ముద్దు బిడ్డ (1956 సినిమా)
1950లలో నవలల ఆధారంగా వచ్చిన సినిమాలను తెలుగు పాఠకులు /ప్రేక్షకులు బాగా ఆదరించారు. అప్పుడు శరత్ బాబు నవల ల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి . వాటిలోనిదే ఒకటైన “బిందుగారబ్బాయి” నవల ఆధారంగా వచ్చిన ” ముద్దుబిడ్డ ” సినిమా. అందరినీ అలరించే పాటలతో, చక్కని నటీ నటులతో, లక్ష్మణ్ గోరే ఫొటోగ్రఫీలో కె.బి.తిలక్ అనుపమా పిలంస్ పతాకం మీద నిర్మించారు,. దర్శకత్వమూ వహించారు . ఆ తరువాత తిలక్ నే ఇదే సినిమాను హిందీలో ”చోటీ బహు” పేరుతో తీసారు .
ముద్దు బిడ్డ (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.తిలక్ |
---|---|
నిర్మాణం | కె.బి.తిలక్ |
కథ | శరత్ చంద్ర |
తారాగణం | జగ్గయ్య, జమున |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | పి.లీల, పిఠాపురం నాగేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర |
సంభాషణలు | ఆరుద్ర, తాపీ ధర్మారావు |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ గోరే |
నిర్మాణ సంస్థ | అనుపమ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నవల
మార్చుయాదవుడూ మాధవుడు సవితిబిడ్డలన్న సంగతి వారే కాదు లోకమంతా కూడా మర్చిపోయారు .బీదవాడైనా యాదవుడు చాలా కష్టపడి తమ్ముడు మాధవుడికి బి.ఎల్ దాకా చదువు చెప్పించాడు . ఎన్నోప్రయత్నాలు చేసి చక్కటి, ధనవంతుడి ఏకైక పుత్రిక ఐన బిందువాసినిని పదివేల కట్నంతో తెచ్చి పెళ్ళి జరిపిస్తాడు . పెద్దకోడలు అన్నపూర్ణ బిందును చూసి లక్ష్మీ స్వరూపం అని మురిసిపోయింది . కాని కొన్ని రోజులకు బిందువాసిని అహంకారమే కాదు మూర్చల రోగం కూడా వుందని తెలిసి బాధ పడుతుంది . కాని బావగారికి మాత్రం మరదలంటే చాలా అభిమానం . ఓసారి బిందువాసినికి మూర్చవచ్చినప్పుడు ఏమిచేయాలో తోచక తన ఏణర్ద్ధం పిల్లవాడు అమూల్యచరణుని తెచ్చి బిందు వడిలో వేసింది అన్నపూర్ణ . బిందువాసిని మూర్చ నుంచి తేరుకొని అమూల్యుణ్ణి తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది . చాటు నుంచి చూస్తున్న అన్నపూర్ణ, బిందువాసిని జబ్బుకు మందు కనిపెట్టినందుకు వుప్పొంగిపోయింది .
సంసార భారమంతా తన నెత్తినే వుండటము వల్ల పిల్లవాడిని సాకలేకపోతోంది అన్నపూర్ణ . అందుచేత చిన్న కోడలు బిడ్డ భారమ్నతా వహించింది . ఎలా ఐతేనేం అన్నపూర్ణ బిడ్డ బిందువాసిని వళ్ళో పెరుగుతూ పిన్నిని ” అమ్మా ” అని, అమ్మను ” అక్కా ” అని పిలవటం నేర్చుకొన్నాడు . నాలుగేళ్ళ తరువాత అట్టహాసంగా వాడికి అక్షరాభాస్యం చేసారు . కాని వాడిని బడికి పంపుతే వేరే పిల్లలు కొడతారని, కలం పెట్టి వాడి కంట్లో పొడుస్తారని భయపడి, బావగారికి చెప్పి ఇంటి అరుగుమీదే బడి పెట్టిస్తుంది బిందువాసిని . అమూల్యుడికి ఏమాత్రం కొరత జరిగినా సహించేది కాది బిందువాసిని . ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడుగా ఆరేళ్ళు గడిపారు . తమ్ముడి ప్రాక్టీస్ పెరిగిన తరువాత యాదవుడు, వుద్యోగం మానేసి సొంత ఆస్తిపాస్తులు చూసుకోవటం ఆరంభించాడు . మరదలు తెచ్చిన పదివేల రూపాయలూ వడ్డీకిచ్చి రెట్టింపు చేసాడు . ఆ డబ్బులో కొంత, మాధవుని సంపాదనలో కొంత పెట్టి పెద్ద భవంతి కట్టించాడు . దుర్గా పూజల తరువాత మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసుకొని అందులోకి మారుదామనుకుంటారు .
