మహాభారత వీధి నాటకోత్సవం
- భారత, భాగవత కథలంటే చెవి కోసుకునే వాళ్ళు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. కానీ, మహాభారతాన్ని ఒక ఇన్నిస్టిట్యూషన్ లాగా రూపొందించడం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క చిత్తూరు జిల్లా లోనే జరిగిందనీ, బహుశా దేశం మొత్తంలో ఇంకెక్కడా కూడా మహాభారతం ఇంతగా ప్రజల సాంస్కృతిక జీవనంలోకి చొచ్చుకు పోలేదేమో నంటూ పసుపు లేటి పూర్ణ చంద్ర రావు గారు, ఆంధ్ర జ్యోతి పత్రికలో వివరించారు.
ధర్మ రాజు గుళ్ళు
మార్చుధర్మరాజు గుళ్ళు పేరుతో చిత్తూరు జిల్లాలో నూరుకు పైగా ధర్మరాజు గుళ్ళున్నాయి. వీటిని గుళ్ళు ఆనటం కన్నా, 'సాంస్కృతి ప్రదర్శనా కేంద్రాలు ' గా పిలువవచ్చు. ప్రతి సంవత్సరం 12 నుంచి 18 రోజుల వరకూ మహాభారతంలోని పర్వాలన్నిటినీ 'వీధి నాటక రూపంలో ' ధర్మ రాజు గుళ్ళ ముందు ప్రదర్శిస్తారు. ఇలా చిత్తూరు జిల్లా అంతటా ఈ ప్రదర్శ నాలు జరుగుతాయి. ఈ ప్రదర్శనాలను ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తరలి వస్తారు. ఇలా తరలి వచ్చే ప్రజలకు సదుపాయంగా వివిధారకాలైన అంగళ్ళూ, గ్రామీణ ఆట పాటలూ, వినోదాలు చోటు చేసుకుంటాయి. ఇలా ప్రతి గుడి ముందూ ఒక జాతరలాగా తయారౌతుంది. ముఖ్యంగా పని పాటలన్నీ అయిపోయిన తరువాత వేసవి లోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. జాతరలూ, వీధి నాటకాలో, ఆధ్ర దేశంలో ఇతర చోట్ల ప్రదర్శింప బడినా, నూరు ప్రదర్శనాలకు పైగా ప్రదర్శింప బడట చిత్తూరు జిల్లా విశేషం.
ఎన్నో వీథి నాటక బృందాలు
మార్చుమహాభారత కథకు చిత్తూరు జిల్లాలో ఎంత ఆదరణ వుందో, ఈ నాటికీ చిత్తూరు జిల్లాలో ఇంకా బ్రతి వున్న వీధి నాటక బృందాల్ని చూస్తే తెలుస్తుంది. హరిజనులు, యానాదులు, జంగాలు, బలిజలు, గొల్లలు, రెడ్లు మొదలైన అనేక కులాల వారు రోజుల తరబడి ఈ ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ వుంటారు. అంతే కాదు అన్య మతస్తులైన క్రిష్టియన్లూ, ముస్లిములూ మహాభారత నాటకాల్లో నటించటమే కాక అనేక వీధి భాగవత దళాలకు శిక్షణ ఇచ్చే గురువులుగా కూడా వున్నారంటే, ఇంతకంటే మాత సామరస్యానికి దాఖలా ఏం కావాలి. సాంస్కృతిక ప్రదర్శనాలు జాతీయ సమైకత్యను ఎలా పెంపొందిస్తున్నాయో తెలుసుకోవచ్చు.
