మూస:వేదిక తెలుగు సినిమా వ్యాసం

(మూస:వేదిక తెలుగు సినిమా/వ్యాసం నుండి దారిమార్పు చెందింది)
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశ్శబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశం లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గ సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రి లో స్థాపించారు.

తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం, తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణం లో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడినది.

1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్రం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్ లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 24 జనవరి 1952 న బొంబాయి లో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.

2005, 2006, 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే కలవు.

సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి(1951), మల్లీశ్వరి(1951), దేవదాసు(1953), మాయాబజార్(1957), నర్తనశాల(1963), మరో చరిత్ర(1978), మా భూమి(1979), శంకరాభరణం (1979), సాగర సంగమం(1983), శివ(1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.

సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.

...ఇంకా...