రాంషా
రాంషా (దర్భా వేంకటరామశాస్త్రి) పేరుమోసిన పత్రికా సంపాదకుడు, అభ్యుదయ రచయిత. విద్యార్థిదశలోనే రాంషా సాహిత్య రంగంలో ప్రవేశించడం, అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకుని ఉద్దండులు, లబ్థ ప్రతిష్ఠులు అయిన పండితుల సరసన సన్మానం పొందే అదృష్టం పొందడం జరిగాయి. 24 సంవత్సరాలు నిండే సరికల్లా ముమ్మరంగా కవితలూ, కావ్యాలూ, గేయాలూ, కథలూ, విమర్శనాత్మక వ్యాసాలూ ఇతడి కలం నుంచి వెలువడ్డాయి. ఇతనికి అంధ్రాహెవలాక్ ఎల్లిస్ అనేవారు. అభిసారిక అనే పత్రికని 30 సంవత్సరాలు తన భార్య శిరీషతో నిర్వహించడం ద్వారా గర్భస్రావం చట్టబద్ధం చేయాలని, వివాహయుక్త వయస్సుని 18కే పరిమితం చేయాలని, 21కి పెంచకూడదని, సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టుట లాంటి సంస్కరణలకు కృషిచేశాడు.
రాంషా | |
---|---|
![]() | |
జననం | దర్భా వేంకటరామశాస్త్రి 1924, జూలై 30 తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం |
మరణం | 1990 ఫిబ్రవరి 8 రాజమండ్రి సమీపంలో | (వయసు 65)
మరణ కారణం | రోడ్డు ప్రమాదం |
ప్రసిద్ధి | రచయిత, సంపాదకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | శిరీష |
పిల్లలు | వేంకటరమణ పూషా, రత్నగిరి ఉష, వెంకటగిరి శేష, పద్మావతిజ్ఞాన యోష, అప్పాజీ అంబరీష |
తండ్రి | దర్భా వేంకటరమణయ్య |
తల్లి | వేంకటరత్నం |
బాల్యం, విద్యాభ్యాసం సవరించు
రాంషా 1924, జూలై 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట పక్కన వేట్లపాలెంలో జన్మించాడు.[1] ఇతడి తల్లితండ్రులు వేంకటరత్నం, దర్భా వేంకటరమణయ్య గార్లు పెట్టిన పేరు వేంకటరామశాస్త్రి. పుట్టటం ఐశ్వర్యంలోనే పుట్టినా ఆ తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల ఇతడి జీవితం పేదరికంలో, సమస్యలతో నడిచింది. తల్లిప్రేమకు చిన్నవయసులోనే దూరమై పెదతల్లి పెంపకంలో అనాదరణకు గురికావడంతో చిన్నవయసులోనే గ్రంథ పఠనాన్ని ఆశ్రయించాడు. ఒంటరితనంతో అంతర్ముఖుడిగా మారాడు. ఇతడి విద్యాభ్యాసం స్కూలు ఫైనల్ వరకూ సామర్లకోటలోనూ, ఎఫ్.ఎ. కాకినాడ పి.ఆర్. కళాశాలలోనూ జరిగింది. ఆ రోజుల్లో నిడుదవోలు వేంకటరావు ఇతడికి “విఙ్ఞానానికి పరాకాష్ఠగా విలసిల్లాలని” ‘రాంషా’ (రామ్ శాహ్) అని పేరు పెట్టాడు. ఆ రాంషాయే నాటినుంచి కొన్ని తరాలపాటు ఆంధ్రుల గుండెల్లో నిలిచే పేరయింది.
