మతుకుమల్లి నృసింహకవి

రచయిత, కవి

మతుకుమల్లి నృసింహకవి లేదా మతుకుమల్లి నృసింహశాస్త్రి (1816-1873) ఒక ప్రముఖ కవి. ఆయన రాసిన రచనల్లో అజ చరిత్రము, చెన్నపురీ విలాసము పేరు గాంచినవి.

మతుకుమల్లి నృసింహకవి
జననంమాగుంట సుబ్బరామిరెడ్డి
1816
తెనాలి
మరణం1873
నివాస ప్రాంతంతెనాలి
ఇతర పేర్లునృసింహకవి
వృత్తికవి, ఆస్థాన పండితుడు.
ఉద్యోగంశ్రీ మల్రాజు గుండా రాయుడు
ప్రసిద్ధిఅజ చరిత్రము, చెన్నపురీ విలాసము రచనలు.
మతంహిందూ
తండ్రికనకాద్రి శాస్త్రి.
తల్లిజానకమ్మ.

ఆయన సా.శ. 1816 - ధాత సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి రోజున తెనాలిలో జన్మించాడు. తల్లి జానకమ్మ, తండ్రి కనకాద్రి శాస్త్రి. ఆయన సకలశాస్త్ర ప్రవీణుడు. శ్రీ మల్రాజు గుండా రాయుడు దగ్గర ఆస్థాన పండితుడిగా ఉండేవాడు. ఆయన తల్లి కూడా విదుషీమణియే. మూడు శతాబ్దాల నుండి వారిది పండిత వంశము. ఇతడు సా.శ. 1873 - శ్రీముఖ సంవత్సర శ్రావణ బహుళ తృతీయ రోజున నిర్యాణం చెందాడు.

వంశచరిత్ర

మార్చు

మూడు శతాబ్దాల నుండి వీరిది పండితవంశము. ఈతని ప్రపితామహుడు మాధవకవి. ఈయన వ్యాసభారతము యధామాతృకముగ ననువదించి "అభినవ భారతము" అని పేరుపెట్టెను. ఇందు కొంతభాగము తాడిపత్రి గ్రామమున తగులబడినట్లు చెప్పుదురు. తెనాలి గోవర్ధనస్వామి కోవెల యెదుటగల గరుడవిగ్రహము మాధవకవి శిల్పకళాకుళలతకు తార్కాణము. ఈయన పుత్రులు నృసింహశాస్త్రి గారు. వీరు వేదవిదులు, గొప్ప వైయాకరణులు. కనకాద్రిశాస్త్రిగారు వీరి కుమారులు. వీరే మన నృసింహకవి జనకులు. కనకాద్రిశాస్త్రిగారు సకలశాస్త్ర ప్రవీణులు. శ్రీ మల్రాజు గుండారాయుడుగారి సంస్థాన పండితులు. గుండా రాయడుగారు నాడు పేరుమోసిన పెద్ద జమీందారులలో నొకరు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వీరిని గూర్చి యీకథ ముచ్చటించిరి:

"ఒకప్పుడు వాసిరెడ్డి వేంకటాద్రినాయడునును, నర్సారావుపేట మల్రాజు గుండారాయడును, నూజవీటి అప్పారావును, చల్లపల్లి అంకి నీడును గూడి యిష్టాగోష్టి సల్పుకొను సందర్భమున హాస్య చతురుడు గుండారాయడు 'మన జీవితములు కడచిన తర్వాత లోకము మనల నెటు ప్రశంసించునో తలచి చూచుకొందమా? అనెనట. అందఱు నంగీకరించిరట. నూజవీటి అప్పారాయడు చనిపోయెనా బైరాగులందఱును బలవించెదరు. తాను చనిపోయితినా వేశ్యలందఱు పలవించెదరు. వేంకటాద్రి నాయుడు చనిపోయెనా అందఱు ఆహా యని సంతోషించెదరు."

ఈ గుండారాయని యాస్థానమున నుండి పాండిత్య శక్తిచే నీ కనకాద్రి శాస్త్రిగారు స్థిరమైన భూమి నార్జించి సుఖించెను. నృసింహవిద్వత్కవి తల్లి కూడా విదుషి. ఆమె పేరు జానకమ్మ. చదలపాక సుబ్బయామాత్యుని కొమార్తె.

మన కవివరుని తమ్ముడు కృష్ణశాస్త్రి. ఆయన తన యన్నగారి "అజ చరిత్రము"లో నక్కడక్కడ నాశ్వాసాంతపద్యములు పోయినవి మరల వ్రాసెను. అతడు కూడా జక్కని కవితాధార కలవాడు.

రచనలు

మార్చు

సాహిత్య విశేషాలు

మార్చు

మన నృసింహవిద్వత్కవి పూర్వులను మించిన పండితుడు అజచరిత్రమును ప్రౌఢ ప్రబంధ మితని కృతులలో నుతికెక్కినది. ఇందలి శైలి వసుచరిత్రకు సహపాఠి. తెలుగు కంటే సంస్కృతపుబాలు వీరి కవితలో హెచ్చు. భావములు మహోన్నతములు. భావ నిర్దుష్టము. ఈ పద్యమిన్నిటికి నాదర్శమైనది.

సీ. ఘనఘన శ్రీసముత్కట జటావరవర
          క్రమయుక్తయీమయరమ్యవేణి
నానాస్వరవ్యంజన ప్రతాపానూన
         శబ్దమహాశబ్దశాస్త్ర వీణ
భూరిగుణవిశేష పుంజైక నిత్యసం
         బంధవత్తర్క విభ్రాజుశని
సరసాలంక్రియోజ్జ్వల సువర్ణపదోరు
         సంగీతసాహితీ స్తనభరాఢ్య

గీ. క్షిప్రసద్ధతి ముఖరభాట్ట ప్రభాక
రీయమంజీరముహ రమణీయ చరణ
జలజనిత్య ప్రగల్భ వాచాల వాణి
నిలుచుగాత మదీయాస్య జలరుహమున.

ఈ అజచరిత్రకే ఇందుమతీ పరిణయమని మాఱుపేరు. ఇందున్నవి యాఱాశ్వాసములు. ఆద్యంత మొక్కరీతిని కవిత మహాప్రౌఢముగా నడిచింది. వసుచరిత్రాదుల ఛాయలు పెక్కులున్నను గవి ప్రతిభావ్యుత్పత్తులు వానిని కప్పిపుచ్చినవి. ఈ కావ్యము మంగళాంతము. ఈ కృతిని నృసింహస్వామికే అంకితము చేసెను.

చెన్నపురీ విలాసము

మార్చు

ఈ కవిసింహుని యతర కృతులలో "చెన్నపురీ విలాస" మొకటి చెప్పుకొనదగినది. ఇది శ్రీరాజా బొమ్మదేవర నాగన్ననాయడు జమీందారువారి యాజ్ఞచే రచియింపబడిన కృతి. ఈయన కృష్ణా మండలములోని "తోట్లవల్లూరు" సంస్థానాధిపతి. ఆ సంస్థానమున నీ నృసింహకవి పండితుడుగను, బరీక్షాధికారిగను నుండెను. సంస్థాన ప్రభువువలన మన కవి మహాసన్మానముల నందుచుండెను. కొమ్ములు తిరిగిన పండితులు వార్షికములకు వచ్చినపుడు వీరే పరీక్షాధికారులు. తర్కాదిశాస్త్ర పండితులగు శ్రీ ప్రభల సుందరరామశాస్త్ర ప్రభృతులను వీరు శాస్త్రవాదమున నోడించిరని యందురు. శ్రీ జగద్గురు శంకరాచార్యులవారి పీఠ విద్వాంసుల సమక్షమున బైవారికిని మన శాస్త్రిగారికిని దర్కశాస్త్రీయవాద మిరువదియొక్క దినము జరిగినదట. అప్పుడు వీరి విజయము నెఱిగి పీఠాచార్యులీపండితు నేనుగుపై నూరేగించిరట. ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములలో వీరి వాదప్రావీణ్యము మగణ్యము. నృసింహోపాసకుడగుటచే నీయనయెదుట వాదముచేసి నెగ్గిన వారు లేరని వచింతురు. వీపి బుద్ధిలో బ్రతిఫలిపని శాస్త్రము లేదు. కళ లేదు. ఇందులకు వారి గ్రంథమలే సాక్షులు. ఈయన ముప్పది యేండ్లు వచ్చువఱకు బితురంతే వాసియై షట్ఛాస్త్రములు లోతులుమాట్ట వ్యాసంగించెను. అప్పుడు వాక్యార్థములకు గ్రంథరచనకు గడగెను. లోకమర్యాదకు సంస్థానపండితుడుగా నుండెగాని ప్రభువుకు లొంగియుండలేదు.

