మింటో-మార్లే సంస్కరణలు

మింటో-మార్లే సంస్కరణలు 1909

పూర్వోత్తర సందర్భం (Background)

మార్చు

1909 సంవత్సరములో చేసిన మింటో మార్లే సంస్కరణలు బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఒక ప్రముఖమైన అంశం. 1907-1908 మధ్యకాలంలో అనేక రాష్ట్రములలో ముఖ్యముగా వంగ రాష్ట్రములోనూ, పంజాబులోనూ దేశాభిమానము విప్లవమార్గం పట్టి విప్లవోద్యమ పరిస్థితులు చాల తీవ్రముగా విఝృంభించాయి. అప్పుడు ఉగ్రవాదములనణుచుటకు బ్రిటిష్ ప్రభుత్వమువారు చేపట్టిన అనేక ప్రతి క్రియలలో నేరముల ప్రోత్సాహ చట్టము ప్రయోగించి పత్రికలను మూతవేశారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను (ఉదాహరణ లాలా లజపతి రాయ్) 1818 రెగ్యులేషన్ క్రింద న్యాయవిచారణలేకనే జైలులో నిర్భందించి, ప్రవాసముల పంపిచారు. అటువంటి అత్యవసర రెగ్యులేషనలను అమలుచేసి బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రజల స్వేచ్ఛా స్వతం త్య్రములను నాశనముచేసి, ప్రజాభిప్రాయము నణగత్రొక్కటానికి తీవ్ర నిర్భందములకు గురిచేయుచుండిరి. ఆ పరిస్థితులు స్వరాజ్యకాంక్షించు మితవాదులకే కాక బ్రిటిష్ ప్రభుభక్తులను గూడా వ్యాకుల పరిచినవి. వారిని బుజ్జగించి చేరదీయుటకు గౌరవ బిరుదులు గౌరోద్యగములిచ్చి తృప్తిపరచదలచ టమే కాక శాసన పూర్వకమైన సంస్కరణలమవసరమని తలచి చట్టము తయారు చేశారు. ఆ 1909 ఇండియా రాజ్యాంగ చట్టములో కలిగియున్న కొన్ని సంస్కరణలు మింటో-మార్లే సంస్కరణలని ప్రసిద్ధి.

19వ శతాబ్దమునందు బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టిన ప్రజాపరిపాలనా విధానముల సింహవలోకనం

మార్చు

1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టము ( చూడు 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము ) తరువాత 1892లో మరో రాజ్యాంగ చట్టము, 1892వ సంవత్సరపు ఇండియా శాసనసభల (కౌన్సిళ్ల) చట్టము చేసి తద్వారా ప్రజాపరిపాలనా విధానములనబడునవి ప్రవేశపెట్టబడినవి. ఈ1892వ సంవత్సరపు చట్టము వలన కలిగిన పురోగమనమేమనగా కేంద్రశాసనసభలు, రాష్ట్ర శాసనసభలయందలి (Central and Provincial Legislative Councils) సభ్యులు పూర్తిగా 100% నియమించబడినవారుగాక కొంతమంది అభ్యర్థులగా నిలబడి ఎన్నికలో గెలుపొందినవారుగానుండిరి. నిరంకుశముగా పరిపాలింపబడుచున్న బ్రిటిష్ ఇండియాలో ఇది ప్రజాపరిపాలనావిధానమువైపు అంకురార్పణకు పురోగతియని చెప్పాలి. ఆ 1892 సంవత్సరపు శాసనసభల చట్టమునకు సవరణల పేరుతో 1909 సంవత్సరములో చేసిన మింటో-మార్లే సంస్కరణల ద్వారా జరిపి ముస్లిమ్ లీగు కోరికపై మహ్మదీయులకు ప్రత్యేక నియేజకమండలములు గుర్తింపబడినవి.[1]

