యాదగిరిగుట్ట

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, లోని జనగణన పట్టణం

యాదగిరిగుట్ట, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1]ఇది జనగణన పట్టణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగష్టు 2న పురపాలక సంఘం గా మారింది.[2]

యాదగిరిగుట్ట గ్రామం

ఇది హైదరాబాదు నుండి వరంగల్లు వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.తెలంగాణలో పేరు పొందిన ఆద్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది.

స్థల చరిత్ర

మార్చు
 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ముఖద్వారం. యాదగిరిగుట్ట

పూర్వం యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతుంది.

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

మార్చు
 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన ఆలయ గోపురం. యాదగిరిగుట్ట

ప్రధాన వ్యాసం: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము

 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.

రవాణా సౌకర్యం

మార్చు

యాదాద్రి లో రైల్వేస్టేషన్ ఉంది. యాదగిరిగుట్ట లో రెండు బస్ స్టేషన్ లు కలవుహైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము (ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.లకు మొదటి బస్సు ఉంది.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో

మార్చు

భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపోలో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి బస్ సౌకర్యం కలిగి ఉంది

100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి

మార్చు

యాద‌గిరిగుట్ట పట్టణంలో ప్రస్తుతం ఉన్న 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఏరియా ఆసుప‌త్రిగా మారుస్తూ 2022 నవంబరు 30న తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యా విధాన ప‌రిష‌త్ ఉత్త‌ర్వులు జారీచేస్తూ, దీని నిర్మాణానికి 45.79 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. దీంతో పాటు ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా 13 ప్రాథ‌మిక ఉప కేంద్రాల‌ను మంజూరు చేసింది ప్ర‌భుత్వం. ఒక్కో ఆస్ప‌త్రి నిర్మాణానికి రూ. 20 ల‌క్ష‌లు కేటాయించింది.[3]

ప్రభుత్వ వైద్య కళాశాల

మార్చు

యాదగిరిగుట్ట పట్టణంలో 183 కోట్ల రూపాయలతో యాదాద్రి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 2023 జూలై 5న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా 2023 సెప్టెంబరు 16న పరిపాలనా అనుమతులతో జిఓ 162ను జారీ చేసింది. 20 ఎకరాల్లో వైద్య కళాశాల, దానికి అనుబంధంగా 300 పడకల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నిర్మించబడనున్నాయి.[4]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
  3. telugu, NT News (2022-11-30). "యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన మంజూరు". www.ntnews.com. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.
  4. telugu, NT News (2023-09-17). "1830 కోట్లు యాదాద్ది మేడికల్ కాలులేజీకి". www.ntnews.com. Archived from the original on 2023-09-20. Retrieved 2023-09-28.

వెలుపలి లంకెలు

మార్చు