వీరికి దగ్గర చుట్టం ఏలోకేసి స్థితి ఏమంత బాగాలేదు . యాదవుడు అప్పుడప్పుడు ఆమెకు ఆర్థిక సహాయము చేస్తూ వుంటాడు . ఆమె కొడుకు నరేంద్రుని ఇక్కడకు పంపుతే చదువు చెప్పిస్తానని యాదవుడు వుత్తరము వ్రాయటముతో కొడుకును వెంటబెట్టుకొని వస్తుంది ఏలోకేసి . రెణ్ణాళ్ళ తరువాత ఆమె భర్త ప్రియనాధుడు కూడా వస్తాడు .ఎలోకేసి పైకి సాధువు లా కనిపిస్తుంది కాని సాధువు కాదు .పిల్లా జెల్లా లేని బిందువాసిని దగ్గర ధనపు మూటలు వున్నాయని గ్రహించి ఆమె యందు అమిత ప్రేమను చూపిస్తూ వుంటుంది . కాని, నరేంద్రుని సహవాసంలో అమూల్యుడు చెడిపోతున్నాడని వారిని పంపేయమని బిందువాసిని అన్నపూర్ణకు చెపుతుంది . ఆ విషయము మీదనే ఇద్దరికీ చిన్నగా గొడవలు మొదలవుతాయి . చివరికి అవి ఎక్కువై మాటా మాటా వచ్చి మళ్ళి బిందువాసినికి మూర్చ వస్తుంది . ఆ తరువాత కొత్త ఇంటిలోకి యాదవుడు, అన్నపూర్ణ, అమూల్యుడు తప్ప అందరూ వెళుతారు . బావగారు మళ్ళీ వుద్యోగంలో చేరారని చాలా దారిద్ర్యంలో వున్నరని తెలుస్తుంది బిందువాసినికి . గృహప్రవేశానికి మాధవుడు బతిమిలాడి పిలవగా వచ్చిన అన్నపూర్ణ, పనంతా చక్కబెట్టి, మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోతుంది . దానికి బాధ పడ్డ బిందువాసిని తనూ అన్నం, నీళ్ళూ మానేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది . పుట్టింట్లో చావు బతుకుల మధ్య వున్న బిందువాసిని పరిస్థితి చూసి మాధవుడు అన్నా, వదిన, అమూల్యుడిని తీసుకొని వస్తాడు . వారిని చూసిన తరువాత కోలుకుంటుంది బిందువాసిని . అంతా కలిసిపోతారు .
సినిమా కథ
మార్చుసినిమా దాదాపుగా నవల లాగానే వుంది . డైలాగులు, సంఘటనలు కూడా ఏమీ మార్చబడలేదు . కాకపోతే పాత్రల పేర్లు బెంగాలీ పేర్లు కాకుండా తెలుగుపేర్లు పెట్టారు . దానితో బెంగాలీ నవల సినిమా చూస్తున్నట్లుగా కాక తెలుగు సినిమా చూస్తున్నట్లుగానే వుంది . యాదవుడు – శేషయ్య ( నాగయ్య ), మాధవుడు – మధు ( జగ్గయ్య ), అన్నపూర్ణ -సీత ( లక్ష్మీరాజ్యం ), బిందువాసిని – రాధ ( జమున ), అమూల్య చరణుడు – వేణు ( మాస్టర్ వెంకటేశ్వర రావు ) ఏలోకేసి-పేరమ్మ ( సూర్యకాంతం ),ప్రియనాధుడు – పరంధాముడు ( రమణా రెడ్డి ) నరేంద్రుడు – నారాయణ ఇవీ కొన్ని ముఖ్యమైన పాత్రలూ పాత్రధారులూ . నవలలో మాధవుడు లా చదువుతాడు . సినిమాలో మధు, డాక్టర్ . సినిమాలో శేషయ్య పని చేసే జమిందారును రెండు మూడు సార్లు చూపిస్తారు . ఆ పాత్ర ద్వారానే శేషయ్య తమ్ముడి పొలం కాక తన పొలం తాకట్టు పెట్టి చదివిస్త్తునట్లుగా చెప్పిస్తారు . సినిమాలో సూర్యకాంతం పాత్ర కూడా కొంచం ఎక్కువగానే వుంది . “నువ్వు మీ అమ్మను చూస్తే , మీ అమ్మ చనిపోతుందని ” వేణుకు చెప్పటం, రాధతో ” బాబును రాధ దగ్గరకు తల్లి పంపించటం లేదని ” రాధకు చెప్పి తోటికోడలు మీద ద్వేషం పెంచటం నవలలో లేదు . ఇలాంటి చిన్న చిన్న మార్పులు తప్ప,కథ దాదాపు నవల కథే కాబట్టి పెద్దగా చెప్పేందుకు ఏమీలేదు.