ఇవి యక్షగాన వీథి నాటకాలు
మార్చుచిత్తూరు జిల్లాలో ప్రదర్శించే వీధి నాటకాల శిల్పం యక్షగాన రీతికి చెందింది. ఇందులో కుప్పం ప్రాంతంలోని 'కంగుంది సంస్థానం' లో వెల్లి విరిసిన 'కంగుంది బాణీ' అనేది చిత్తూరు యక్షగాన నాటకాల ప్రత్యేకత. అయితే చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో 'సంత వేలూరు బాణీ' కి ఎక్కువ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా వీరు రామ నాటకాలను ఎక్కువ ఆడతారు. అందులో కుశలవుల నాటకం ఎంతో ప్రాముఖ్యం వహించింది. చిత్తూరు జిల్లాలోని ఈ భారత నాటక ప్రదర్శనం కేవలం స్టేజికి మాత్రమే పరిమితం కాకుండా, రంగస్థల స్థాయినీ, నటుల స్థాయినీ దాటి ఊరందరూ పాల్గొనే సమష్టి రంగ స్థలంగా మారి పోతుంది. ఉదాహరణకు బకాసుర వధ ఘట్టంలో భీముడి పాత్ర ధారి, రంగాన్ని వదిలేసి, నిజంగా ఓ బండి మీద ఊళ్ళోకి బయలు దేరి గడప గడపకూ బోణాల్ని స్వీకరించి, రాక్షస వధానంతరం సమిష్టి బంతి జరపడం విశేషం.
తపస్మాన్
మార్చుఈ సందర్భంలో అర్జునుడు దివాస్త్రాల కోసం చేసే తపస్సుకు ప్రతీకగా నిలబెట్టిన ఒక స్తంభాన్ని ఎక్కు తాడు. ఆర్జన పాత్ర ధారి మెట్టు మెట్టుకూ ఎక్కుతూ నాటకీయంగా పద్యం పాడుతూ అధిగమిస్తాడు. తపస్సుకు వీలుగా మాను పైనవెడల్పుగా ఒక మంచెను ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన మానును తపస్మాన్ గా పిలుస్తారు.
ఆర్జునుడు తపస్మాన్ ఎక్కే రోజు అనగానే చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో తెల్లవారు జానునే వచ్చి చేరుకుంటారు. అర్జునుడు తపస్మాన్ ఎక్కిన తరువాత, ఓ విల్లు ఆకారం కలిగిన వెడల్పాటి చత్రంలో కూర్చుని, నిమ్మ కాయలు, విభూతి, పళ్ళు, పొఊలూ నేల మీదికి వెదజల్లుతాడు. అర్జునుని తపస్మాన్నీ, ఎక్కడాన్నీ స్వార్గారోహణంగా అప్రజలు భావించి, పైనుంచి క్రింద పడే పళ్ళూ, పూలూ, ఎంతో పవిత్రమైనవిగా ఎంచి వాటిని అందుకోవడానికి జనం త్రొక్కిస లాడుతారు.
పిల్లలు లేని తల్లులు
మార్చుఅంతే కాదు పిల్లలు లేని తల్లులు ఈ వుత్సవానికి హాజరవుతారు. తపస్మాన్ పై నుంచి పడే పళ్ళూ పూల కోసం తలారా స్నానం చేసి తడి బట్టలతో తపస్మాన్ క్రింది వేచి వుంటారు. అర్జునుడు మెట్టు మెట్టుకూ పాట పాడుకుంటూ, తీరిగా తపస్మాన్ ఎక్కేటంత సేపూ ఈ స్త్రీలు పడుకుని సాస్టాంగ దండ ప్రమాణం చేస్తూ తల ఎత్తకుండా అలాగే పడి వుంటారు. అర్జునుడు ప్రసాదాల్ని నేల మీదికి పదవేసే సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి కొంగుల్ని సరిచేసుకొని, మోరలెత్తి ఎదురుచూస్తారు. ఆ పళ్ళూ, పూలు పడిన ముఖాలు ఎంతో వికసిస్తాయి. పడని ముఖాలు నిరుస్థాహ పడిపోతాయ. అంటే దీనిని బట్టి వీధి నాటక తపస్మాన్ ఎంత బలవత్తరమైనదో తెలుసు కోవచ్చును.
