మడిపల్లి భద్రయ్య
మడిపల్లి భద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మికవేత్త.
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1945, జనవరి 17వ తేదీన నిర్మల్ పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1968లో బి.ఎ.ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్వరుని మీద సీసపద్యాలలో ఒక శతకాన్ని వ్రాశాడు. తండ్రి నుండి ఇతడు పద్యాలను ఎలా ఆలాపించాలో నేర్చుకున్నాడు. ఇతడు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు కోరుట్ల ఆంధ్ర బాలానందసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.[1] 1963లో లక్సెట్టిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, భైంసా, దిలావర్‌పూర్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆసిఫాబాద్ మొదలైన చోట్ల పనిచేసి 2001లో కుంటాల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర పద్యకవితా సదస్సు, నర్సాపూరులో నవతా కళా సమితి మొదలైన సాహితీ సాంస్కృతిక సంస్థలను స్థాపించి ఆయా ప్రాంతాలలో సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి పాటుపడ్డాడు. ఇచ్చోడలో పనిచేస్తున్నప్పుడు "ప్రత్యూష" అనే లిఖత సాహిత్యపత్రికను నడిపాడు. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానము వంటి పౌరాణిక నాటకాలతో పాటు నటనాలయం, రాముడు లేని రాజ్యంలో వంటి సాంఘిక నాటకాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతడు బుల్లితెరపై నాగబాల, చాకలి ఐలమ్మ, కొమరం భీం వంటి సీరియళ్లలో కూడా నటించాడు. ఇతడు తొలి, మలి తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు. ఇతడికి భార్య ఇందిర, నలుగురు కుమారులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు.[2]
రచనలు
మార్చుఇతడు ఆధ్యాత్మిక రచనలు, గేయాలు, ఒగ్గుకథలు, హరికథలు అనేకం రచించాడు. ఇతడు ప్రస్తుతం ఆదిలాబాదు మాండలిక పదకోశం నిర్మిచే పనిలో వున్నాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని[2]:
- శ్రీ షిర్డీసాయి త్రిశతి
- శ్రీ జ్ఞానసరస్వతీస్తవం
- శ్రీ షిర్డీసాయి భజనావళి
- శ్రీ మెహర్ భక్తి గీతావళి
- శ్రీ సత్యసాయి స్తుతి
- నాలోని నాదాలు
- శ్రీ శివభక్త చరితమ్ (పద్యకావ్యం)
- మనోవేదన (పద్య సప్తశతి)
- మన ఆదిలాబాదు (జిల్లా సమగ్ర దర్శిని)
- శ్రీహరి లీలలు (పద్యకావ్యం)
- నిరసన గొంతుకలు (తెలంగాణ ఉద్యమ పాటలు - పద్యాలు)
- శ్రీ ప్రభాకర్ మహారాజ్ స్మృతిలో (సంక్షిప్త జీవిత చరిత్ర)
- శ్రీ శివలీలలు (ఏకచ్చంద చంపూకావ్యము)
- శ్రీ షిర్డీ సాయి చరితమ్ (హరికథా రూపకం)
- కర్తవ్యం (కవితలు)
- మనో విలాసం (ద్విశతి)
- శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహ శతకము (ద్విశతి)
- చాచా నెహ్రూ (ఆకాశవాణి రూపకం)
- నిర్మల్ చరిత్ర (ఒగ్గు కథ) మొదలైనవి.
పురస్కారాలు
మార్చుఇతనికి అనేక పురస్కారాలు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని[1]:
- 1983 - జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
- 1988 - రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
- 1997 - జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు.
- 1997 - కళాభారతి, చంద్రాపూర్ వారిచే సన్మానం.
- 2010 - అభినవ పోతన వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం
- 2011 - తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం
- 2014 - ఎం.వి.నరసింహారెడ్డి సాహితీ పురస్కారం
- 2015 - ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి స్మారక జాతీయ పురస్కారం.
- 2015 - తెలంగాణా రాష్ట్ర అవతరణ ప్రథమ వార్షికోత్సవాలలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ సాహితీవేత్తగా పురస్కారం.
- 2015 - బాసర శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ సాహితీవేత్తగా పురస్కారం.
- 2015 - రంజని తెలుగు సాహితీ సంస్థ వారి పద్యకవితా పోటీలలో విశ్వనాథ అవార్డు.
- 2015 - భారత కల్చరల్ అకాడమీ వారి కళాశిరోమణి అవార్డు.
బిరుదులు
మార్చు- విశిష్ట కళారత్న
- కళాజ్యోతి
- సాహిత్యరత్న