మయూరుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అను సూక్తి మనలో చాలామంది వినేవుంటారు. నిత్యము సూర్య నమస్కారాలు లోనర్చుచు ఎంతటి వార్ధకావస్థయందును దేహబలము చెడక జీవించుచున్న అదృష్టవంతులు కలరు. సూర్యుడు ప్రత్యక్ష దైవమని నమ్మి సూర్యశతకమును రచించిన ప్రఖ్యాత సంస్కృత వాజ్మయ కవి ఇతడు శ్రీమయూరుడు. ఇతడు కాదంబరి రచయితగా ప్రఖ్యాతి గాంచిన భట్ట బాణుడుకు సమకాలికుడు. బాణుడు శ్రీహర్షుని ఆస్థానకవి. మయూరుడు ఉజ్జయినీ ప్రభువయిన వృద్ధ భోజుని ఆస్థాన కవి. బాణునకు మేనమామ అని చెప్పుటకు ఆధారములు ఉన్నాయి. ఒకటి, మానతుంగాచార్యప్రణీతమయిన భక్తామరాఖ్యస్తోత్ర టీకాప్రారంభమందలి ప్రశంస. రెండవది, మేరుతుంగాచార్య ప్రణీతమయిన ప్రబంధ చింతామణి అని జైనమత గ్రంథములోని ప్రశంస. శ్రీహర్షుని కాలము ననుసరించి బాణమయూరులు సమకాలికులు అని చెప్పవచ్చును.
మయూరుడు | |
జననం | 7వ శతాబ్దం |
---|---|
స్వస్థలం | ఉజ్జయినీ |
ఇతర పేర్లు | మయూరుడు |
రచనలు | సూర్యశతకము |
సమకాలీనులు | భట్ట బాణుడు |
ఆశ్రయమిచ్చిన రాజులు | వృద్ధ భోజుడు |
సాహిత్య ప్రయోజనములలో కల్యాణ సంధాయకత్వము ఒకటని నిరుపించుటకు మయురిని కవిత ఏకైక నిదర్శనముగా నున్నది. మమ్మటుడు కావ్యప్రకాశము ఈ అర్ధమునే పోషించుచున్నది. ఆదిత్యాదేః మయూరాదీనాం ఇవ అనర్ధనివారణం అని ఉంది. మమ్మటుడు సా.శ.1050 నాటి వాడు. దీనికి జయరాముడను వ్యాఖ్యాత మయురనామా కవిః శతశ్లోకే నాదిత్యం స్తుత్వా కుష్ఠా న్ని స్తీర్ణః ఇతి ప్రసిద్ధిః అని వ్రాసినాడు. ఈ వాక్యములను బట్టి మయూరుడు తన సూర్య శతకములో అక్కడక్కడ చెప్పిన వానిని బట్టియు మయూరుడు కుష్ఠురోగియై ఆరోగమును బాపుటుకు సూర్యుని అభివర్ణించినట్లు తెలియుచున్నది.
అతి ప్రాచీనమయిన వేదమహత్తు ఆతని రచనయందు వెల్లివిరిసింది. విశ్వాత్ముడైన సూర్యుడు ఆతనికెంత కైవసమైనాడో గాని తాను తరించి ఇతరులను తరింపజేసినాడు.
మయూర కవి సూర్యశతకమును శ్రీనాథమహాకవి తొలుత కాశీఖండమున 15 శ్లోకములను, భీమ ఖండమున శివరాత్రి మాహాత్మ్యమున మరి రెండు శ్లోకములను నాంధ్రీకరించినాడు. క్రీ. శ. 1893 నుండియు తెలుగున సంపూర్ణానువాదములు ప్రారంభమైనవి. ఈ క్రింది వారి యనువాదములు లభ్యమగుచున్నవి.[1]
- ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి (1893)
- వడ్డాది సుబ్బారాయుడు--(1899)తెలుగులో సా.శ.1898వ సంవత్సరమున శ్రీ. వ.సు.రాయుడు సరస్వతి పత్రికలో అంధ్రసూర్యశతకమును ప్రకటించారు.
- మహాకవి దాసు శ్రీరాములు (1902) సూర్య శతకము తెలుగులోకి అనువాదము కావించారు.
- యామిజాల పద్మనాభస్వామి
- చదలువాడ జయరామ శాస్త్రి
- నేమాని సూర్యప్రకాశకవి
1905 వ సంవత్సరమున బెరన్ హైమర్ అను ఇటాలియన్ భాషలోనికి అనువదించాడు.
