యెద్దుల ఈశ్వరరెడ్డి

(యెద్దుల ఈశ్వర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

వై.ఈశ్వరరెడ్డి గా ప్రసిద్ధులైన యెద్దుల ఈశ్వరరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభ, 3వ లోక్‌సభ, 4వ లోక్‌సభ, 5వ లోక్‌సభ లకు ఎన్నికయ్యారు.[1]

ఇతడు 1915 సంవత్సరంలో జన్మించి ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు. ఈశ్వరరెడ్డి 1915లో జమ్మలమడుగు తాలూకా పెద్ద పసుపుల గ్రామంలో జన్మించాడు. తండ్రి చినవెంకట సుబ్బారెడ్డి. ఈయన బి.ఏ. దాకా చదివాడు. 1941లో జిల్లా కాంగ్రేసు కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.[2]

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు పాటు, వెల్లూరు, అలీపురం జైళ్ళలో కారాగార శిక్షను అనుభవించారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పాలూరులో మొదటి రైతు సభను ఏర్పాటు చేశాడు.[2]

స్వాతంత్ర్యం తర్వాత ఈశ్వరరెడ్డి ప్రజాస్వామ్య రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని, 1952లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై 1957 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 1957లో తిరిగి కడప లోక్‌సభ స్థానానికి పోటీచేసినా, కాంగ్రేసు అభ్యర్థి ఊటుకూరు రామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1958 నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా సేవచేశాడు. ఆ తర్వాత పర్యాయం తిరిగి కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి వరుసగా మరో మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.[2]

మూలాలు

మార్చు
  1. http://164.100.47.132/LssNew/biodata_1_12/976.htm[permanent dead link]
  2. 2.0 2.1 2.2 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 506. Retrieved 12 August 2024.