పాత్రలు-పాత్రధారలు
మార్చు- జగ్గయ్య - డాక్టర్ మధు, శేషయ్య తమ్ముడు
- జమున - రాధ, మధు భార్య
- చిత్తూరు నాగయ్య - శేషయ్య
- లక్ష్మీరాజ్యం - సీత, శేషయ్య భార్య
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - జమీందారు
- సూరపనేని పెరుమాళ్ళు
- చదలవాడ కుటుంబరావు
- అల్లు రామలింగయ్య
- రమణారెడ్డి - పరంధాముడు
- సూర్యకాంతం - పేరమ్మ
- మాస్టర్ వెంకటేశ్వరరావు - వేణు
- ఇ.వి.సరోజ - డాన్సర్
- బొడ్డపాటి
సాంకేతిక వర్గం
మార్చునిర్మాత,దర్శకుడు: కొల్లిపర బాలగంగాధర్ తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ:అనుపమ ఫిలిమ్స్
కధ: శరత్ చంద్ర
మాటలు: ఆరుద్ర , తాపీ ధర్మారావు
పాటలు:ఆరుద్ర
గాయనీ గాయకులు: పి.సుశీల,నాగయ్య, పి లీల, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
ఛాయా గ్రహణం: లక్ష్మణ్ గోరె
విడుదల:06:09:1956.
చిత్రీకరణ
మార్చుసినిమా చిత్రీకరణ బాగుంది . మన ఇంట్లో మనతోనే జరుగుతున్నంత సీదా సాదాగా వుంది . ఆ రోజుల పల్లెటూరి వాతావరణం బాగా తెలుస్తుంది . రాధా, మధుల వివాహ సందర్భంలో చేసిన పులి వేషం బాగుంది . రాధగా జమున చాలా అందంగా వుంది .వేణు దూరమైనప్పుడు, బావగారు మళ్ళీ వుద్యోగంలో చేరారని బాధ పడి నప్పుడు, చివరలో ప్రాణత్యాగానికి సిద్దపడి బాధపడుతున్నప్పుడు చాలా బాగా నటించింది. జగ్గయ్య కూడా చిన్నగా ముద్దుగా వున్నాడు . ఆ రోజులలో జగ్గయ్య, జమున హిట్ జంట. లక్ష్మీరాజ్యం చాలా సాత్వికంగా, కళగా బాగుంది . నాగయ్య సరే సరి ఇంటి పెద్దగా గంభీరంగా వున్నాడు . సూర్యకాంతం ఇలాంటి పాత్రలు పోషించటంలో సిద్దహస్తురాలే కదా వేణూగా వేసిన మాస్టర్ వెంకటేశ్వర రావు, నారాయణగా వేసిన బాబు, పెద్దవాళ్ళతో పోటీపడి నటించారు.
పాటలు
మార్చుఇందులోని పాటలను ఆరుద్ర రచించాడు. సంగీతం పెండ్యాల అందించగా, పి.లీల, జిక్కి, పి.సుశీల, నాగయ్య, పిఠాపురం నాగేశ్వరరావు పాడారు.[1]
క్ర.సం. | పాట | గాయినీగాయకులు |
---|---|---|
1 | ఇటులేల చేశావయా ఓ దేవ దేవ ఇటులేల చేశావయా | చిత్తూరు నాగయ్య |
2 | ఎవరుకన్నా రెవరు పెంచారు నవనీత చోరుని గోపాల బాలుని | పి.లీల |
3 | ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ వస్తావా లేకపొతే ఒట్టేస్తా - | జిక్కి, పిఠాపురం |
4 | చిట్టిపొట్టి వరాలమూట గుమ్మడిపండు గోగుపువ్వు | పి.సుశీల |
5 | చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది నిన్ను చూడాలని | పి.సుశీల |
6 | జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి | పి.లీల |
7 | పదరా సరదాగ పోదాం పదరా బావా చిందేసుకుంటూ | జిక్కి బృందం |
8 | ముద్దుగా ఎప్పుడు ముస్తాబు అవుదామయ్యా మా బాబు (బిట్) | పి.సుశీల |
9 | అంతలోనే తెల్లవారె అయ్యో ఏమి చేతునే కాంతుని మనసెంత నొచ్చెనో | పి.సుశీల బృందం |
మూలాలు
మార్చు- ↑ కల్లూరి భాస్కరరావు. "ముద్దు బిడ్డ - 1956". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)