రాజశేఖర వేంకటశేషకవులు
20వ శతాబ్దం ఆరంభంలో ఆంధ్ర దేశంలో జంట కవిత్వం ఒక వాడుకగా మారింది. తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులను అనుసరించి అనేక మంది జంటకవులు బయలు దేరారు. ఆ పరంపరలో రాయలసీమకు చెందిక కవులు దుర్భాక రాజశేఖర శతావధాని (1888-1957), గడియారం వేంకట శేషశాస్త్రి(1901-1981) ఇరువురూ రాజశేఖర వేంకటశేషకవులు పేరుతో జంటగా అవధానాలు చేయడం ప్రారంబించారు.
దుర్భాక రాజశేఖర శతావధాని
మార్చుదుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో నవంబర్ 18,1888న జన్మించాడు. ఇతడు మెట్రిక్యులేషన్ చదివి ఎఫ్.ఎ. సగంలో మానివేసి ప్రొద్దుటూరులోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా చేరాడు. జాతీయోద్యమ ప్రభావంతో ఉద్యోగం వదిలివేశాడు. తరువాత ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా, వైస్ ఛైర్మన్‌గా, ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా, మద్రాసు సెనెట్ సభ్యుడిగా సేవలను అందించాడు. ఇతడు సంస్కృతాంధ్రాలను, నాటకాలంకార శాస్త్రాలను కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద నేర్చుకొన్నాడు. రాణాప్రతాపసింహచరిత్ర, అమరసింహ చరిత్ర వంటి అనేక కావ్యాలను, నాటకాలను, నవలలను, హరికథలను రచించాడు. ఆంగ్ల, సంస్కృతభాషలలో కూడా రచనలు చేశాడు. ఇతడు కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, కవిబ్రహ్మర్షి మూర్ధన్య వంటి అనేక బిరుదులతో గౌరవించబడ్డాడు.
గడియారం వేంకట శేషశాస్త్రి
మార్చుగడియారం వేంకట శేషశాస్త్రి పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించాడు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డాడు. ఇతని ధర్మపత్ని పేరు వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్యంలు ఇతని పుత్రులు. 1932లోఅనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకునిగా ఉన్నాడు. ఇతడు రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యలు నేర్చుకొన్నాడు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. శివభారతం, పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించాడు.
అవధానాలు
మార్చుఈ కవులు ఇద్దరూ 1920-28ల మధ్య జంటగా అవధానాలు అసంఖ్యాకంగా చేశారు. వీటిలో అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు, శతావధానాలు ఉన్నాయి. కడప జిల్లా దాదిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నెమళ్ళదిన్నె, చెన్నూరు, కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలోని గుత్తి మొదలైన చోట్లతో పాటుగా నెల్లూరులో కూడా అవధానాలు చేశారు.[1]
వీరు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని:
- సమస్య: మూడును మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్
పూరణ:
ఆడకు నాడకే జరుగునట్టి యొకానొక జంగమయ్య పెం
డ్లాడఁ బ్రయాణమునన్ సలిపి యచ్చట రంగపురంబు లోన నే
వాడలఁ బోవఁ జూచినను వాని కెదుర్పడఁ జొచ్చె నామముల్
మూడును మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్
- సమస్య: దృఢసత్వంబునఁ జీమ తుమ్మెగదరా దిగ్దంతు లల్లాడగన్
పూరణ:
ద్రఢిమం బొప్పెడు మ్రాకు మంచమున దీర్ఘంబైన మేన్వైచి ము
క్కు ఢమాన్నాదము లీన నిద్ర గను నా కుంభశ్రవుండంత మ
త్తఢులీక్రాంతుని ముక్కులో నరిగి యంతర్భాగమున్ గుట్టగా
దృఢసత్వంబునఁ జీమ, తుమ్మెగదరా దిగ్దంతు లల్లాడగన్
- వర్ణన: అవధానాన్ని చూడవచ్చిన ఇద్దరు మోట మనుషుల మధ్య సంభాషణ
అగుదాన మంటరో రబ్బరో యిద్దరు
సిన బాపనయ్యలు చేస్తరంట
అగుదాన మన సుద్దులా యేంటిరా సెప్పు
వారింక బలకొటు వార లెవరు?
అది కాదసే యెవ్వరడిగిన గాని క
యిత్తంబు సెప్పి మెప్పింతురంట
కావేరి కతగాడ కైతగాండ్లందఱు
సిల్లి గవ్వకునైన సెల్లిరావు
ఏమిలేకుండినను పెద్దలెల్ల ఇటు
కనుగొనగ వత్తురా యన మనము గూడ
తాళి సూస్తమటం చవధాన సభకుఁ
బామరులు మటలాడుచు వచ్చుచుంద్రు
- నిషిద్ధాక్షరి: పాండవులకును ద్రౌపదికి కల వావివరుసలు
పూరణ:
పతులైదుగు రగుదురు యమ
సుతుడు మఱఁది గాడుమాద్రి సుతులందుఁ గని
ష్ఠతనయుఁడు బావగాడా
పతులు కడమ వారగుదురు బావలు మరఁదుల్
మూలాలు
మార్చు- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 153–159.