ఈ విధంగా మహాభారతం వీధి నాటక స్థాయి నుంచి జీవితం లోకి ఎలా ప్రవేశించిందో అర్థం చేసుకోవచ్చును.
చిత్తూరులో మహాభారత నాటకోత్సవాలు
మార్చుతెలుగు నాట జానపద కళారూలు చాలవరకు కాల గర్భంలో కలిసి పోతుండగా లేదా అవి ఆయా వ్వక్తుల జీవన భృతికి బిక్షాటన కళగా మారుతున్న ఈ తరుణంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే జరిగే మహాభారత నాటకోత్సవాలు దినాదినాభి వృద్ధి చెందుతూ మారిన సాంకేతాభివృద్ధిని ఉపయోగించుకుంటూ ప్రవర్థనం చెందడం పెద్ద విశేషమే. అందుకే ఆ మహోత్సవాలు ప్రస్తుత కాలంలో ఎలా ;జరుగుతున్నాయో చిత్రాలతో సహా తెలుసుకోవచ్చు.
మహా భారత నాటకాలు
మార్చుకేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ మహా భారత నాటకోట్సవాలు ఎప్పుడు ఎలా ప్రారంబమయ్యాయే తెలియదు గానీ శాతాబ్దాల క్రితమే ప్రారంబమై వుండొచ్చు. అరవై సంవత్సరాల క్రితమే అత్యంత వైభవం జరిగేవి. కనుక వీటికి శతాబ్దాల చరిత్రే వుండొచ్చు. ఇవి. సుమారు ఇరవై రోజులు జరుగు తాయి.. ( భారతంలోని 18 పర్వాలకు ప్రతిగా 18 ఘట్టాలను 18 రోజులు జరుగు తారు. రెండు రోజులు అదనంగా భారతానికి సంబందం లేని బాలనాగమ్మ వంటి వేరే నాటకాలు జరుగు తాయి. ఈ మహాభారత నాటకోత్సవాలు బహు జనాధరణ పొందిందాయి, ద్రౌపతీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనే ప్రతి సంవత్సరం, లేదా ... రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడ జరిగే తిరునాళ్లు ప్రజలకు పెద్ద వినోధం. గతంలో ఈ భారత నాటక మహోత్సవాలు జరిగే మైదానంలో అనేక అంగళ్ళూ, రంగుల రాట్నం, చిన్న పిల్లలలి చిన్న ఆటలు, పెద్దలకు చింత పిక్కలాటలు, తోలు బొమ్మలాటలు, ఇలా అనేక విశేషాలతో ఈ జాతర జరుగు తుంది. ఇరవై రోజుల పాటు మహా వైభవంగా జరిగే ఇలాంటి ఉత్సావం మరెక్కడా జరగదు. పైగా ఈ వుత్సాహం పగలూ...... రాత్రి కూడా వుంటుంది. పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి.... అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు.
