యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°35′05″N 78°56′39″E / 17.5848°N 78.9442°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నల్గొండ జిల్లా |
ప్రదేశం: | యాదగిరిగుట్ట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నరసింహస్వామి |
ప్రధాన దేవత: | లక్ష్మీదేవి |
స్థల పురాణం
మార్చుఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.
తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.
ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.
రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.
యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, యాదగిరి గుట్ట
మార్చుయాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏం కావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
మార్చుయాదద్రి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండ లనుండి చాలా బస్సులు ఉన్నాయి.
వసతి సదుపాయాలు
మార్చు- శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం. Reg: 2393/1989 Ph: +91-8685-236670, +91-8685-236675 (toll gate దగ్గర ఉంటుంది ఈ సత్రం)
- శ్రీ అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం సంఘం ఉంది. పాత గుట్ట రోడ్ లో ఉంది.
పాత నరసింహస్వామి ఆలయం
మార్చుయాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి.
- పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
- కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంనకు గుర్రముమీద వెళ్ళినట్లుగా కథనం.ఇప్పటికీ అక్కడ సమీపంలో ఆ గుర్రపు అడుగుల ఆధారాలు చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంనకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు - 2022
మార్చుయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2022 మార్చి 4వ తేదీ నుంచి 14 వరకు 10 రోజులపాటు వైభవంగా జరిగాయి. 10న ఎదుర్కోలు, 11న బాలాలయంలో తిరుకళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అష్టోత్తర శత ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి.
స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో ఆరోసారి ఉత్సవాలు జరిపేందుకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి వేడుకలను నిర్వహించారు.[1]
బాలాలయం తొలగింపు
మార్చుయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి 2014లో మాస్టర్‌ప్లాన్ రూపొందించినప్పుడు భక్తుల దర్శనాల కోసం తాత్కాలిక బాలాలయాన్ని నిర్మించాలని శ్రీవైష్ణవ పీఠాధిపతి చినజీయర్‌స్వామి సూచించారు. దీంతో ప్రధానాలయానికి ఉత్తర దిశలో సువిశాలమైన ప్రాంగణంలో బాలాలయాన్ని నిర్మించారు. అయితే 2022 మార్చి 28న జరిగిన ఉద్ఘాటన అనంతరం ప్రధానాలయం గర్భాలయంలో ఉన్న నృసింహుని దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నందున సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులు కొలువుదీరిన బాలాలయాన్ని యాదగిరిగుట్ట టెంపుల్ డెవల్‌పమెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులు 2022 ఏప్రిల్ మాసంలో తొలగిస్తున్నారు.[2]
బంగారు తాపడం
మార్చుస్వామి దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ. 52.48 లక్షల చెక్కును సీఎం దంపతులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మనుమడు హిమాన్షు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాలయ అధికారులకు అందజేశారు.[3] ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కిలో బంగారం కోసం రూ.50.15 లక్షల చెక్కును, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి కిలో బంగారం కోసం రూ. 51లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి కిలో కిలో బంగారం కోసం రూ.50.04 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు.[4]
వ్రత మండపం
మార్చుగుట్టకింద నిర్మించిన అధునాతన సత్యనారాయణస్వామి వ్రత మండపం 2022 నవంబరు 9న అందుబాటులోకి వచ్చింది. వైటీడీఏ ఆధ్వర్యంలో కొండకు ఉత్తర దిశలో కొండకిందకు వచ్చే ఎగ్జిట్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో 2.57 ఎకరాల్లో 17.38 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు. వ్రతాల కోసం రెండు హాళ్ళను నిర్మించగా, ఒక్కోహాలులో 250 వ్రత పీటలు ఉన్నాయి. ఒక్కో వ్రతపీటంపై నాలుగు జంటలుగా, హాల్‌కు వెయ్యి చొప్పున రెండు హాళ్ళలో ఏకకాలంలో రెండు వేలవంది వ్రతాలతో రోజుకు ఆరు బ్యాచ్‌లుగా విభజించి మొత్తం 12 వేల వ్రతాలను నిర్వహిస్తారు. ఈ సముదాయంలో సిబ్బంది గది, ఇంచార్జి గది, అర్చక గది, టికెట్ కౌంటర్, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక డ్రెసింగ్ రూమ్‌లు, పూజా సామగ్రి భద్రపరిచే గది, కొబ్బరికాయ కొట్టే ప్రాంతం, వ్రత పీటలు భద్రపరిచే గది, పురుషులకు 9, స్త్రీలకు 11 ప్రత్యేక టాయిలెట్స్, వికలాంగులు, అర్చకులకు ప్రత్యేకంగా టాయిలెట్స్, అర్చకులు పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన స్టేజీ ఉన్నాయి.[5][6]
