడు.

నిర్మాణ వివరాలు

మార్చు

ముఖమండపం ఇరవై ఒక్క స్తంభాలతో కూడి ఉంది. సిమెంటుతో చేసిన పైకప్పు కూడా ఉంది. ఉత్తర ద్వారం ముందు ఐదు దూలాలు, సిమెంటుతో కూడిన మంటపాన్ని చూడవచ్చు. స్వామికి ఎదురుగా హనుమంతుని విగ్రహం ఉంది.[2] పులిచింతల ప్రాజెక్టు నీరు దేవాలయంలోకి రాకుండా ఉండడంకోసం శివాలయం, అన్నదాన సత్రాల రక్షణకోసం ఆలయం చుట్టూ రూ. 2 కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్‌ వరకు రూ.4 కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం కరకట్టలు నిర్మించింది.

పూజలు, ఉత్సవాలు

మార్చు

భక్తులు కృష్ణానదిలో స్నానంచేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా వున్న ఆరె చెట్టు, ధ్వజ స్తంభం, ఆంజనేయస్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు.[3] ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, ఆ కోరిక తీరిన తరువాత మళ్ళీ వచ్చి 32 ప్రదక్షిణలు చేస్తారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో మూడురోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ జరిగే నిత్యకల్యాణ కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత కళ్యాణ వేడుక జరుగుతుంది.[4]

ఇతర వివరాలు

మార్చు
  1. గుహ బయల్పడకముందు భరద్వాజాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని, ఇప్పటికీ కొంతమంది మహర్షులు సూక్ష్మరూపంలో స్వామివారిని దర్శించుకుంటారని స్థల పురాణం చెబుతోంది.
  2. కాలక్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో గుహకు ఉత్తరం వైపు మరో ద్వారం ఏర్పాటుచేయబడింది.
  3. స్వామివారికి ఆరెపత్రితో పూజలు నిర్వహిస్తారు.
  4. అన్ని ప్రధాన హిందూ పండుగలు జరుపబడుతాయి
  5. భక్తులకు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందించబడుతోంది.
  6. దేవాలయంలోని శంఖాన్ని చెవి దగ్గర ఉంచుకుంటే, తారం అని పిలువబడే పవిత్రమైన ప్రణవ శబ్దం దాని నుండి ప్రతిధ్వనిస్తుంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 telugu, NT News (2022-03-20). "యాదాద్రి కాకుండా తెలంగాణ‌లో ఉన్న న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాల గురించి తెలుసా". Namasthe Telangana. Archived from the original on 2022-03-21. Retrieved 2022-03-28.
  2. 2.0 2.1 Shankar, Deekonda Ravi (2021-10-17). "Maha Kshetram - Mattapalli Yoga Laxmi Narasimha temple". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  3. "మట్టపల్లి నృసింహునికి వెయ్యేళ్ల చరిత్ర - Nijam News". 2022-01-28. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  4. telugu, NT News (2021-10-17). "వైభవంగా మట్టపల్లి లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం". Namasthe Telangana. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.