జీవిత విశేషాలు
మార్చుమయూరుడు చక్కని రూపురేఖలు కలవాడు.భార్య ఒక ఆడుబిడ్డను కని గతించింది. క్రమంగా ఆ పిల్ల పెరిగిపెద్దదైనది. బాణునికిచ్చి మయూరుడు కన్యాఫలదానం గడించుకున్నాడు.ఒకనాడామె జలకమాడి మేడపై తలని ఆర్చుకున్నప్పుడు అది చూసిన మయూరుడు ఎండలో ఆదృశ్యం అతనిలో ఉద్రేకాన్ని కరిగించింది. తత్ఫలితంగా కుష్ఠురోగి అయ్యాడు.మయూరుడు తల్లి అప్పటికింకా జీవించే ఉంది. మయూరుని వ్యాధి దినదినము వృద్ధి పొందుతూఉంది. తల్లి దుఃఖము ముసలితనము పోటాపోటీగా పెరుగుతూన్నాయి. ముక్కముక్కలుగా అవయవాలు తెగి పడిపోయే దుస్థితిలో మయూరుడు ఒక మూల కూర్చొని ఉండేవాడు.
ఒకనాడు ప్రొద్దునే అగస్త్యుడు వృద్ధ బ్రాహ్మణ వేషధారియై మయూరిని ఇంటికి వచ్చికోరి ఆగదిలో ప్రవేశించాడు.అసహ్యమైన రుజతో గిజగిజమని వణుకుతూ మూలుగుతున్న మయూరుణ్ణి సమీపించాడు. మయూరుడికి దృష్టికూడా సరిగా లేదు. అగస్త్యుడు దగ్గరగా వెళ్ళి మయూరుడి తలపై దక్షిణహస్తం ఉంది ఆదిత్య హృదయం ఉపదేశించి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. కర్మ పరిపక్వమయింది. మయూరుడు రోగ విముక్తడైనాడు.ఆత్మ ప్రేరణతో సూర్య శతకం వ్రాశాడు. ఇది పెద్దల వల్ల వినుకడిలో ఉన్న కథ. ఈ కథ ఎలాంటిదయినా సామాన్యములైన ఔషధములకు సాధ్యంకాని ఏమొండి రోగానికో చిక్కి మయూరుడు ఆరోగ్యం భాస్కరాధిఛ్ఛేన్ అనే సూక్తిని అనుసరించి సూర్య శతకం వ్రాసి దాని వల్ల కృతార్ధుడైనాడు అనేది భావించవలసిన విషయం.
ఆకాలంలో ఆదిత్యోపాసన ప్రచురంగా ఉందనుటకు చరిత్రలో ఆధారాలున్నాయి. హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుడు పరమాఅదిత్యభక్తుడు అని హర్ష చరిత్రలో ఉంది. ప్రయాగలో హర్షుడు సూర్యబుద్ధ శివ విగ్రహాలకు పూజ చేసేవాదని చీనాయాత్రికుడు హ్యూంత్సాంగ వ్రాసాడు. మయూరుడికి కుష్ఠు వ్యాధి ఏవిధంగా వచ్చినదనేది సరిగా నిర్ణయించలేము. కాని జైన గ్రంథాలలో ఉన్న కథ చిత్రంగా ఉంది. సూర్య శతకాన్ని ప్రకటించిన యజ్ఞశ్వరుడు అనే ఆయన తాను మేరుతుంగా చార్యుని ప్రబంధ చింతామణి నుంచి సంగ్రహించినట్లు ఇట్లు వ్రాసినాడు : బాణు మయూరులు కవితా వినోదాలలో ఒకరిని మించి ఒకరు ప్రసంగించుకొనేవారు. మయూరుడొకనాడు రాత్రి ఏవో శ్లోకాలని తెల్లవారుజామున బాణునకు వినిపించాలని కుతూహలంతో బానుని ఇంటికి వచ్చాడు. ఇంకా అంతా నిద్రిస్తూన్న సమయం. కాని బాణుని గొంతు మయూరుడికి వినిపించింది. ప్రణయ కలహంలో భీష్మించుకున్న భార్యని ప్రసన్నురాలుని చేసుకోడానికి పడినపాత్లు విఫలమై తెలవారి పోవచ్చిందే అని దిగులుతో బాణుడు శ్లోకరూపంలో మూడు పాదాల పద్యం వ్రాసి మిగతా 4 వపాదం సరిగా రాకపోవుటచే బయటవున్న మయూరుడు దానిని పూరించగా బాణుడు అదివిని ఆతనిని కౌగిలించుకొనగా అది చూసిన బాణుని భార్య ఆమే శృంగార కేళి రసాభాసం అయినదనే క్రోధంగా మయూరుడు మీద తన నోటిలో ఉన్న తాంబూలం పిప్పి ఆతనిమీద ఉమ్మి కుష్ఠురోగి అయినాడు. తెల్లవారింది దిగులుగా మయూరిడింటికి వచ్చి నిత్య కృత్యాలు అతికష్టం మీద అయాయనిపించుకొని మామూలుగా దర్బారుకు వెళ్ళాడు. వ్యాధి పొక్కింది. హర్షుడు మయూరుణ్ణి బహిష్కరించాడు. దైవ ప్రసాదముగా తనలో ఉన్న కవితా శక్తితో ఆదిత్యోపాసన చేసాడు.శతక రచన ఆరంభించాడు. 6వ శ్లోకం వ్రాసేసరికి కుష్టునయమై పోయింది. శతకం పూర్తి చేశాడు. మునుపటికన్నా తేజశ్వి అయినాడు. కులివుకి వెళ్ళాడు. రాచమన్నన్న మరలా పొందాడని యజ్ఞశ్వరుడు తన జైన గ్రంథములో వ్రాసినాడు.
సూర్యశతకము ఉదాహరణ పద్యాలు
మార్చుకిరణ ప్రసార వర్ణనతో ఆరంభించి 19శ్లోకాలలో సక్రమంగా కిరణపుంజ సాంద్రత వర్ణించాడు. ఆపైన 43వ శ్లోకం వరకూ ద్యుతివర్ణన, తరువాత 49వ శ్లోకం వరకు వాహన చిత్రణ, తదుపరి 61వశ్లోకం వరకూ సారథి పశంస, పిదప 72వ శ్లోకం దాకా రథశ్లాఘ, 82వశ్లోకం పర్యంతం మండల శోభ, అటుపై 100వశ్లోకం వరకూ సూర్యస్తుతి. ఇదీ మయూర శతక పద్ధతి.
- శీర్ణఘ్రాణాంఘ్రిప్రాణీన్ వ్రణిభిరవపఘనైః
- ఘర్ఘ రావ్యక్తఘోషాన్
- దీర్ఘాఘ్రాతానఘౌషైఃపునరపిఘటయ
- త్యేక ఉల్లాఘవన్యః
- ఘర్మాంశోః యస్యవోంతర్ద్విగుణ
- ఘనఘృణానిఘ్ననిర్విఘ్న వృత్తేః
- దత్తార్ఘాఃసిద్ధసంఘైఃవిదధతు ఘృనయః
- శీఘ్ర మం హో విఘాతం!
- శ్లోకాలోకస్యభూత్యైః శతమితిరచితాః
- శ్రీమయూరేణ భక్త్యా
- యుక్తశ్చైతాన్ పఠేద్యఃసకృదపిపురుషః
- సర్వపాపైర్విముక్తః
- ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం
- కాంతిమాయుః ప్రకర్ష
- విద్యామైశ్వర్యమర్ధం సుతమపి లభతే
- స్తోత్ర సూర్యప్రసాదాత్!
మాయూర సూర్య శతకానికి 25 వ్యాఖ్యలు వెలువడ్డాయి.తెనుగున 1898వసం.లో సరస్వతీ పత్రికలో ఆంధ్ర సూర్య శతకము అనే పేరుతో ప్రకటించారు. ఆకుండి వ్యాసమూర్తిగారు దీనిని తెనుగించారు.1905లో బేరన్ హైమర్ పండితుడు ఇటాలియన్ భాషలోకి అనువదించాడు. సింహళీయములోనికి కూడా దీనిని అనువదించారు.
శ్రీనాధుడు -సూర్యశతకము
మార్చుచిరుసానబట్టించి చికిలిసేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు అనునది మొదలుగా కాశీఖండములో ప్రథమాశ్వాసమున 121 నుండి 132 వ పద్యము వరకు మయూరుని శ్లోకములకు అనుకృతులు శ్రీనాధుడు అనువదించాడు.
- కరకుం గొడ్దలియై నిశాలతకు, ప్రా
- క్తంవంగి హస్తాగ్రమై
- మెరుగుంజుక్కల కల్వదోట చిదుమన్
- మింటిన్ భువిన్ దెల్పగా !
- ఆంధ్ర సూర్యశతకము
- సరిహద్దై దవవహ్నియై యిరులగా
- ల్చన్ సృష్టి తెల్వొందగా
- సరిసీ జాసనుడౌ ననూరుడు వడిన్
- శాసించు మి యాపదల్ !
ఉన్నదినుట్లు చెప్పవలసినచో ఉభయభాషా ప్రౌఢిమగల, శ్రీనాధకవిసార్వభౌముని వంటివాడు తన ఉత్తమ రచన అయిన కాశీఖండములో వింధ్యగర్వాపహరణ కథా ఘట్టమున సూర్యోదయ వర్ణనము అను శీర్షికతో వ్రాసిన శ్లోకములకు తెలుగుసేత అనుటకు సందేహము లేదు.
మూలము
మార్చు- భారతి 1951 సంచిక.
- భారతి 1965 సంచిక, వ్యాసము సూర్యోపాస్తి-శ్రీ యామిజాల పద్మనాభస్వామి.
- ↑ శ్రీరాములు, దాసు (1902). "పీఠిక (నిడదవోలు వెంకటరావు)". శ్రీ సూర్య శతకము (2 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. Iv–xv.
బయటి లింకులు
మార్చుసూర్యశతకము Archived 2016-03-05 at the Wayback Machine