మారియో మిరాండ

భారతీయ కార్టూనిస్ట్

మారియో మిరాండ (Mario de Miranda) (1926 మే 2 - 2011 డిసెంబరు 11) పూర్తి పేరు 'Mario JoaorlosMario Joãంarlos do Rosario de Brit denda do Rosario de Brit Miranda'. ఇతడు మారియో మిరాండగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు భారతదేశపు అత్యంత జనప్రియమైన వ్యంగ్య చిత్రకారుడు.

మారియో మిరాండ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు అప్పటి పోర్చుగీసు పాలనలో ఉన్న (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం) దమన్లో గోవన్ క్యాథలిక్ దంపతులకు 1926, మే 2న జన్మించాడు. ఇతడు బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ హైస్కూలులో ఉన్నత విద్యను అభ్యసించాడు. తరువాత బొంబాయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చరిత్రలో బి.ఎ.చదివాడు. తల్లిదండ్రుల నుండి ఐ.ఎ.ఎస్. పరీక్షలకు చదవాలని ఒత్తిడి వచ్చింది. కానీ ఇతనికి కార్టూన్‌ కళ పట్ల ఆసక్తి, అభిరుచి ఎక్కువ కావడంతో వారి కలలు ఫలించలేదు. ఆర్కిటెక్చర్ కూడా కొంతకాలం చదివాడు. ఇతని స్నేహితులు ఇతడి ప్రతిభను గుర్తించి పోస్ట్‌కార్డుపై గ్రీటింగ్ కార్డ్‌లను గీసి ఇమ్మని కోరారు. స్నేహితుల కోరిక నచ్చి అతడు గ్రీటింగ్ కార్డులను తయారు చేసి ఇవ్వడంతో కొంత ఆదాయం కూడా వచ్చింది. The Fundacao Calouste Gulbenkian Scholarship సహాయంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఇతడికి లభించింది. పోర్చుగల్ దేశానికి వెళ్లి అక్కడ చిత్రకళలో ఒక సంవత్సరం శిక్షణ పొందాడు. ఇంగ్లాండులో ఐదు సంవత్సరాలు నివసించి అక్కడి టెలివిజన్, పత్రికలకు బొమ్మలు గీశాడు. అడ్వర్టైజ్‌మెంట్ స్టూడియోను నడిపాడు. ఈ ఆరేళ్ల కాలంలో ఇతడు పొందిన శిక్షణ ఎనలేనిది.

విదేశాలనుండి తిరిగి వచ్చాక వివిధ పత్రికలలో పనిచేశాడు. పిమ్మట ఇతడు హబీబా హైదరీ అనే కళాకారిణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి రాహుల్, రిషాద్ అనే పిల్లలు కలిగారు.

తల్లి ప్రోత్సాహం

మార్చు

ఇతడికి చిత్రకళ పట్ల చిన్నతనం నుండే ఆసక్తి ఉండేది. తన ఇంటిలోని గోడలనే కేన్వాస్‌గా మలచుకుని చిత్రాలను గీసేవాడు. ఇతడిలో ప్రతిభను మొదటగా గుర్తించిన ఇతని తల్లి ఇతడిని అన్నివిధాలుగా ప్రోత్సహించింది. ఇతడికి ఒక తెల్లకాగితాల పుస్తకాన్ని కొని ఇచ్చింది. ఇతడికి ప్రతిరోజూ దినచర్యను వ్రాసే అలవాటును అలవరించింది. బాహ్యప్రపంచంలో అద్భుతమనిపించిన అంశాలను తన డైరీలో రేఖలలో నిక్షిప్తం చేసేవాడు. ఆ డైరీ ఇప్పటికీ లభ్యం.

వృత్తి

మార్చు

ఇతడు పూర్తిస్థాయి కార్టూనిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించే ముందు నాలుగు సంవత్సరాలు ఒక అడ్వర్టైజ్‌మెంట్ స్టూడియోలో పనిచేశాడు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో ఇతని మొదటి కార్టూనులు ప్రచురింపబడ్డాయి. తరువాత కరెంట్ పత్రికలో పనిచేసే అవకాశం లభించింది. ఒక ఏడాది తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఇతడికి తమ పత్రికలో అవకాశాన్ని ఇచ్చింది. తరువాత ఇతడు ఫెమినా, ఎకానిమిక్ టైమ్స్ తదితర పత్రికలలో కార్టూనులు వరుసగా వేశాడు. మిస్ నింబూపానీ, మిస్ ఫోనెస్కా వంటి శీర్షికలతో ఇతడు వేసిన కార్టూన్లు సుప్రసిద్ధమైనవి. విదేశీ యానం తరువాత తిరిగి స్వదేశానికి వచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్తో కలిసి పనిచేశాడు.

గుర్తింపు, ప్రోత్సాహాలు

మార్చు

యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసస్ పిలుపుతో ఇతడు అమెరికా పర్యటించి అక్కడి ప్రముఖ కార్టూనిస్ట్ ఛార్లెస్ షుల్జ్‌ను కలిసాడు. వాషింగ్టన్ పోస్ట్ ఎడిటోరియల్ కార్టూనిస్ట్ హెర్బ్‌లాక్ ను కూడా కలిసి వారితో తన అనుభవాలను పంచుకున్నాడు. ఇతడి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2012లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. అఖిల భారత కార్టూనిస్టుల సంఘం, బెంగళూరు వారు ఇతనికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. స్పెయిన్ రాజు ఇతనికి అత్యున్నత పౌర పురస్కారం 'క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇసాబెల్ ద క్యాథలిక్' ను అందించాడు. పోర్చుగీస్ దేశం 'నేషనల్ ఆర్డర్ ఆఫ్ నైట్‌హుడ్' పురస్కారంతో సత్కరించింది.

ఇతడు తన 85వ యేట వృద్ధాప్య కారణంగా గోవా లోని లౌటొలిం గ్రామంలోని తన స్వగృహంలో 2011, డిసెంబరు 11వ తేదీన మరణించాడు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు