మోహన మకరందం పుస్తకం ప్రభుత్వంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన ఐ.ఎ.ఎస్.అధికారి మోహన్ కందా ఉద్యోగ విరమణ అనంతరం రాసిన అనుభవాలూ-జ్ఞాపకాల గ్రంథం. ఐ.ఎ.ఎస్.అధికారిగా జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శిగా పొందిన వివిధ అనుభవాలను ఈ గ్రంథరూపంలో వెల్లడించారు. మోహన్ కలసి పనిచేసిన పలువురు ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులతో వ్యక్తిగత, వృత్తిగత అనుభవాలు, కీలకమైన నిర్ణయాల్లో ఎదురైన అనుభవాలు ఈ పుస్తకంలో వివరించారు.

మోహన మకరందం
మోహన మకరందం ముఖపత్రం
కృతికర్త: మోహన్ కందా
బొమ్మలు: బాపు
అంకితం: మోహన్ కందా తల్లిదండ్రులకు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): అనుభవాలు
ప్రచురణ: మోహన్ కందా
విడుదల: 2014
పేజీలు: 250

రచన నేపథ్యం మార్చు

తెరవెనుక పనిచేసే ప్రభుత్వ ఉన్నతాధికారుల వృత్తిజీవిత విశేషాలను మొదటగా పి.వి.ఆర్.కె ప్రసాద్ అసలేం జరిగిందంటే..., నాహం కర్తా హరిః కర్తా పుస్తకాల్లో రాశారు. మోహన్ కందా ఈ క్రమంలోనే తన అనుభవాలను మేనేజ్‌మెంటు వృత్తినిపుణులకు ఉపకరించేలా, సామాన్యులకు ప్రభుత్వ నిర్వహణలోని తెరవెనుక విషయాలపై ఆసక్తి కలిగేలా రచనచేశారు. తన కూతురు ఈ ఆలోచన ఇచ్చి, పలు విధాలుగా పురికొల్పకపోతే తానీ రచన చేయకపోయే వాడినని మోహన్ కందా పేర్కొన్నారు. మేనేజ్‌మెంటు నిపుణులు తమ రంగాల్లో విజయం సాధించి తద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు బలం కలిగించాలంటే ఇటువంటి అనుభవాలను చదవాల్సి ఉంటుందనీ, వారిని ప్రాథమిక లక్ష్యంగా చేసుకునే ఈ పుస్తకం రచించినట్టు ఆయన రాశారు. ఈ పుస్తక రచనలో ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ పరోక్షంగానూ, ఎం.బి.ఎస్.ప్రసాద్ ప్రత్యక్షంగానూ సహకారం అందించారు. స్వాతిలో ధారావాహికగా ప్రచురితమైన వ్యాసాలకు మరికొన్నిటిని చేర్చి మోహన్ కందా ఈ పుస్తకాన్ని రూపొందించారు. 2014 మార్చిలో మోహన్ కందా తానే ప్రచురణకర్తగా వ్యవహరించి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.[1]

అంకితం మార్చు

"వీడి అసాధ్యం కూలా! వీడు టెక్నికల్ పుస్తకాలే కాక ఇలాంటిదీ ఒహటి రాయగలడా!" అని పైలోకం నుంచి ఆశ్చర్యపడుతున్న నాన్న గారికీ, "చాల్లెండి... వాడికేం తక్కువ! ఇలాటి ఘనకార్యాలు బోల్డు చేయగలడని నేన్చెప్తే ఎప్పుడు విన్నారు గనుక!" పక్కనే ఉండి దెప్పుతున్న మా అమ్మకీ అంటూ రచయిత మోహన్ కందా కీర్తిశేషులైన తన తల్లిదండ్రులకు అంకితం చేశారు.

వ్యాసాల జాబితా మార్చు

  • ఉగ్గుపాలగా గాడిదపాలు.. ఆ పై ఆల్కహాలు
  • ట్రిక్కులు పనిచేయవు
  • కృష్ణాపుష్కరాలు - ఆదిలో హంసపాదు
  • ఎన్టీఆర్ - కోడితో పోటీ పడాలి
  • "జై ఆంధ్ర"లో అఫెన్సు మార్గం
  • ఉపరాష్ట్రపతితో పాటు డిన్నర్ థాంక్స్ - బట్ నో థాంక్స్
  • శాఖాధిపతులకు అన్నీ తెలియాలా?
  • జై ఆంధ్ర - చీకటిరాత్రిలో కేంద్రమంత్రి
  • రాష్ట్రపతి రాకుంటే చిక్కు - వస్తే రిస్కు
  • ఉపరాష్ట్రపతి - "చెప్పు"కోక తప్పలేదు!
  • తడాఖా చూపించాలి... ఒక్కోసారి!
  • లేనిపోని రిస్కెందుకు బ్రదర్
  • ప్రభుత్వానికి గిట్టని "చేపల వ్యాపారం"
  • నా మీద నీకు నమ్మకం లేదా?
  • కమిటీ వేయడం కాలయాపనకేనా?
  • ఒక్కోప్పుడు చిన్న చిన్న విషయాలే తట్టవ్...
  • తీపి వ్యాపారానికి చేదు మాత్ర
  • గోయింగ్ ప్లేసెస్
  • ఎంతపని చేశావయ్యా!
  • ఐఐటీయా? అయ్యేయెస్సా?
  • ఇద్దరు రాష్ట్రపతులా? అదెలా!?
  • ఎవరి పని వారు చేయాలి
  • సెన్స్ ఆఫ్ హ్యూమర్
  • నిజాయితీకి నిర్వచనం?
  • పై వాడినీ "చూసుకోవాలి"..
  • "ఆంధ్ర" విద్యార్థులకూ అగ్నిజ్వాలలకూ మధ్య
  • సేద తీరాలంటే సంగీతం తప్పనిసరి
  • చోటు మారి చూసిన వైఎస్సార్
  • సొంత కేసుతో ఘాటు సందేశం
  • నేను క్లవరా?
  • పెంపుడు జంతువులు ఉండడం చాలా మంచిది
  • ఎన్టీఆర్ హయాంలో చాడీలు - సస్పెన్షన్
  • ఓ న్యూస్ ఐటం+ ఓ సీఎం = ట్రాన్స్‌ఫర్
  • పివి సమక్షంలో కమల్‌నాథ్ మాట కాదనడమా?
  • మేం ఏ ఎండకు ఆ గొడుగు పడతామా?
  • దృఢంగా చెప్తే ఎదిరించినట్లా?
  • నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?
  • కెప్టెన్ ఇలా ఉండవచ్చా అని తిట్టిపోసిన సంతానం గారు
  • ఈల వేస్తే తప్పా అని జీపీ రావు నడిగా
  • హిదయతుల్లా గారి కాగితం పారేసుకున్నా
  • మోహన్ కందా డౌన్ డౌన్ - ఇంటా బయటా
  • నీ పోస్టింగ్ దక్క.. అన్న ఎన్టీఆర్
  • నేను మద్రాసీనా? హైదరాబాదీనా?
  • జోర్డాన్ రాజు బహుమతి వద్దన్నా తంటానే...
  • ఉద్యోగం రాకపోతే ఎల్‌ఐసీ బిల్డింగ్ పై నుంచి దూకుతావా?
  • ఎక్సయిజ్ ఆదాయంపై ఎన్టీఆర్‌తో విభేదించా
  • ఈ జాలర్లకు కార్లు యిచ్చేస్తే ప్ఫీడా వదిలిపోతుంది కదా
  • ఎగ్జిబిషన్‌లో మంత్రి అంతర్ధానం
  • చైతన్యానికి మారు పేరు మా అమ్మ
  • పంటకు సెలవు - వివాదాలకు నెలవు

ఉదాహరణలు మార్చు

  • మా బ్యూరాక్రాట్స్‌కు ఎఱా ప్రగడే ఆదర్శం అని నేనంటే మీరు ఆశ్చర్యపడతారని నాకు తెలుసు. నేనే కాదు ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ నలే. నన్నయ్య గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యావహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే. వరుసగా వచ్చే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పార్టీలు వేరే ఉండవచ్చు, సిద్ధాంతాలు తేడాగా ఉండవచ్చు, వయోభేదం ఉండవచ్చు, వేగంలో వ్యత్యాసం ఉండవచ్చు, విద్యాధిక్యతలో, అవగాహనలో, ప్రవర్తనలో, నైతికతలో – ఎన్నో రకాల భేదాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా పరిపాలించబడే ప్రజలకు మాత్రం తేడా తెలియకూడదు. ఒకే ప్రభుత్వం అనూచానంగా నడుస్తున్నట్టు అనిపించాలి. ముఖ్యమంత్రి ఎవరైతేనేం, ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, మనం నిత్యం చూసే ఆర్‌డీఓగారు మారలేదు, ఆయన పనితీరూ మారలేదు అనిపించాలి. నిజానికి మార్పు ఉంటుంది. కానీ అది మార్పులా అనిపించకుండా చూడడమే బ్యూరాక్రసీ లక్షణం. ఈ క్రమంలో బ్యూరాక్రసీ చాలా అవస్థే పడుతుంది.[2]