కమాండ్ కంట్రోల్ సెంటర్
మార్చుయాదాద్రి వచ్చే భక్తుల భద్రతకోసం కొండపైన ఉన్న ఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను 2022 డిసెంబరు 30న రాచకొండ సీపీ మహేశ్ భగవత్, దేవాలయ ఈఓ ఎన్ గీత, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రారంభించారు. కోటి రూపాయలతో కొండపైన, రింగ్‌రోడ్డు చుట్టూ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదాద్రి- రాయగిరి ప్రధాన రోడ్డు మొదలైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను కొండపైన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.[7][8]
ఐజీబీసీ గుర్తింపు
మార్చుమూలవరులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో ప్రధానాలయ పునర్నిర్మాణం, కొండచుట్టూ పచ్చదనం, నీటిశుద్ధి నిర్వహణ, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీపై 2022- 2025 సంవత్సరానికిగాను ఐజీబీసీ గ్రీన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రేటింగ్ సిస్టం కింద యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) గుర్తింపు లభించింది. 2022 అక్టోబరు 20న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను వైటీడీఏ అధికారులు అందుకున్నారు. వర్షపు నీటిన ప్రత్యేకమైన కాల్వల ద్వారా చెరువులకు మళ్లించే స్టామ్ వాటర్ డ్రైన్ పద్ధతితోపాటు అధునాతన ట్యాప్, పైపుల వినియోగం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం, దేవాలయ ప్రాంగణమంతా 100% ఎల్‌ఈడీ లైట్ల వినియోగం అందరిని ఆకర్షిస్తోంది.[9]
రికార్డు ఆదాయం
మార్చు- 2022 నవంబరు 13 ఆదివారం రోజున పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఈ దేవాలయానికి ఒక్కరోజులో రికార్డుస్థాయిలో రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. అప్పటివరకు ఈ దేవాలయ చరిత్రలో కోటి రూపాయల మించి ఆదాయం రాలేదు. ఈ ఆదాయంలో... ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టికెట్ల ద్వారా రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 సహా వివిధ సేవల ద్వారా సమకూరింది.[10]
- 2022 నవంబరు 20 ఆదివారం రోజున కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సుమారు 80వేల మంది భక్తులు లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో భక్తులు కైంకర్యాలు, సుప్రభాతం, వ్రతాలు, ప్రసాదాల విక్రయాలు, సువర్ణ పుష్పార్చన తదితర సేవలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది.[11]
దగ్గరలోని దర్శనీయ స్థలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు". andhrajyothy. Retrieved 2022-03-04.
- ↑ "యాదగిరిగుట్టలో బాలాలయం తొలగింపు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-16. Retrieved 2022-04-16.
- ↑ "యాదాద్రీశుడి బంగారు తాపడం కోసం కేసీఆర్ విరాళం.. ఎంత ఇచ్చారంటే..?". ETV Bharat News. 2022-09-30. Archived from the original on 2022-09-30. Retrieved 2022-09-30.
- ↑ telugu, NT News (2022-09-30). "యాదాద్రి అభివృద్ధికి రూ.43కోట్లు : సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-30. Retrieved 2022-09-30.
- ↑ telugu, NT News (2022-10-26). "గుట్టలో సర్వహంగులతో వ్రత మండపం". www.ntnews.com. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
- ↑ Service, Express News (2023-02-27). "Nizam's relatives donate necklace to Yadadri temple". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-03-22.
- ↑ telugu, NT News (2022-12-30). "యాదాద్రిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2022-12-31. Retrieved 2022-12-31.
- ↑ "యాదాద్రిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం." NavaTelangana. 2022-12-30. Archived from the original on 2022-12-31. Retrieved 2022-12-31.
- ↑ telugu, NT News (2022-10-18). "యాదగిరిగుట్టకు ఐజీబీసీ గుర్తింపు". Namasthe Telangana. Archived from the original on 2022-10-18. Retrieved 2022-10-18.
- ↑ "Yadadri temple: యాదాద్రి చరిత్రలో ఒక్కరోజే రికార్డు స్థాయి ఆదాయం". EENADU. 2022-11-13. Archived from the original on 2022-11-13. Retrieved 2022-11-13.
- ↑ telugu, NT News (2022-11-20). "యాదగిరిగుట్ట నర్సన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం.. అక్షరాలా ఎంతంటే..?". www.ntnews.com. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
బయటి లింకులు
మార్చు- వికీమాపియా లో
- గూగుల్ మాప్స్‌లో ఈ ప్రదేశాన్ని దర్శించండి