జీవిత విశేషాలు సవరించు
1944 నుంచి 1955 వరకూ ఇతడు ఆవంత్స సోమసుందర్తో కలిసి కమ్యూనిస్ట్ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించాడు. ఆ రోజుల్లో రాంషా, సోమసుందర్, శశాంకలు ప్రాణస్నేహితులు. మార్క్స్ రచనలు ఇతడిని బాగా ప్రభావితం చేశాయి. 1948లో శిరీషతో పెళ్లయ్యింది . సంసార బాధ్యతల వల్ల సంపాదనావసరాలు పెరిగి ఉద్యోగాన్వేషణలో పడి కమ్యూనిష్టు ఉద్యమంలోంచి బయటకు వచ్చాడు. చిన్నాచితకా ఉద్యోగాలలో పత్రికాఫీసుల్లోనూ, సామర్లకోట షుగర్ ఫాక్టరీలోనూ. ఇంకా అక్కడక్కడ పనిచేసి ఎక్కడా ఇమడలేక 1957 ప్రాంతాల్లో ఇతడు జీవనోపాధికై ధర్మచక్ర పవర్ ప్రెస్ను స్థాపించాడు. ఇంతకీ ప్రెస్ పెట్టినా దానికి తగ్గ పని దొరకలేదు. దాంతో తనే పుస్తకాలు వ్రాసి తనే అచ్చువేసుకుని అమ్ముకోవటం మొదలు పెట్టాడు. 1960లో ధనికొండ హనుమంతరావు తను కొంతకాలం నడిపి ఆపివేసిన అభిసారిక పత్రిక నిర్వహణను చేపట్టమని రాంషాకు సూచించటంతో ఆనాటి నుంచీ ఇతడు తన సహధర్మచారిణి శిరీష సహకారంతో అభిసారికను ముప్ఫయి ఏళ్ళపాటు నిర్వహించి ఉన్నత స్థాయికి తీసుకువచ్చాడు.
రాంషా శిరీష దంపతులకు ఐదుగురు పిల్లలు కలిగారు.ఇతని శ్రీమతి శిరీష 1982 సెప్టెంబరులో తన 47వ యేట గుండెజబ్బుతో మరణించింది. అంతకు 4 నెలల ముందే రాంషా గుండెపోటు వచ్చి నెలరోజులు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. అప్పటికి అతని వయసు 58. భార్య లేని వెలితి ఇతడిని బాగా క్రుంగదీసింది. చిన్ననాటి నుంచీ నేస్తాలైన పుస్తకాలని మరింత ఆశ్రయించాడు. ఒంటరితనాన్ని పారద్రోలటం కోసం క్షణం తీరిక లేకుండా రెట్టింపు పని కల్పించుకునే వాడు. ఇతడు 1990, ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రిలో ఏటేటా జరిగే పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవాన్ని తిలకించేందుకు వెళుతున్నప్పుడు జరిగిన రోడ్డుప్రమాదంలో కవి మిత్రుడు గోదావరిశర్మతో సహా దుర్మరణం పాలయ్యాడు.
ప్రచురణకర్త సవరించు
ఇతడు ఆవంత్స సోమసుందర్తో కలిసి కళాకేళి ప్రచురణాలయం స్థాపించి ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆవంత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’, శశాంక ‘నయాజమానా’, తన ‘అనంతం’ మొదలైన అభ్యుదయ కావ్య సంపుటాలు ప్రకటించి, అభ్యుదయ సాహిత్యవాప్తికై కృషి చేశాడు. ఆవంత్స సోమసుందర్ తో కలిసి దండోరా అనే పత్రికను ప్రారంభించాడు. ధర్మచక్ర పవర్ ప్రెస్ను స్థాపించి తన స్వంతరచనలను అచ్చు వేసుకున్నాడు.
అభిసారిక సవరించు
ఇతడి నిర్వహణలో అభిసారిక కీర్తి ఉన్నత శిఖరాలు అధిరోహించింది. 1960 నుంచీ, 1990 వరకూ 30 సంవత్సరాల పాటు లక్షలమంది పాఠకులకు అన్నయై, తండ్రియై, తాతయై, మిత్రుడై వారి వారి సమస్యలకు యథోచిత పరిష్కారాలు సూచిస్తూ, వారి మోములపై చిరునవ్వు దీపింప జేసాడు.