1909 సంవత్సరపు రాజ్యాంగ చట్టము నందలి నిష్ప్రయోజక సంస్కరణలు వాటి ఫలస్వరూపము

మార్చు

భారతదేశములో అప్పటి రాజప్రతినిధి గానుండిన వైస్రాయి (గవర్నర్ జనరల్) మింటో ప్రభువు (Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదముపోందిన ఇండియా రాజ్యాంగ చట్టములో ఇమడ్చబడినవి. ఆ 1909 శాసనమే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే ( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY, EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశానికి (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే (పూర్తి పేరు జాన్ మోర్లే JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. పేరుకు సంస్సరణాలైనా వాటి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధిగా చేసిన రాజకీయతంత్రము హిందుా ముసల్మానులకి వైరం రగిలించటానికి అప్పటిలోఆంగ్లేయులకి మిత్రుడైన ముస్లిమ్ లీగ్ అను రాజకీయపార్టీలో సభ్యుడైన ఆగాఖానుగా ప్రసిధ్దిచెందిన సర్ సుల్తాన్ మహ్మద్ షా గారి ద్వారాకోరబడినది ముసల్మానులకి ప్రత్యేక ప్రాతినిధ్యత్వం. బ్రిటిష్ ప్రభుత్వమువారే మింటోమార్లే సంస్కరణములందు చేర్చారు. మహమ్మదీయులకే కాక ఇతర వర్గములవారికిగూడా అలాంటి ప్రత్యేక ప్రాతినిధ్యమునిచ్చుటకు రాజ్యాంగ సంస్కరణలు చేశారు. అంతేకాక ఓటువేసే హక్కుకు నియమించబడ్డ కనిష్ఠ అర్హతలు హిందువులకు చాల అధికపరిధిలో నిర్ణనియంచబడి మహ్మదీయులకు చాల తగ్గించబడ్డవి. ఉదాహరణకు హిందువులకు ముప్పై సంవత్సరముల విశ్వవిద్యాలయ పట్టభద్రత మహ్మదీయులకు ముూడు సంవత్సరముల పట్టభద్రత. హిందువులకైతే వార్షికాదాయము ముఫైవేల రూపాయలైతే మహ్మదీయులకు మూడువేలరూపాయలే.[1] అటువంటి ప్రత్యేక ప్రాతినిధ్య పధ్ధతికి మార్లేదొర అభ్యతరం చూపినట్లుగా మార్లేదొర రచించిన Recollections of Lord Morley కనబడుచున్నట్లు మూలాధార పుస్తకములో ఉల్లేఖించబడింది. మింటో-మార్లే సంస్కరణలనుకలిగిన చట్టము ద్వారా అబ్బిన రాజ్యాంగము కేవలము బ్రిటిష్ వారు చేసిన కళ్లనీళ్ల తుడుపులైనప్పటికీ ఆ సంస్కరణల ద్వారా కలుగజేయబడిన శాసన సభలు, అందు చేయబడిన అనేక తీర్మానములు, చర్చలు బ్రిటిష్ రాజ్యతంత్రముయొక్క ఆర్థిక విధానమును గూర్చి, పరిపాలనా పద్దతలను గూర్చి గోపాలకృష్ణ గోఖలే గారి విమర్శనలు పత్రికలలో ప్రచురించబడుటవలన ప్రజలలో గొప్ప సంచలనము కలుగజేసినవి. ప్రజల రాజకీయ పరిజ్ఞానము వృధ్దికాజొచ్చెను. ఆవిధముగా 1909 చట్టములోని సంస్కరణలు నిష్ప్రయోజమై బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోని ఉపశమనకార్యచరణే అయినప్పటికీ ఆ చట్టముద్వారా వచ్చిన రాజ్యాంగము భారతదేశములోని విద్యావంతులు, మేదావులైన ప్రజలకు రాజకీయ విజ్ఞానము కలిగించుటకుపయోగపడినది. ప్రజలను స్వపరిపాలనాభిలాషులుగా చేసి స్వరాజ్యకాంక్ష పెంపొందించింది.[2].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "the Longest August" Dilip Hiro (2015) Nation Books pp 5-7
  2. The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938 పేజీలు 370-374