నాటకం జరిగే తీరు
మార్చుఈ నాటకాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎలాగంటే రంగస్థలంపై ధుర్యోధనుడు రంగ ప్రవేశం చేసే టప్పుడు ...... తెర వెనకనుండి ముందుకు తన సోధరులతో రంగస్థలం మీదికొచ్చి ఆయుధాలతో రంగస్థలం మీద వృత్తాకారంలో తిరుగుతూ .... రాజు వెడలె రవి తేజములలరగ....... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అంటూ ధుర్యోధన మహారాజు సభకు వచ్చే నని పాట పాడగా వెనక వున్న అతని సోదరులు.... వంత పాడతారు. అదేవిధంగా తెర వెనక నున్న ఇతర నటులు కూడా వెనకనుండి వంత పాడుతారు. అనగా వచ్చిన ఆ వేషధారి తాను ఎవరు? అన్న దానికి సమాదానమిస్తాడు. అలా ప్రేక్షకులు ఆ వచ్చినది ధుర్యోధనుడు అని గుర్తిస్తారు. ఆ విధంగా ప్రతి వేషధారి తాను ఎవరు అనే దానికి సమాదానంగా తానే పాట.... ఆట ద్వారా తెలియజేస్తాడు. అలా పరిచయం అయ్యాక పాట రూపంలోనే ఇలా పాటలు.... మాటలు...... అంటాడు. సుఖమా మన రాజ్యమెల్ల సుఖమా..... అనగా... వెనక నుండి కోరస్ గా సుఖమే మన రాజ్యమెల్ల సుఖమే.... అని పాట అందుకుంటారు. ఆ తర్వాత ధుర్యోదనుడు... "ధుర్యోధన...ధుర్యోధన,............ ధుర్యోధన... అంటూ... కలియ దిరుగు తుంటే వెంటనున్న అతని తమ్ములు.... తెర వెనకునున్న వారు.... రాజే... రాజే.... రాజే.......... అంటు కోరస్ గా అంటారు... తర్వాత..... ధుర్వోధనుడు మహా మంత్రీ? మన రాజ్యంలో వర్షాలు నెలకు మూడు సార్లు పడుతున్నాయా ?.... పంటలు బాగా పండుతున్నాయా? ధర్మము, న్యాయము చక్కగా అమలు జరుగు తున్నాయా? అని అడుగగా... మత్రి: అవును మాహారాజా.... మన రాజ్యంలో నెలకు మూడు వర్షాలు పడుతున్నాయి., బంగారు పంటలు పండు తున్నాయి.... ప్రజలు సుఖంగ వున్నారూ అని సందర్భాను సారంగా.... కొంత సంభాషణ జరుగుతుంది. ఇదయిన తర్వాత అసలు నాటకంలోని అంశం ప్రారంబమౌతుంది. ఆ విధంగా పల్లెప్రజలు.... ధుర్యోధనుడు దుష్టు కాదని.... చాల చక్కగా ధర్మ పాలన చేశాడని.... అర్థం చేసుకుంటారు. ఇలా ప్రతి పాత్ర తన పరిచయాన్ని చెప్పిన తర్వాతనే అసలు కథలోకి వెళ్ళతాడు. ఆ విధంగా నాటకం సాగుతుంది.
పగటి పూట జరిగే హరికథా కాలక్షేపానికి సుధూర ప్రాంతాల నుండి కూడా ఎద్దుల బళ్ళ మీద తరలి వస్తారు జనం. ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు అతి ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ, బక్కాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం, చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడా జరిగే ఘట్టాలు మూడు. అవి.... 1. బక్కాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. ధుర్వోధనుని వధ.
బక్కాసుర వధ.
మార్చుభీముని వేష దారి గదను ధరించి అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలో వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి భారతం మిట్టకు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ హావ భావాలను ప్రదర్శిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి భారతం జరిగే మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పదార్థాలను (ప్రసాదాలను) అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్శిత మౌతుంది.
ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట
మార్చుఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: దీని కొరకు ఒక పొడవైన వృక్షం అవసరం. దీనికొరకు అశోక వృక్షాన్ని ఎంచు కుంటారు. అది దొరకని పక్షంలో మరేదైనా పొడవుగా వున్న వృక్షాన్ని ఎంచు కుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి, పైన సుమారు రెండడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవున్న చెక్కను అమర్చి దాని పై అర్థ చంద్రాకారంలో ఎర్రటి వస్త్రాన్ని కప్పుతారు. పూలతో ఆ వేదికను బాగా అలంక రించి దానిని మైదాన మధ్యలో పాతుతారు. అక్కడ పంచ పాండవుల విగ్రహాలను వుంచి, అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాంగ ప్రమాణ ముద్రలో 'వరానికి' వడి వుంటారు. వారు చేతును ముందుకు సాచి దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడా వుంటారు. వారు కూడా అర్జునుడు విసిరే ప్రసాదం కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడా ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్యక్రమం ఆ రోజు మధ్యాహ్నం తర్వాత సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది. ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుతూ తన వెంట జోలెలను తీసుకెళ్ళడం చిత్రంలో చూడ వచ్చు.
