మాయలోకం
మాయలోకం గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి మొదలైన భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం. చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు బి.పద్మనాభం నటించారు.
మాయలోకం (1945 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
తారాగణం | కన్నాంబ, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, గోవిందరాజులు సుబ్బారావు, ఎస్.వరలక్ష్మి, పద్మనాభం, అక్కినేని నాగేశ్వరరావు - చిన్న పాత్రలో, పి.శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మ, టి.జి.కమలాదేవి |
సంగీతం | గాలి పెంచల నరసింహారావు |
నేపథ్య గానం | పి.శాంతకుమారి, ఎస్.వరలక్ష్మి |
సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్ |
కూర్పు | మాణిక్యం |
నిర్మాణ సంస్థ | సారధీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
వరుస పరాజయాలతో ఆర్థికంగా దెబ్బతిన్న సారధి పిక్చర్స్‌ను గట్టెక్కించడానికి తనకు స్వతాహాగా సరిపడకున్నా ప్రేక్షకులు మెచ్చే జానపద ఫక్కీలో ఈ సినిమాని తీశాడు గూడవల్లి రామబ్రహ్మం. భారీ పెట్టుబడితో మంచి నిర్మాణ విలువలతో నిర్మించినా మాయలు, మంత్రాలు, దేవతలు, రాక్షసులతో కూడిన సినిమా తీసినందుకు రామబ్రహ్మం అపరాధ భావనతో సిగ్గుపడ్డాడు. అయితే సినిమా మాత్రం ఆశించిన విధంగా ప్రజాదరణ సాధించి, ఆర్థికంగా ఘనవిజయం చెందింది. అనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు.
సంక్షిప్త కథ
మార్చుశాంభవీ పురానికి రాజు కాంభోజరాజు. ఆ రాజుకు ఏడుగురు భార్యలు. దానవాది రాజకుమార్తెలు ఆరుగురు. నేత్రవాది రాజ కుమార్తె మాణిక్యాల దేవి ఏడవ భార్య. ఆమె శివభక్తురాలు. కైలాసంలోకి శని ప్రవేశించి మహారాజులను పట్టి వాళ్ళ సౌఖ్యాలను అనుభవించే వరం ఇవ్వాలని శివుడిని ప్రార్థిస్తాడు. తన భక్తుడైన, సంతానహీనుడైన కాంభోజ మహారాజును పట్టి పీడించమని చెబుతాడు. తర్వాత శివుడి మీద రాజుకు కోపం వచ్చి శివుడి విగ్రహాలు కోటలో ఉండకూడదని ఆజ్ఞాపిస్తాడు. కర్మశర్మ రూపంలో శని రాజ్యంలోకి ప్రవేశించి మహారాజుని ముప్పుతిప్పలు పెడతాడు. కర్మశర్మ వరప్రసాదంతో రాజుగారి ఆరుగురు భార్యలు అవివేకులు, అప్రయోజకులు అయిన కొడుకుల్ని కంటారు. ఏడవ భార్య మాణికాంబదేవికి పుట్టే సంతానం రాజు అవుతాడని రాజగురువు జోష్యం చెప్పడం వల్ల అసూయతో మిగిలిన భార్యలు గర్భవతిగా వున్న ఆమెను చంపే ప్రయత్నంలో అడవికి పంపిస్తారు. అడవిలో కాంభోజరాజు చిన భార్య మగ శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువే ఎదిగి సాహసోపేతుడైన శరాబందిరాజు (అక్కినేని). రాజు పశ్చాత్తాపంతో విచారగ్రస్తుడై మంచంపడతాడు. ఆయన జబ్బును నయం చేయడానికి మందులు తీసుకొని వచ్చేందుకు ఆరుగురు కుమారులు బయలుదేరతారు. సాహసకృత్యాలే ఊపిరిగా అడవిలో పెరిగిన శరాబందిరాజు తల్లితండ్రులను తిరిగి ప్రయత్నంలో రాజధానికి వచ్చి సవతి సోదరుల వల్ల అనేక అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తనూ మందును వెతకటానికి బయలుదేరి కీలుగుఱ్ఱంలాంటి గుఱ్ఱాన్ని ఎక్కి ఏడు సముద్రాలు దాటి, శరాబందిరాజు, రత్నగంధి (శాంతకుమారి), యోజనగంధి (ఎమ్.వి.రాజమ్మ) ల సహాయంతో తండ్రి జబ్బును నయం చేసే మందును సంపాదిస్తాడు. అంతే కాకుండా తన సోదరులను రంగసాని (యస్.వరలక్ష్మి) చెర నుండి విడిపిస్తాడు. మందు తెచ్చి తండ్రిని ఆరోగ్యవంతున్ని చేస్తాడు. సవతి తల్లులు, వారి పరివారం శరాబంది రాజుని గుర్తించి చంప ప్రయత్నిస్తారు. శరాబందిరాజు వారిని జయిస్తాడు.
