స్త్రీ

(యువతి నుండి దారిమార్పు చెందింది)

స్త్రీ లేదా మహిళ అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.

భారతీయ మహిళ

జీవశాస్త్రంలో స్త్రీ

మార్చు
 
స్త్రీ లింగ సూచన
 
స్త్రీ జననేంద్రియ వ్యవస్థ

జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. అండాశయాలు హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదలకు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, పిండంగా మారడానికి గర్భం చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారు చేస్తాయి. గర్భాశయం పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. యోని పురుష సంయోగానికి, పిండం జన్మించడానికి తోడ్పడుతుంది. వక్షోజాలు వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు క్షీరదాల ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల కారియోటైపు 46, XX, అదే పురుషుల కారియోటైపు 46, XY. ఇందువలన X క్రోమోసోము, Y క్రోమోసోములను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.

 
మానవ స్త్రీల కారియోటైపు.truth-or-dare

అయితే కొజ్జాలలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. చాలా మంది స్త్రీలు ఋతుచక్రం ప్రారంభమైన సమయం (రజస్వల) నుండి గర్భం దాల్చగలరు.[1] ఇది సామాన్యంగా పురుషుని వీర్యకణాల వలన జరిగినా, శాస్త్ర అభివృద్ధి వలన ఆధునిక కాలంలో కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం కలిగింది. ఋతుచక్రాలు పూర్తిగా ఆగిపోయిన మెనోపాస్ తర్వాత అండాల తయారీ ఆగిపోయి స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉండదు. స్త్రీల వ్యాధుల శాస్త్రాన్ని గైనకాలజీ (Gynaecology), గర్భ సంబంధమైన శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఉదా: అవటు గ్రంధి సంబంధ వ్యాధులు.

స్త్రీకి పర్యాయ పదాలు

మార్చు

తెలుగు భాషలో పురుషుడితో పోలిస్తే స్త్రీకి అనేక పర్యాయ పదాలున్నాయి. అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంభుజాక్షి, అంభుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, ఆడది, ఆడకూతురు, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభ్యాస, ఇందుముఖి, ఇందువదన, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉవిద, ఉజ్జ్వలాంగి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కనకాంగి, కమలాక్షి, కలకంఠి, కలశస్తని, కలికి, కాంత, కువలయాక్షి, కేశిని, కొమ్మ, కోమలి, కోమలాంగి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలువ, చేడె, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తొయ్యలి, తోయజాక్షి, దుండి, ననబోడి, నళినాక్షి, నవలా, నాతి, నారి, నీరజాక్షి, నీలవేణి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పల్లవాధర, పాటలగంధి, పుత్తడిబొమ్మ, పూబోడి, పైదలి, పొలతుక, ప్రమద, ప్రియ, బింబాధర, బింబోష్టి, బోటి, భామ, మగువ, మహిళ, మదిరాక్షి, మానిని, మానవతి, ముగుద, ముదిత, ముద్దుగొమ్మ, మెలత, యోష, రమణి, రూపసి, లతాంగి, లలన, లేమ, వనిత, వలజ, వారిజనేత్రి, వాల్గంటి, విరబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శాతోదరి, సుందరి, సుగాత్రి, సుదతి, సునయన, హంసయాన, హరిణలోచన. బాలిక అన్న పదానికి అమ్మాయి, అమ్మి, కన్య, కన్యక, కుమారి, కొంజిక, కొండుక, కొమారి, చిన్నది, చిఱుతుక, ధీత, ధీద, నగ్నిక, నివర, పసిగాపు, పాప, పిన్నపాప, పిల్ల, పీపరి, పోఱి, బాల, గుంట, బాలిక, బాలకి, రోహిణి, వాసువు అనే పర్యాయపదాలున్నాయి.