ఇతరుల మాటలు మార్చు

  • ఇందులో తల్లి ప్రోత్సాహంతో బాలనటుడిగా సినిమాల్లో వెలిగిన మోహనూ కనిపిస్తాడు. తండ్రి మాట జవదాటక ఐఐటి సీటు వదులుకొని ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ వైపు మళ్లేటంత వినయవిధేతలు చూపిన కొడుకూ కనిపిస్తాడు. ప్రత్యేక ఆంధ్రోద్యమంలో రైళ్లాపేసిన ఉద్యమకారుల్ని తన వాక్చాతుర్యంతో నియంత్రించిన ఓ సబ్‌ కలెక్టర్‌, 'తాత్కాలిక రాష్ట్రపతి' అని ఉపరాష్ట్రపతి హిదాయతుల్లాని (ఆయన అభీష్టానికి విరుద్దంగా) పేర్కొన్న ఓ సెక్రటరీ, గవర్నర్‌ శారదా ముఖర్జీని తన ఇంగ్లీషు భాషతో ఆకట్టుకున్న ఓ ఐఏఎస్‌ అధికారి, మాటల్లో మార్దవం తొణికిసలాడుతున్నా ఎక్సైజ్‌ పాలసీ విషయంలో ముఖ్యమంత్రి ఎన్‌.టి.ఆర్‌. ఎదుట అభిప్రాయ వ్యక్తీకరణలో నిష్కర్షగా నిర్భయంగా వ్యవహరించిన ఎక్సైజ్‌ కమీషనర్‌, 2004 కృష్ణా పుష్కరాల ఆరంభంలో యాత్రికుల ప్రాణాలు తీసిన ఘటన విషయంలో తీసుకోవాల్సిన చర్యల మీద ముఖ్యమంత్రి వై.యస్‌.తో నిస్సంకోచంగా విభేదించగలిగిన ప్రధాన కార్యదర్శి.... ఇలాంటి అనేక పాత్రలలో మోహన్‌ కందా వ్యక్తిత్వంలోని విభిన్న శక్తిసామర్థ్యాలు ఎలా అవిష్కృతమయ్యాయో ఈ అనుభవాల సమాహారంలో కనిపిస్తుంది. - పి.వి.ఆర్.కె.ప్రసాద్, విశ్రాంత ఐ.ఎ.ఎస్.అధికారి, రచయిత.[3]
  • ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం.[2].

ప్రాచుర్యం మార్చు

మోహన మకరందం స్వాతి వారపత్రికలో ధారావాహికగా వస్తూండగా బహుళ ప్రాచుర్యం పొందింది. మార్చి 2014లో పుస్తకంగా విడుదలయ్యాకా కూడా కొనసాగించగలిగింది. 2014 మార్చి చివరి రెండు వారాలు(3,4), ఏప్రిల్ మొదటి రెండు వారాల(1,2)లో అంతర్జాల పుస్తక విక్రేతలైన కినిగె.కాం విడుదల చేసిన టాప్ 10లో మొదటిస్థానం పొందింది.[4][5][6][7]

మూలాలు మార్చు

  1. నా మాట(ముందుమాట):మోహన మకరందం:మోహన్ కందా:మార్చి 2014
  2. 2.0 2.1 "నవ్య పేజీ, ఆంధ్రజ్యోతి, మార్చి 20, 2014". Archived from the original on 2014-07-23. Retrieved 2014-04-17.
  3. "కినిగె.కాంలోని వివరణలో". Archived from the original on 2014-03-27. Retrieved 2014-04-17.
  4. "2014 మార్చి 3వ వారం కినిగె.కాం టాప్10 లిస్టు". Archived from the original on 2014-07-25. Retrieved 2014-04-17.
  5. "2014 మార్చి 4వ వారం కినిగె.కాం టాప్10 లిస్టు". Archived from the original on 2014-07-25. Retrieved 2014-04-17.
  6. "2014 ఏప్రిల్ మొదటి వారం కినిగె.కాం టాప్10 లిస్టు". Archived from the original on 2014-08-06. Retrieved 2014-04-17.
  7. "2014 ఏప్రిల్ రెండవ వారం కినిగె.కాం టాప్10 లిస్టు". Archived from the original on 2014-08-07. Retrieved 2014-04-17.