ధుర్యోధనుని వధ
మార్చుపగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ధుర్యోధన వధ:. దీని కొరకు మైదాన మధ్యలో.... ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు వాదులాడు కుంటారు, యుద్ధం చేస్తారు. ఈ వాదులాటలో అప్పుడప్పుడు కొన్ని అసభ్యమైన మాటలు కూడా దొర్లుతుంటాయి. సామాన్యంగా పల్లె ప్రజలు తమ వూర్లలో వాదులాడుకునే టప్పుడు వాడే మాటలే అవి. ఆ వాదులాటకు ప్రజలనుండి మంచి స్పంధన వుంటుంది. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో (కుంకుమతో) తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తే తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగే ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే తమ పంటలు సంవృద్దిగా పండ తాయని ప్రజల నమ్మకం.
పంచ పాండవుల గుడులు
మార్చుపంచ పాండవుల గుడులు అనగా అవేవో పెద్ద ఆలయాలు కాదు. ఒక గదిలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహంతో పాటు పంచ పాండవుల, ద్రౌపతి విగ్రాలు వాటితోబాటు పోతు రాజు విగ్రహాలను ఒక గదిలో దాచి పెడ్తారు. కేవలం భారత ఉత్సవాల సందర్భంలో మాత్రమే వాటిని బయటకు తీస్తారు. ఈ మద్యలో అక్కడ పూజలు కూడా ఏమీ జరగవు. మరే పల్లెలో నైనా మహా భారత ఉత్సవాలు జరపాలని నిర్ణయమైతే వారి వద్ద ఈ విగ్రహాలు లేక పోతే .... విగ్రహాలున్న వూరి నుండి విగ్రహాలను తెచ్చుకుని ఉత్సవాలనంతరం వాటిని తిరిగి ఇచ్చేస్తుంటారు. ఈ విగ్రహాలలో అత్యంత ప్రముఖమైనది ద్రౌపది విగ్రహము. కొన్ని పల్లెల్లో ద్రౌపది విగ్రహం తప్ప మిగతా అన్ని విగ్రహాలుంటాయి. ద్రౌపది విగ్రహం వుంటే అక్కడ అతి కఠినమైన నియమాలను పాటించాలనీ, లేకుంటే అరిష్టమనీ ప్రజల నమ్మకం. కనుక ద్రౌపది విగ్రహం లేని పాండవుల గుడులు కూడా కొన్ని పల్లెల్లో వుంటాయి. ఈ ఉత్సవాలను ఇరవై రోజుల పాటు నిర్వహించడము చాల ఖర్చుతో కూడు కున్న పని. కొన్ని చిన్న పల్లెలలో పాండవుల విగ్రహాలు కూడా వుండవు. అటువంటి వారు విగ్రహాలను అరువు తెచ్చుకుని కనీసము మూడు రోజుల పాటైనా మూడు నాటకాలను నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించిన వాల్ పోస్టరును చిత్ర మాలికలో చూడవచ్చు. మహాభారత ఉత్సవాలకు సంబంధించిన మరికొన్ని చిత్రాలను కూడా చూడవచ్చు. ఈ భారత మహోత్సవాలను నిర్వహించే వారు ఒక కమిటీగా ఏర్పడి దానిని రిజిస్టర్ కూడా చేయించు కుంటారంటే ఈ నాటకాలపై వారికెంత అభిమానమో గ్రహించ వచ్చు.