వివిధ నామములు 1.అంగన, 2.అంచయాన, 3.అంబుజలోచన, 4.అంబుజవదన, 5.అంబుజాక్షి, 6.అంబుజానన, 7. అంబురుహాక్షి, 8.అక్క, 9.అతివ, 10.అన్ను, 11.అన్నువ, 12.అన్నువు, 13.అబల, 14.అబ్జనయన, 15.అబ్జముఖి, 16.అలరుబోడి, 17.అలివేణి, 18.అవ్వ, 19.ఆటది, 20.ఆడది, 21.ఆడుగూతురు, 22.ఆడుబుట్టువు, 23.ఇంచుబోడి, 24.ఇంతి, 25.ఇందీవరాక్షి, 26.ఇందునిభాస్య, 27.ఇందుముఖి, 28.ఇందువదన, 29.ఇగురాకుబోణి, 30.ఇగురుబో(డి)(ణి), 31.ఇభయాన, 32ఉగ్మలి,33 ఉజ్జ్వలాంగి, 34ఉవిద, 35ఎలతీగబోడి, 36ఎలనాగ, 37.ఏతుల, 38కంజముఖి, 39కంబుకం (ఠ) (ఠి), 40.కంబుగ్రీవ, 41కనకాంగి, 42కన్నులకలికి, 43కప్పురగంధి, 44కమలాక్షి, 45కరభోరువు, 46కర్పూరగంధి, 47కలకంఠి, 48కలశస్తని, 49కలికి, 50కలువకంటి, 51కళింగ, 52కాంత, 53కించిద్విలగ్న, 54కిన్నెరకంఠి, 55కురంగనయన,56 కురంగాక్షి, 57.కువలయాక్షి, 58.కూచి, 59.కృశమధ్యమ, 60.కేశిని, 61కొమ, 32కొమరాలు, 63.కొమిరె, 64.కొమ్మ, 65కోమ, 66.కోమలాంగి, 67కోమలి,68 క్రాలుగంటి, 69గజయాన, 70గరిత, 71గర్త, 72గుబ్బలాడి, 73గుబ్బెత, 74గుమ్మ, 75గోతి, 76గోల, 77చంచరీకచికుర, 78చంచలాక్షి, 79చంద్రముఖి, 80చంద్రవదన, 81చక్కనమ్మ, 82చక్కెరబొమ్మ, 83చక్కెరముద్దుగుమ్మ, 84చాన, 85చామ, 86చారులోచన, 87చిగురుటాకుబోడి, 88చిగురుబోడి, 89చిలుకలకొలికి, 90చెలి, 91చెలియ, 92చెలువ, 93చే(డె)(డియ), 94చోఱబుడుత, 95జక్కవచంటి, 96జని, 97జలజనేత్ర,98 జోటి, 99ఝషలోచన, 100తనుమధ్య, 101తన్వంగి, 102తన్వి, 103తమ్మికంటి, 104తరళలోచన, 105తరళేక్షణ, 106తరుణి, 107తలిరుబోడి,108 తలోదరి, 109తాటంకవతి, 110తాటంకిని, 111తామరకంటి, 112తామరసనేత్ర, 113తీయబోడి, 114తీ(గ)(వ)బోడి, 115తెఱవ, 116తెలిగంటి, 117తొ(గ)(వ)కంటి, 118తొయ్యలి,119 తోయజలోచన, 120తోయజాక్షి, 121తోయలి, 122దుండి, 123ధవళాక్షి, 124ననబోడి, 125నళినలోచన, 126నళినాక్షి, 127నవ(ల)(లా), 128నాంచారు, 129నాచారు, 130నాచి, 131నాతి, 132నాతుక, 133నారి, 134నితంబవతి, 135నితంబిని, 136నీరజాక్షి, 137నీలవేణి, 138నెచ్చెలి, 139నెలత, 140నెలతుక, 141పంకజాక్షి, 142పడతి, 143పడతుక, 144పద్మముఖి, 145పద్మాక్షి, 146పర్వేందుముఖి, 147పద్మాక్షి, 148పర్వేందుముఖి, 149పల్లవాధర, 150పల్లవోష్ఠి, 151పాటలగంధి, 152పుచ్చడీక, 153పుత్తడిబొమ్మ, 154పు(వు)(వ్వు)బోడి, 155పువ్వారుబోడి, 156పుష్కలాక్షి, 157పూబోడి, 158పైదలి, 159పొ(ల్తి)(లతి), 160పొ(ల్తు)(లతు)క,161ప్రతీపదర్శిని,162 ప్రమద,163 ప్రియ,164 ప్రోడ,165 ప్రోయాలు,166 బంగారుబోడి,167 బాగరి,168 బాగులాడి,169 బింబాధర, 170 బింబోష్ఠి,171 బోటి, 172 భగిని,173 భామ,174 భామిని,175 భావిని,176 భీరువు, 177 మండయంతి,178 మగువ,179 మచ్చెకంటి,180 మడతి,181 మడతుక, 182 మత్తకాశిని,183 మదిరనయన,184 మదిరాక్షి,185 మసలాడి,186 మహిళ, 187 మానవతి,188 మానిని,189 మించుగంటి,190 మించుబోడి,191 మీననేత్రి, 192 మీనాక్షి,193 ముగుద,194 ముదిత,195ముదిర,196ముద్దరాలు,197 ముద్దియ, 198 ముద్దుగుమ్మ,198 ముద్దులగుమ్మ,200 ముద్దులాడి,201 ముష్టిమధ్య,202 203 మృగలోచన,204 మృగాక్షి,205మృగీవిలోకన,206 మెచ్చులాడి,207 208 మెఱుగారుబోడి,209మెఱుగుబో(డి)(ణి),210 మెలుత,211 మె(ల్త)(లత),212 మె(ల్తు)(లతు)క,213 యోష,214 యోషిత,215 యోషిత్తు,216 రమణి 217, రామ, 218 రుచిరాంగి,219 రూపరి,220 రూపసి,221రోచన,222 లతకూన,223 లతాంగి, 224 లతాతన్వి,225 లలన,226 లలిత,227 లలితాంగి,228 లీలావతి,229 లేడికంటి, 230 లేమ,231 లోలనయన,232 లోలాక్షి,233 వధువు,234వధూటి 235వనజదళాయతాక్షి,236 వనజనేత్ర,237 వనజాక్షి,238 వనిత,239 వరవర్ణిని, 240వరానన,241వరారోహ,242 వలజ,242వశ,244 వామ,245 వామనయన, 246వామలోచన,247 వారిజలోచన,248 వారిరుహనేత్ర,249 వారిరుహలోచన, 250 వారిరుహానన,251 వాల్గంటి,252 వాలుగకంటి,253 వాశిత,254 వాసుర, 255విరితీవబోడి,256విరిబోడి,257విశాలాక్షి,258 వెలది,259శంపాంగి,260 శఫరాక్షి, 261శర్వరి,262 శాతోదరి,263 శిఖరిణి,264 శుకవాణి,265 శుభదంతి,266 శుభాంగి, 267శోభన,268 శ్యామ,269 శ్రమణ,270 సకి,271సకియ,272 సారసాక్షి,273 సిత, 274సీమంతిని,275సుందరి,276 సుగాత్రి,277 సుజఘన,278సుదతి,279 సుదృక్కు, 280 సుధ్యుపాస్య,281 సునయన,282 సుప్రియ,283సుభాషిణి,284 సుభ్రువు, 285 సుమతి,286సుమధ్య,287 సుముఖ,288 సురదన,289 సులోచన,290సువదన, 291 హంసయాన,292హరిణలోచన,293 హరేణువు,294 హేమ.

మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని అంటారు. యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ; వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ; ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు. దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ; భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ; మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ; పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ; గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం ఉంది. అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు. ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం ఉన్నాయి. ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల, స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.

సమాజంలో స్త్రీల పాత్ర

మార్చు

ముదిత అనగా స్త్రీ . ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్ ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది. అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు.

ప్రతి సంవత్సరం అక్టోబరు 11అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడుతోంది.[2]

స్థానిక సంస్థల్లో స్త్రీలకు 50 శాతం సీట్లు

మార్చు

స్థానిక సంస్థల్లో యాభై శాతం స్థానాలు మహిళలకు కేటాయిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో ఉన్న33 శాతం స్థానాలను యాభై శాతం వరకు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలు 33 శాతం కంటే ఎక్కువగా పెంచాయి. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండే పరిస్థితులు రానున్నాయి.పురుషులతో పోలిస్తే మహిళలు ఆచితూచి అడుగువేస్తారు. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఏకాభిప్రాయసాధకులుగా, అందరినీ సమాధాన పరచగలిగే వారథులుగా మహిళలది ప్రత్యేక శైలి. అదివారికి జన్మతః వచ్చిన లక్షణం.[3]

తగ్గుతున్న స్త్రీల జనాభా

మార్చు

మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్ధులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో స్కానింగ్‌లు తీయించి పాప అయితే గర్భవిచ్ఛిన్నం చేయించుతున్నారు.

  • ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్‌... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయంలో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువులను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్‌ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్‌ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నే పాల్‌ దేశాలు సైతం ఈ సూచీలో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.[4]
  • పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే[5]

ఆంధ్రప్రదేశ్ లో

మార్చు
  • ఆడజన్మపై ద్వేషం పెరుగుతోంది.1901లో 1,000 మంది పురుషులకుగాను 985 మంది మహిళలు ఉండేవారు. వందేళ్ల తరువాత... అంటే 2001లో ఈ నిష్పత్తి 978కి తగ్గిపోయింది. కానీ 2001 నుంచి 2010 మధ్యకాలంలో ఇది ఏకంగా 876కు పడిపోయింది.[6]
 
గుడి ప్రాంగణంలో పూలమ్ముతున్న ఒక స్త్రీ

స్త్రీవాదం

మార్చు

తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం (Feminism). స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి.

భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.

మహిళా అర్చకులు

మార్చు
  • మహిళలను బిషప్‌లుగా అనుమతించాలని ఇంగ్లండ్‌ చర్చి నిర్ణయించింది.[7]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Menarche and menstruation are absent in many of the intersex and transgender conditions mentioned above and also in primary amenorrhea.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (11 October 2019). "నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 11 October 2020. Retrieved 11 October 2020.
  3. (ఈనాడు6.9.2010)
  4. ఆంధ్రజ్యోతి11.11.2009
  5. ఈనాడు 22.2.2010
  6. సాక్షి 17.8.2010
  7. ఈనాడు 14.7..2010

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=స్త్రీ&oldid=4339093" నుండి వెలికితీశారు