రాచాబత్తుని సూర్యనారాయణ

రాచాబత్తుని సూర్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన తన ఆస్తిపాస్తులను కోల్పోయినా కించిత్తు బాధపడలేదు. స్వరాజ్యం సిద్ధించిన రోజు ఎంతో ఆనందించాడు.

జీవిత విశేషాలు మార్చు

1903లో తెనాలిలో చేనేతల కుటుంబంలో జన్మించారాయన. విద్యాభ్యాసం తరువాత 1932లో పంచాయత్ కోర్టు ప్రెసిడెంటుగా పనిచేశారు. 1937-47 మధ్య స్థానికుల ఆదరాభిమానాలతో రెండు సార్లు పోటీ లేకుండానే మున్సిపల్ కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే స్వాతంత్ర్య ఉద్యమంపై ఆసక్తిని పెంచుకున్నారు. తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా యువతను ఈ పోరాటంలో పాల్గొనేందుకు స్ఫూర్తిని కలిగించే వారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపు ప్రకారం వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొనేలా చేసేవారు. ఆ క్రమంలో 1941 లో భట్టిప్రోలులో వేలాది మందితో సత్యాగ్రహం నిర్వహించారు.

అక్కడి నుంచి కృష్ణానదిని దాటి దివి తాలూకాలోకి ప్రవేశించారు. ప్రజలను సమీకరిస్తూ, సత్యాగ్రహ ప్రచారం చేస్తూ అప్పటి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం చేరుకోగానే బ్రిటిష్ ప్రభుత్యం ఆయనను అరెస్టు చేసింది. సెక్షన్ 38 (95) డిఫెన్స్ అఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఆరు వారాల కఠిన కారాగార శిక్ష విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 1941 ఫిబ్రవరి 22 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు శిక్ష అనుభవించారు.

ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో ఉధమంలో కొనసాగారు. 1942లో ఆగస్టు క్రాంతి ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సర్క్యులర్ ను ముద్రించేందుకు జైలు శిక్షకు భయపడి ఎవరూ ముందుకు రాని తరుణంలో ఆయన ధైర్యం చేసారు. అప్పటికే తెనాలిలో ఉన్న తన ముద్రణాలయంలో ముద్రించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన ప్రతి సందర్భంలోనూ మొక్కవోని దీక్షతో ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆస్తిపాస్తులు కోల్పోయి చివరకు ముద్రణాలయం అమ్ముకోవలసి వచ్చింది. పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చెయ్యలేదు.[1] ప్రెస్ కూడా అమ్ముకొని కటిక దారిద్ర్యంలో 1961, ఏప్రిల్ 15న మరణించారు.

మూలాలు మార్చు