తారాగణం
మార్చుఈ సినిమాలో పాత్రధారులు, పాత్రలు:[1]
- అక్కినేని నాగేశ్వరరావు - శరాబందిరాజు
- శాంతకుమారి - రత్నగంధి
- ఎమ్.వి.రాజమ్మ - యోజనగంధి
- ఎస్.వరలక్ష్మి
- గోవిందరాజు సుబ్బారావు - కాంభోజ రాజు
- పసుపులేటి కన్నాంబ - మాణిక్యాంబ
- ఎం. సి. రాఘవన్ - రాజగురువు
- రేడియో భానుమతి - కాంభోజ రాజు పెద్ద భార్య
- సి.యస్.ఆర్. ఆంజనేయులు - నవభోజ రాజు
- వేదాంతం రాఘవయ్య - పరమ శివుడు
- ఎస్.వరలక్ష్మి - రంగసాని
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: గాలి పెంచల నరసింహారావు
మాటలు: త్రిపురనేని గోపీచంద్
నిర్మాణ సంస్థ: సారధి స్టూడియోస్
కూర్పు:మాణిక్యం
సాహిత్యం: దైతా గోపాలం
గాయనీ గాయకులు: పి.శాంతకుమారి, ఎస్.వరలక్ష్మి ,బెజవాడ రాజారత్నం, కన్నాంబ, టి.జి.కమలాదేవి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, అక్కినేని, ఎం.వి.రాజమ్మ
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుతన సినిమాలు ఆర్థికంగా దెబ్బతిని, ఇబ్బందులకు గురిచేస్తూండడంతో సాంఘిక చిత్రాలే తప్ప జానపద, పౌరాణిక చిత్రాలు తీసి ఎరుగని గూడవల్లి రామబ్రహ్మం తొలిసారిగా ఈ జానపద చిత్రానికి దర్శకత్వం వహించాడు. జనం నోట్లో నానిన "కాంభోజరాజు కథ" అన్న జానపద కథను తీసుకుని, త్రిపురనేని గోపీచంద్‌తో మెరుగులు దిద్దించి, దైతా గోపాలంతో సంభాషణలు, పాటలు రాయించుకుని ఈ స్క్రిప్టు తయారుచేయించాడు. తర్వాతికాలంలో కాంభోజ రాజు కథ పేరుతో శోభన్ బాబు హీరోగా మళ్ళీ ఈ కథను సినిమాగా తీశారు. రామబ్రహ్మం ప్రజామిత్ర పత్రిక సంపాదకునిగా ఉన్న రోజుల్లో చదివిన జానపద కథల పుస్తకం పేరు "మాయలోకం", అప్పట్లో ఇది సినిమాకు పేరుగా బావుంటుందన్న తన మాట గుర్తుపెట్టుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టాడు.[1] దేవతలు, రాక్షసులు, మాయలు, మంత్రాలు వంటివి ఉండే జానపద, పౌరాణిక కథాంశాలతో సినిమా తీయడం రామబ్రహ్మం తత్త్వానికి సరిపడే విషయం కాకపోయినా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎలాగో సరిపెట్టుకుని ఈ సినిమా తీశాడు.[2]
నటీనటుల ఎంపిక
మార్చుసినిమాలో ఇద్దరు కథానాయికల పాత్రలకు శాంతకుమారి, రాజమ్మలను మొదటే దర్శకుడు నిర్ణయించేశాడు.[1] బలరామయ్య సినిమాలో అప్పటికే హీరోగా పనిచేస్తున్న నాగేశ్వరరావును పరిశీలించేందుకు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం బలరామయ్య ఆఫీసుకు వెళ్ళాడు. నాగేశ్వరరావు తనకు కనీసం నమస్కారమన్నా చేయలేదనీ, తన హీరోయిన్లు శాంతకుమారి, రాజమ్మల నడుమ అర్భకుడిలా ఉంటాడని హీరో పాత్ర ఇవ్వడానికి రామబ్రహ్మం నిరాకరించాడు. ఈలోగా వేరే నటులను కూడా ఆ పాత్ర కోసం పరిశీలించసాగాడు. చల్లపల్లి రాజా, మధుసూదనరావులు నాగేశ్వరరావు తరఫున రామబ్రహ్మంతో మాట్లాడి ఒప్పించడంతో, మేకప్ టెస్టు చేసి నాగేశ్వరరావును హీరోగా తీసుకున్నాడు.