మహాభారత నాటక ఉత్సవాలు ప్రారంభం
మార్చుఈ ఉత్సవాల ప్రారంబం అతి నిష్టగా, శాస్త్ర, సాంప్రదాయ బద్దంగా జరుగుతుంది. ఈ ప్రారంబాన్ని కొడెక్కుట అని అంటారు. దాన్నే ద్వజారోహణ అని కూడా అంటారు. ఒక పొడవాటి వెదురు కర్రకు పూలు, మామిడి ఆకులతో అలంకరించి... దాని చివరన ఒక పసుపు గుడ్డను కట్టి అందులో కొన్ని పూజా ద్రవ్యాలను, పూలు, కొబ్బరి కాయ వంటి వాటిని కట్టి ఆవెదురును అక్కడ నిలబెట్టి పాతుతారు. ఆ మైదాన ప్రాంతంలో ముందుగా బలిరాముడు అనే విగ్రహాన్ని నిలబడి వున్న తీరులో నిర్మిస్తారు. ఈ బలిరాముడు మహా భారతంలో జరగబోయే, యుద్ధంతో సహా అన్ని కార్యక్రమాలకు సాక్షీభూతంగా వుంటాడని నమ్మకం. ఈ విగ్రహం ఉత్సవాలు ముగిసినంత వరకు వుంటుంది. హరికథ చెప్పడానికి కొబ్బరాకులతో విశాలమైన పందిరిని వేస్తారు. నాటకాలు ఆడడానికి రంగ స్థలం సామాన్యంగా .... అందు కొరకే శాశ్వత ప్రతి పాదికన నిర్మించిన వేదిక వుంటుంది. అది సెమెంటు ఆశనాలు, రాతి స్తంభాలు కలిగి వుంటుంది. దానిపైన పందిరి వేసి, అలంకరణ చేయడమే తరువాయి. ఈ వుత్సవాలు పరిసమాప్తం అయిన తరువాత ఒక క్రతును చేసి వుత్సవం ఏ ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుటే ఈ క్రతువు ముఖ్యోద్దేశం. ఆ విదంగా ఈ ఉత్సవాలు పరి సమాప్తం అవుతాయి.
చిత్రమాలిక
మార్చు-
అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 2012 వ సంవత్సరంలో మొగరాల గ్రామంలో తీసిన చిత్రము
-
దామలచెరువు గ్రామంలో మహాభారతోత్సవాలలో హరికథ చెప్పుతున్న హరికథా కళాకారిణి. 2012 సంవత్సరంలో తీసిన చిత్రము
-
పోతు రాజు విగ్రహం. భారత నాటకం గానీ హరికథ గాని జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ పోతురాజు విగ్రహాన్ని అక్కడ వుంచుతారు.
-
మహాభారత మైదానంలో ధుర్యోధన—భీమ యుద్ధానికి సిద్దంగా వున్న ధుర్యోధనుని విగ్రహం. దామలచెరువు గ్రామంలో తీసిన చిత్రము
-
భారత నాటకాలకు సిద్దంగా వున్న రంగస్థలము: మొగరాలలో తీసిన చిత్రము
-
భారత నాటకోత్సవాల సందర్భంగా మొగరాల గ్రామంలో హరి కత చెపుతున్న కళాకారిణి.
-
మొగరాల గ్రామంలో మహాభారత హరికథ దృశ్యం
-
అర్జునుడు తపస్సు మాను ఎక్కు సందర్భంలో అక్కడ కొలువు తీర్చిన పంచ పాండవుల విగ్రహాలు, పోతు రాజు విగ్రహం: మొగరాల గ్రామంలో తీసిన చిత్రము
-
మహాభారతోత్సవాలకు ఆహ్వానిస్తూ దామలచెరువు గ్రామంలో వేసిన ఒక ప్రకటన బోర్డు.
-
దుర్యోధన వధ నాటకంలో భాగంగా దుర్యోధనుని విగ్రహం చుట్టూ తిరిగుతున్న దుర్యోధనుని పాత్ర ధారి/ దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము
-
దుర్యోధన వధ నాటకంలో భాగంగా దుర్యోధనుని విగ్రహం చుట్టూ చేరిని ప్రేక్షకులు. దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము
సూచికలు
మార్చుతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.