మీర్ ఆలంగా ప్రసిద్ధి చెందిన మీర్ అబ్దుల్ ఖాసిం[1] హైదరాబాదు నగరంలోని ఉన్నత కుటుంబీకుడు, 1804 నుండి 1808లో మరణించేవరకు హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను)గా పనిచేశాడు.[2] మీర్ ఆలం, మూడవ అసఫ్‌ఝా, సికిందర్ జా పాలనలో ప్రధానమంత్రిగా ఉన్నాడు.[3] ఈయన సాలార్‌జంగ్ కుటుంబం యొక్క పూర్వీకుడు. మొదటి సాలార్‌జంగ్కు ఈయన ముత్తాత.[1]

మీర్ అబ్దుల్ ఖాసిం మీర్ ఆలం బహదూర్
రాజా చందూలాల్ (ఎడమ వైపున)తో మీర్ ఆలం (కుడి వైపు)
జననం1752[1]
మరణం1804
సమాధి స్థలందాయిరా మీర్ మోమిన్
కుటుంబంసాలార్‌జంగ్ కుటుంబం,
జేబున్నీసా (భార్య),
మీర్ దౌరాన్ (కుమారుడు)
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
In office
1804–1808
చక్రవర్తిసికిందర్ జా
తరువాత వారుమహరాజా చందూలాల్

కుటుంబ నేపథ్యం

మార్చు

మీర్ ఆలం కుటుంబం, ఇరాన్‌లోని సుష్తర్ ప్రాతం నుండి భారతదేశం వలసవచ్చిన నూరియా సయ్యద్ తెగకు చెందిన షియా ముస్లింలు.[1] ఈయన తండ్రి సయ్యిద్ రెజా సుష్తరీ, సుష్తర్ నుండి ఢిల్లీ వలసవచ్చి, అక్కడి నుండి హైదరాబాదులో స్థిరపడ్డారు. నిజాముల్ ముల్క్ వీరికి హైదరాబాదులో భూమి ఇచ్చి స్థిరపడటానికి సహకరించాడు. సయ్యిద్ రెజా సుష్తరీ ఆయన కాలంలో పేరుమోసిన ఇస్లాం మత విద్వాంసుడు. అనేక ఖురాన్ వ్యాఖ్యానాలు వ్రాశాడు. విశ్రాంత జీవితంలో ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత ప్రభుత్వ పదవులను తిరస్కరించి, అల్లా స్మరణకే జీవితాన్ని అంకితం చేశాడు. ఈయన కీర్తిప్రతిష్టలే హైదరబాదులో వీరి వారసుల యొక్క అభివృద్ధి దోహదపడ్డాయి. మీర్ ఆలం, 1752లో చార్మీనారుకు సమీపంలోని ఇరానీ గల్లీలో జన్మించాడు.[4] మీర్ ఆలం సోదరుడు, సయ్యద్ జైనుల్ అబిదీన్ చిన్నవయసులోనే హైదరాబాదు విడిచి, జీవితాంతం టిప్పు సుల్తాన్ దర్బారులో ఉన్నాడు. మీర్ ఆలం బాల్యంలో మంచి విద్యాభ్యాసం పొందాడు. ఈయన ప్రజ్ఞ, సమర్ధత, చిన్నవయసులోనే ప్రస్ఫుటమైనవి.[1]

ప్రజా జీవితం

మార్చు

తండ్రి చనిపోయిన తర్వాత, సయ్యద్ అబ్దుల్ ఖాసింను, అజీముల్ ఉమారా, అరస్తు ఝా చేరదీసి, పనిలో పెట్టుకున్నాడు. 1784లో జాన్సన్ బ్రిటీషు ప్రతినిధిగా హైదరాబాదు వచ్చినప్పుడు, దీవాను అరస్తు ఝాకు, బ్రిటీషు ప్రతినిధికి మధ్య వకీలుగా పనిచేశాడు. అప్పటి నుండి అరస్తు ఝా వద్ద వకీలు పనిచేశాడు.

హైదరాబాదులో మీర్ ఆలం పెరుగుతున్న పరపతి ప్రతిష్ట, సుస్తర్‌లోని ఈయన బంధువుల దాకా చేరి, అనేకమంది ఇరాన్ నుండి భారతదేశం వలసవచ్చి, ఈయన వద్ద కొలువు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వారిలో బకర్ అలీఖాన్ కూడా ఒకడు. బకర్ అలీఖాన్, మీర్ ఆలం మేనత్త కొడుకు (సయ్యద్ రెజా అక్క కొడుకు). మీర్ ఆలం కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడు. మీర్ ఆలం, బకర్ అలీని సాదరంగా ఆహ్వానించి, మున్సబ్‌దారును చేశాడు, దుర్దానా బేగం అనే ప్రముఖ హైదరాబాదీ కుటుంబానికి చెందిన అందగత్తెతో పెళ్లి కూడా జరిపించాడు. ఈ దంపతులకు కాలక్రమంలో ఒక అబ్బాయి - మహమూద్ అలీఖాన్, ఒక అమ్మాయి - షరాఫున్నీసా పుట్టారు. ఈ షరాఫున్నీసా కూతురే బ్రిటీషు రెసిడెంటు జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ను వివాహం చేసుకున్న ఖైరున్నీసా.[4]: 172 

