గోవిందరాజు సుబ్బారావు

సినీ నటుడు
(గోవిందరాజులు సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)

గోవిందరాజు సుబ్బారావు (1895 - 1959 అక్టోబరు 28) తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు.

గోవిందరాజు సుబ్బారావు
జననం1895
మరణంఅక్టోబరు 28, 1959
వృత్తివైద్యుడు, నటుడు

జీవితం మార్చు

గోవిందరాజు సుబ్బారావు 1895 సంవత్సరంలో జన్మించాడు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు.[1] ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవాడు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించాడు. అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే సుప్రసిద్ధుడయ్యాడు.

పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టాడు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో ఇతని నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.

అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న తెలుగు సినిమా రంగంలోనూ క్యారెక్టర్ నటునిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించాడు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, బాలనాగమ్మలో మాయల మరాఠీగా ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందాడు.

మరణం మార్చు

ఈయన చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 28, 1959 సంవత్సరంలో మరణించాడు.[1]

చిత్ర సమాహారం మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (11 November 1959). "గోవిందరాజులు సుబ్బారావు మృతి" (PDF). ఆంధ్రసచిత్రవారపత్రిక: 62. Retrieved 2 November 2017.[permanent dead link]

బయటి లింకులు మార్చు

ఐ.ఎమ్.బి.డి.లో గోవిందరాజులు సుబ్బారావు పేజీ.