యూసుఫైన్ దర్గా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి బజార్ ఘాట్ చౌరస్తాలో ఉన్న దర్గా. మత బోధకులు యూసుఫుద్దీన్, షరీఫుద్దీన్ అనే ఇద్దరు స్నేహితుల స్మారకంగా ఈ దర్గా నిర్మించబడింది.[1]

యూసుఫైన్ దర్గా
యూసుఫైన్ దర్గా
యూసుఫైన్ దర్గా
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్ జిల్లా
ప్రదేశం:నాంపల్లి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ముస్లీం

చరిత్ర మార్చు

మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన యూసుఫ్ సాహెబ్ (ఈజిప్టు వాసి), షరీఫ్ సాహెబ్ (సిరియా వాసి) ఇద్దరూ కాలి నడకన తమ దేశాల నుండి మక్కాలో కలుసుకున్నారు. ఢిల్లీకి చెందిన హజ్రత్ షేక్ కలీముల్లా వారికి పరిచయమయ్యాడు. కరీముల్లా ఆహ్వానంతో వాళ్ళిద్దరు భారతదేశంలో మత ప్రచారానికి వచ్చారు. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు, వీరిద్దరు సామాన్య సైనికుల మాదిరిగా దక్కనులో సూఫీ తత్వాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. అంతేకాకుండా ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని గెలుచుకోవడంలో కూడా వీరు సహాయపడ్డారు.

యుద్ధం ముగిసిన తర్వాత వాళ్ళు ఢిల్లీకి వెళ్ళకుండా తమ గురువు కలీముల్లా ఆదేశం ప్రకారం హిందూ, ముస్లిం అని భేదభావం చూపక అందరికీ తత్వ బోధనలు చేస్తూ నేక్‌నాంపురా (నాంపల్లి) లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. 1710లో బాబా యూసుపుద్దీన్, షరీపుద్దీన్ లు మరణించారు. స్థానికులు వారిద్దరికీ సమాధులు నిర్మించి ఉత్సవాలు నిర్వహించేవారు. మూడవ నిజాం సికిందర్ జా కాలంలో సమాధులను సుందరీకరించాడు.

ఉర్సు ఉత్సవాలు మార్చు

ఇక్కడకు వచ్చే భక్తుల యొక్క అవసరాల కోసం దుకాణాల సముదాయాలతో ఒక బజార్ ఏర్పడింది. దాంతో ఈ ప్రాంతాన్ని బజార్ ఘాట్ అని పిలుస్తారు. ఉర్సు సందర్భంగా ప్రతి సంవత్సరం చార్మినార్ నుండి యూసుఫైన్ దర్గా వరకు సందల్ ఊరేగింపులో భాగంగా మంచిగంధం, అత్తరు, సుగంధ ద్రవ్యాలను, పూవుల ఊరేగింపు జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సూఫీ సాధువులను పూజిస్తారు. తరువాత భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

వారసత్వ సంపద మార్చు

ఈ దర్గా 2008లో భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థచే వారసత్వ కట్టడంగా చేర్చబడింది.[2]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (14 August 2016). "హిందూ ముస్లింల ఆధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్ దర్గా". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 12 May 2019. Retrieved 12 May 2019.
  2. The Hindu, Andhra Pradesh (19 April 2008). "INTACH-2008 award for Yousufain Dargah". Retrieved 12 May 2019.