1786లో బ్రిటీషు ప్రభుత్వ రాజధానైన కలకత్తాలో నిజాం ప్రభుత్వ ప్రతినిధిగా, నెలకు ఐదువేల రూపాయల జీతం, రెండు లక్షల ప్రయాణ ఖర్చులతో నియమించబడ్డాడు.[1] కలకత్తాలో ఉన్న మూడు సంవత్సరాల సమయంలో గవర్నరు జనరల్ కార్న్‌వాలిస్తో సహా అనేక ఆంగ్లేయ అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కలకత్తా నుండి తిరిగివచ్చిన తర్వాత నిజాం ఈయనకు మీర్ ఆలం అనే బిరుదును ప్రదానం చేశాడు. ఈయన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి మద్దతుగా హైదరాబాదు సైన్యాన్ని, 1799లో జరిగిన శ్రీరంగపట్నం ముట్టడిలో, టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా ముందుండి నడిపించాడు. యుద్ధం గెలిచిన తర్వాత హైదరాబాదుకు వీరునిగా తిరిగివచ్చి అనేక గౌరవ మర్యాదలు అందుకున్నాడు. ఈయన్ను స్వాగతించి ఊరేగింపుగా తీసుకుని రావటానికి నిజాం స్వయంగా తన సొంత ఏనుగును పంపాడు. దర్బారులోని అధికారులందరినీ ఐదారు మైళ్ళు నగరద్వారాల ఆవలికి వెళ్ళి మీర్ ఆలంను సాదరంగా ఆహ్వానించి తీసుకురావాలని ఆదేశించాడు.[1]

బ్రిటీషు వారితో మీర్ ఆలంకు పెరిగిన ప్రాబల్యం, ఎదుగుదలను చూసి, అసూయకు గురైన అరస్తు ఝా, 1800 సంవత్సరంలో, మీర్ ఆలంపై నిందవేసి శిక్షపడేట్లు చేశాడు.[4] దీనివళ్ళ హైదరాబాదు సమీపంలో ఒక కోటలో బందీగా ఉండి, ఆరోగ్య కారణాలు, బ్రిటీషు రెసిడెంటు జోక్యంవలన విడుదలయ్యాడు. 1804లో తిరిగి తన ప్రాభవాన్ని పొంది, ప్రధానమంత్రి (దీవాను)గా నియమించబడ్డాడు. 1804లో దీవాన్ అజీముల్ ఉమ్రా, అరస్తు ఝా మరణించడంతో బ్రిటిషు వారి అభీష్టానుసారంగా, సికిందర్ జా, మీర్ ఆలంను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈయన పేరుమీదుగా నామకరణం చేయబడింది. మీర్ ఆలం 1804, జూలై 20 న ఈ చెరువు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. రెండేళ్ళ తరువాత 1806, జూన్ 8 న దీని నిర్మాణం పూర్తైంది. ఆ చెరువు పక్కనే కూరగాయల తోట కూడా ఉండేది. దాని పరిసరాల్లో ఏర్పడిన కూరగాయల మార్కెట్‌కు మీర్ ఆలం మండి అనే పేరువచ్చింది.

మీర్ ఆలం 1808 డిసెంబరు 8న కుష్టు వ్యాధి బారినపడి, హైదరాబాదులో మరణించాడు. మరణించే వరకు ప్రతినెలా రెండు వేల రూపాయల బ్రిటీషు ప్రభుత్వ పెన్షన్ను పొందాడు.[5] మీర్ ఆలం మరణం తర్వాత అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించారు.[6]

మీర్ ఆలం కుమారుడు, మీర్ దౌరాన్ కూడా కుష్టు వ్యాధి వలన 1801లో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Historical and Descriptive Sketch of His Highness the Nizam's Dominions Volume 1. Bombay: Times of India Steam Press. 1883. Retrieved 24 August 2024.
  2. Briggs, Henry George (1861). The Nizam, his history and relations with the British government. Robarts - University of Toronto. London B. Quaritch. pp. 138–141.
  3. Law, John. Modern Hyderabad (Deccan). pp. 25, 29, 37.
  4. 4.0 4.1 4.2 4.3 Dalrymple, William (2003). "Chapter 4". White Mughals: Love and Betrayal in Eighteenth-century India (in ఇంగ్లీష్). Harper Perennial. ISBN 978-0-00-655096-9.
  5. Haroon, Anwar (2013). Kingdom of Hyder Ali and Tipu Sultan. Xlibris Corporation. p. 285. ISBN 9781483615349. Retrieved 28 July 2020.
  6. Imperial Gazetteer of India: Provincial Series, Volume 15. Superintendent of Government. 1909. p. 295. Retrieved 1 September 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=మీర్_ఆలం&oldid=4318563" నుండి వెలికితీశారు