[3] మిగిలిన ముఖ్యపాత్రలకు గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, హాస్యపాత్రలకు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, లంక సత్యం ఎంపికయ్యారు. కమలా కోట్నీస్ రంగసాని పాత్ర చేయడానికి అంగీకరించినా, అంతకుముందే చెంచులక్ష్మిలో గిరిజనురాలి పాత్ర చేసివుండడంతో ఇదీ చేస్తే ఆ తరహా పాత్రలే వస్తాయని సినిమా నుంచి తప్పుకుంది.[1] ఆ పాత్రకు ఎస్.వరలక్ష్మిని తీసుకున్నాడు రామబ్రహ్మం. ముందు సినిమా చేయడానికి వరలక్ష్మి భయపడ్డా రామబ్రహ్మం ఆమెను, ఆమె పెద్దవాళ్ళను ఒప్పించి చేయించుకున్నాడు.[4] తర్వాతి కాలంలో హాస్యనటుడిగా పేరుతెచ్చుకున్న పద్మనాభం ఈ సినిమాలో కన్నాంబ సిఫార్సుతో కాంభోజరాజు పెద్ద కొడుకు పాత్రలో నటించాడు. ఇదే పద్మనాభం నటించిన తొలి సినిమా.[5]
చిత్రీకరణ
మార్చుసినిమాని మద్రాసులో న్యూటోన్ స్టూడియోస్‌లో చిత్రీకరించారు. రామబ్రహ్మం మద్రాసులో పోయెస్ రోడ్డు సమీపంలోని డన్‌మోర్ హౌస్ వద్ద భారీ గిరిజన గ్రామం సెట్ వేయించి ఆనందమే మనకానందమే పాటను భారీ ఎత్తున చిత్రీకరించాడు. రాజీపడకుండా భారీగా సినిమాను చిత్రీకరించడంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది.[1]
విడుదల, స్పందన
మార్చుసమకాలీన సాంఘికాంశాల మీద అభ్యుదయకరమైన సినిమాలు తీసి పేరుతెచ్చుకున్న గూడవల్లి రామబ్రహ్మం తన సినిమాల వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, సినిమా రంగంలో నిలబడడానికి మాత్రమే ఈ సినిమా తీశానని చెప్పుకున్నాడు. తన స్థాయికి తగిన సబ్జెక్టు కాదని భావించిన రామబ్రహ్మం తాను ఎప్పుడూ చేసినట్టు కాక ప్రీమియర్ షోను వేరే థియేటర్‌లో వేశాడు.[1] రచయిత, సినీ విమర్శకుడు కొడవటిగంటి కుటుంబరావు ఈ సినిమా చూపించమంటే విజయం పొందిన సినిమా దర్శకుడిగా గర్వించకపోగా, "అది మీరు చూడవలసిన పిక్చర్ కాదులే, బ్రదర్" అని అవమానభారంతో సిగ్గుపడ్డాడు.[6] మెట్టు దిగివచ్చి ఈ సినిమాని తీసిన రామబ్రహ్మానికి ఆశించిన ఆర్థిక ఫలితం మాత్రం దక్కింది. సినిమా ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్‌లో చిత్రీకరించినా, పెట్టిన పెట్టుబడికి మించి కలెక్షన్లు సాధించి రామబ్రహ్మానికి ఉపశమనం ఇచ్చింది.[1][2] "నెలల తరబడి అరవ చిత్రాలు ఆక్రమించుకున్న తెలుగుథియేటరులోకి తెలుగు చిత్రం రావడమే అపురూపం" అన్న స్థితిలో ఈ సినిమా విడుదల కావడం దాని ఆర్థిక విజయానికి మరింత సహకారిగా నిలచింది. విమర్శకులు మాత్రం దీన్ని "కేవలం కాలక్షేప దృక్ఫథంతో మాత్రమే చూస్తే చాలా బాగుందని చెప్పవచ్చు" అని రాశారు.[7]
పాటలు
మార్చుమాయలోకం సినిమాకి గాలిపెంచల నరసింహారావు సంగీత దర్శకత్వం వహించాడు. అక్షయలింగవిభో, ఎవరోయీ నీవెవవరోయీ, మోహనాంగ రార వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.[1] "మందులున్నాయి బాబూ, చాలా మందులున్నాయి. మంచు కొండల నుంచి తీసిన మందులున్నాయి..." అనే పాట. రామ చాలింక నీదు బీరముల్ అనే పద్యం కూడా అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఆలపించాడు.[8]
- చెలియా మనకేలనే వారి జోలి , గానం:బెజవాడ రాజరత్నం, ఎస్. వరలక్ష్మి
- మోహనాంగ రార నవ మోహనాంగ రారా - గానం. శాంతకుమారి , గానం. ధైతా గోపాలం
- అకటా నా జీవనదీ యిది యేమి అడవుల గుట్టలబడి పారున్ , గానం. పి.కన్నాంబ
- అక్షయలింగవిభో స్వయంభో రక్షించుము నీ వారము శంభో - గానం. కన్నాంబ
- అరెరే దట్టీగట్టీ మందుకోసమై రాకుమారులంతా
- అతి విచిత్రమౌ నీ మహిమను తెలియగ మనుజుల తరమా, గానం. పి. కన్నాంబ
- బలే బలే నవభోజారాజా ప్రభువులౌతారా , గానం. టి. జి. కమలాదేవి, సి. ఎస్. ఆర్ ఆంజనేయులు
- ఏ విధి సేయదువో ఈశా నా కే విధి సేయదువో, గానం: పి. కన్నాంబ
- ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి - గానం. శాంతకుమారి
- కోటలోన కాంభోజరాజు క్రుంగి కుమిలిపోయీ
- మనదే ప్రపంచమంతా ఆ హా మానినియేగా జగన్నియంతా , గానం. ఎస్. వరలక్ష్మి
- రామ చాలింక నీదు బీరములు చాలు ధర్మమూర్తి వటంచు - గానం. అక్కినేని నాగేశ్వరరావు
- శరత్కౌముదీ ముదిత యామినీ హృదయములో నవోదయములో , గానం. ఎం. వి. రాజమ్మ బృందం
- శ్రీజానకీదేవి సీమంతమునకు శ్రీ శారదా గిరీజా చేరి దీవించిరి, గానం. బృందం
- తారీనాననీ ననీ తరీనననీనా అహ తారీనాననీ తరీననీనా
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 ఎం. ఎల్., నరసింహం (1 April 2012). "MAYALOKAM (1945)". ద హిందూ (in Indian English). Retrieved 17 January 2019.
- ↑ 2.0 2.1 జగన్మోహన్ 2011, pp. 133.
- ↑ కుటుంబరావు, కొడవటిగంటి (నవంబరు 1952). "అక్కినేని నాగేశ్వరరావు (స్కెచ్)". కినిమా. మద్రాసు: చందమామ పబ్లికేషన్స్. Archived from the original on 15 జనవరి 2019. Retrieved 17 January 2019.
- ↑ జగన్మోహన్ 2011, pp. 127, 128.
- ↑ జగన్మోహన్ 2011, pp. 128.
- ↑ జగన్మోహన్ 2011, pp. 134.
- ↑ జగన్మోహన్ 2011, pp. 185.
- ↑ “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010[permanent dead link]
4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఆధార గ్రంథాలు
మార్చు- జగన్మోహన్, టి. ఎస్. (2011). అభ్యుదయ చలనచిత్ర రథసారధి గూడవల్లి రామబ్రహ్మం. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్. Archived from the original on 17 జనవరి 2019. Retrieved 17 January 2019.