ఆ 30 సంవత్సరాల అభిసారిక నిర్వహణలోనూ మానసిక వత్తిడులూ, ఆర్థిక సమస్యలూ ఇతడిని ఎన్నోసార్లు క్రుంగదీసాయి. 1974 ప్రాంతాలకి పత్రిక ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా పట్టువీడని దృఢ సంకల్పం, ఆప్తుల సహాయ సహకారాలు, శిరీష తోడు, ప్రోత్సాహమూ కలిసి రాగా, విధి నిర్వహణలో ఇతడు ముందుకెడుతూనే వచ్చాడు. నిలదొక్కుకొని అభిసారిక నిరాటంకంగా దిగ్విజయంగా సాగుతూ వచ్చింది. ఆ 30 ఏళ్ళలో – ముఖ్యంగా తొలి సంవత్సరాలలో అభిసారిక ద్వారా ఇతడు సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవి – గర్భస్రావం చట్టబద్ధం చేయాలని, వివాహయుక్త వయస్సుని 18కే పరిమితం చేయాలని, 21కి పెంచకూడదని, సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టాలనీ – ఇత్యాది సంస్కరణలు.
అభిసారికలో ‘అడగండి-చెబుతాను’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది. పాఠకుల వ్యక్తిగత, లైంగిక సమస్యలకు ఇతడు హేతుబద్ధంగా, వైద్య, ధర్మ, మనోవిజ్ఞాన శాస్త్రాలపరంగా ఇచ్చే సమాధానాలు పాఠకులనెంతో ఆకట్టుకోవటమే కాక వారి సందేహాలకి, సమస్యలకి సాకల్యమైన, సంపూర్ణమైన పరిష్కారాలు లభించటంతో పాఠక హృదయాలలో ఇతడికి అద్వితీయ స్థానం లభించింది. వేలాదిమంది సంతానవంతులయ్యారు. లక్షల పాఠకుల సంసారాలలో జ్యోతులు వెలిగాయి. ఇతడి సమాధానాల్లో లభించే ఆదరణ, ఆప్యాయత, మందలింపు, వాటిల్లో కనిపించే తర్కం, ఇతడు విషయాన్ని విరిచి, విడమరచి ఉపమానాలతో చెప్పే విశిష్ట శైలి – పత్రికకూ, ఇతడికీ ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
రచనావ్యాసంగం సవరించు
విద్యార్థిదశలోనే రాంషా సాహిత్య రంగంలో ప్రవేశించడం, అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకుని ఉద్దండులు, లబ్థ ప్రతిష్ఠులు అయిన పండితుల సరసన సన్మానం పొందే అదృష్టం పొందడం జరిగాయి. 24 సంవత్సరాలు నిండే సరికల్లా ముమ్మరంగా కవితలూ, కావ్యాలూ, గేయాలూ, కథలూ, విమర్శనాత్మక వ్యాసాలూ ఇతడి కలం నుంచి వెలువడి అఖండఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆ కీర్తిప్రతిష్ఠలే ఇతడికి బరంపురం నుంచీ కావలి దాకా విశేష సన్మానాలు ఆర్జించాయి.