సంస్థాన ప్రభువు నాగయ్యనాయడుగారితో కలిసి నీ కవి చెన్నపురము వెళ్ళినపు డాపట్టనవిలాసములు ప్రబంధరూపముగ వర్ణింపుడని యడుగనీ "చెన్నపురీవిలాసము" రచించిరట. అది 1860 ప్రాంతము. నాటి మదరాసులోని విశేషములన్నియు నిందు గన్నులకు గట్టినట్లు వర్ణింపబడినవి. వీధులు, మేడలు, సముద్రము, రైలు, పోటోగ్రాపు, అచ్చు కూటములు, ఆసుపత్రులు, మ్యూజియము, లైటుహౌసు, హార్బరు పువ్వులయంగడి మున్నగు నెన్నో ప్రకరణము లిందు గలవు.. కావ్యము గద్యపద్యాత్మకము. కవిలోకజ్ణత కిది యద్దము. ఆకాలమున నిట్టిక్రొత్తయూహ లూహించిన కృతికర్తను నేటిచారిత్రకులు ప్రశంసింప దగియున్నది. ఇందలిపద్యము లన్నియు గొప్పవి. అచ్చటచ్చటివి మచ్చు.

మ. ఎరణాయూరును గత్తివాక యడసూరిరెన్నెళుంబూరు మే
ల్తిరునట్టూరును రాయపేట తిరుపల్లిక్కేళి చేపాకమున్
బరశుంవాక పరంగికొండ మరకృష్ణాంపేటయన్ లోనుగా
బురిచుట్టున్ విలసిల్లునాటుపురమల్ భూతింద దేకాకృతిన్.

గీ. సరకు నింపను దింపను సారెసారె
దరులయొద్దకు దరియొద్ద కరుగుపడవ
లోడలకు మేడలకు మైత్రినొసరగూర్ప
నిటు నటు చరించుచారుల నెనసి వెలయు.

మ. అల మోగ్మేను సరంగి బొంబయియు బర్మాసీమపైగోవ బం
గళ కోరంగియు నాదిగాగలుగు ప్రఖ్యాతంపుకోస్తాల నా
వలరాక ల్నగరీజనంబులకు రేవల్ దెల్పు రంజిల్లు ను
జ్జ్వల'సీకష్ట' నివిష్ట కేతన పటు స్తంభాగ్రచేలచ్చటల్.

సీ. క్షమవిహరించువాక్సతి పుట్టినయిలు మ
          తుకు మల్లి కులమతల్లిక తదస్వ
యోదితు వేంగళార్యాదులు మాల్యశై
          ల నృసింహ కరుణోపలబ్ధ పర చ
తుష్షష్టి విద్యావిదులు భవత్ప్ర పితామ
          హుండు మాధవకవీంద్రోత్తమ డభి
నవభారతాది నానాగ్రంథకర్త నీ
          తాత నృసింహ విద్వద్వరుండు

గీ. శబ్దశాస్త్ర త్రయీ విచక్షణుడు నీదు
జనకు డైనట్టి కనకాద్రిశాస్త్రివర్యు
డఖిల శాస్త్రార్థవేది నీవద్భుత ప్ర
సిద్ధసారస్వతుడవు నృసింహశాస్త్రి!

మూలాలు

మార్చు
  1. నృసింహకవి, మతుకుమిల్లి (1941). చెన్నపురీ విలాసము. Retrieved 2020-07-13.
  • ఆంధ్ర రచయితలు - 113మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. -27వ పుట