నవలలు సవరించు
- కామేశ్వరి కథ (స్వేచ్చానువాద రచన)
- దయ్యం పట్టిన మనిషి (టాల్‌స్టాయి 'ది డెవిల్'కు సాధికార అనువాదం)[2]
- మాల్వా (అనువాద రచన)
- సంస్కారం (అనువాద రచన)
- సొనార్ బాంగ్లా (అనువాద రచన)
- చీకటే మిగిలింది (వెండెట్టా నవలకు స్వేచ్ఛానువాదం)
విమర్శ సవరించు
- కళలు-కథలు
- సాహిత్యం
- విమర్శ
- నవల
- నాటకం
నాటకాలు, నాటికలు సవరించు
- శిలాప్రతిమ
- లక్షింపతిగారమ్మాయిలు[3]
- వంటింటి కుందేళ్లు
- తెగనిగొలుసులో లంకెలు
- చిత్రవర్షం
కావ్యం సవరించు
- అనంతం[4]
కథాసంకలనాలు సవరించు
- మనస్తత్వాలు
- పెళ్ళి తిరకాసు
- మీనాక్షి ముద్దు
- ప్రియురాలు
- మొండిచెయ్యి,
- చెత్తకథ
- ప్రేమపక్షులు
- అపస్వరాలు
కథలు సవరించు
ఇతడు రచించిన కథలలో కొన్ని[5]:
- అన్నానికీ పడక్కీ విడాకులు
- అబద్ధం కథ
- ఆడవాళ్లసంత
- ఎర్రజండా
- కారుణ్యం
- కిన్నెరసాని
- కిర్రు చెప్పులు
- కుక్కజన్మ
- కొండమీద కోతి
- కొడిగట్టిన దీపాలు
- గాంధీజీ పెట్టిన భిక్ష
- గోపికాలోలుడు
- చిదంబర రహస్యం
- చెయ్యని పొరపాటు
- జీవితపు విలువలు
- ధర్మరాజు
- నిప్పుతో చెలగాటం
- నీవళ్ళు బంగారు కాను
- పవిత్రులు
- పిచ్చిపిల్ల
- పెద్ద మనిషి
- పెళ్ళి తిరకాసు
- ప్రియురాలు
- మత్తానయ్య మరణం
- మీనాక్షి ముద్దు
- మొండిగోడలు
- రాజకీయబాధితులు
- రాజాబ్రతుకు
- వెలగని దీపం ఆరని అగ్ని
- శత్రువులు (చఖోవ్)
- శాంతికాముడు
- సుడిగుండాలు
- మాల్వా (గోర్కీ)
తాత్త్విక, ధర్మగ్రంథాలు సవరించు
- న్యాయదర్శనం
- వైశేషికం
- యోగానుశాసనం
- సాంఖ్యదర్శనం
- బ్రహ్మసూత్రాలు
- వశిష్ఠస్మృతి
- గౌతమ ధర్మసూత్రాలు
- కౌటిలీయార్ధశాస్త్రం
- వివాహసూత్రాలు
- జ్ఞానవాశిష్టము
- భర్తృహరి సుభాషితాలు
- మనుస్మృతి
సైన్సు పుస్తకాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ మాల్యశ్రీ (జూన్ 1992). "రాంషా సాహిత్యం – వ్యక్తిత్వం". అభ్యుదయ.
- ↑ రాంషా (1951). దయ్యం పట్టిన మనిషి (1 ed.). సామర్లకోట: కళాకేళి ప్రచురణాలయం. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1950-01-01). లక్షింపతిగారమ్మాయిలు (1 ed.). హైదరాబాదు: కళాకేళి ప్రచురణాలయం. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1953-09-01). అనంతం (1 ed.). సామర్లకోట: కళాకేళి ప్రచురణాలయం. Retrieved 6 March 2015.
- ↑ వెబ్‌మాస్టర్. "రచయిత: రాంషా". కథానిలయం. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1986-01-01). పిల్లలపెంపకం (2 ed.). సామర్లకోట: అభిసారిక ప్రచురణలు. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1988). గర్భధారణ సమస్యలు (2 ed.). సామర్లకోట: ధర్మచక్ర పవర్ ప్రెస్. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1988-01-01). సెక్స్ సైన్స్. సామర్లకోట: ధర్మచక్ర పవర్ ప్రెస్. Retrieved 6 March 2015.
- ↑ రాంషా (1977-03-01). కామశిల్పం (1 ed.). న్యూడిల్లీ: అభిసారిక పబ్లికేషన్ష్స్. Retrieved 6 March 2015.