పాశంవారి వెంకట రామారెడ్డి

నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.
(రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పాశంవారి వెంకట రామారెడ్డి (1869, ఆగష్టు 22 - 1953, జనవరి 25) నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రులై, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్సే ప్రధానంగా సేవచేసి అపారమైన వారి ప్రేమాభిమానలను చూరగొన్న ప్రజాబంధువు. నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన మొదటి హిందువు. ఇతనిని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి అని పిలుస్తారు. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశాడు. ఇతని పదవీకాలం 14 సంవత్సరాలు కొనసాగింది.

రాజా బహదూర్

వెంకట రామారెడ్డి

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహం
జననం(1869-08-22)1869 ఆగస్టు 22
మరణం1953 జనవరి 25(1953-01-25) (వయసు 83)
పురస్కారాలుఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్

ఈయన గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ అకాడమీకి రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టి.ఎస్.పి.ఏ) గా పేరు పెట్టింది.[1]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

వీరు 1869, ఆగష్టు 22తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని కొత్తకోటగ్రామంలో జన్మించాడు. వీరి ఇంటి పేరు పాశంవారు. తల్లిదండ్రులు కేశవరావు, జారమ్మ. ఇతని తండ్రి ఎనిమిది గ్రామాలకు చెందిన పటేల్, సంపన్నుడు. అతను అప్పటి వనపర్తి రాజుకి మేనల్లుడు. వెంకట రామారెడ్డి పుట్టగానే కొన్ని మాసాలకు తల్లి మరణించింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన బాల్యంలో రాయణిపేటలో అమ్మమ్మ కిష్టమ్మ దగ్గర పెరిగాడు. చిన్నప్పుడు ఆయన ఖాన్గీ బడిలో భారత, భాగవతాలు చదివారు. తరువాత నాలుగు సంవత్సరాలు వనపర్తి పాఠశాలలో ఉర్దూ, ఫార్సీభాషను చదువుకున్నారు. ఆ తరువాత విలియం వాహబ్ దగ్గర కన్నడ,మరాఠీ భాషలు నేర్చుకున్నాడు.[2]

ఉద్యోగ జీవితం

మార్చు

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను 'కొత్వాల్' అని పిలిచేవారు. ఇది పురాతన స్థాపనలో ఒకటి, నిజాం ప్రభుత్వంలో అత్యంత అధికారాలు కల ఉద్యోగం. నజర్‌ మహమ్మద్‌ సహాయంతో 1886లో ముదిగ్లు ఠాణాకు అమీను (సబ్‌ఇన్స్‌పెక్టర్‌) గా నియమితులైనారు. తరువాత నిజాం యొక్క సొంత ఎస్టేటు వ్యవహారాలలో ప్రత్కేకాధికారిగా కొంతకాలం వ్యవహరించారు. నిజాయితీ, సమర్ధత, విధుల నిర్వహణలో చాకచక్యం కారణంగా అనతికాలంలో పదోన్నతి లభించింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, గుల్బర్గా, అత్రాఫ్‌ బల్దా (రంగారెడ్డి) జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఆయన రాజధాని నగరం హైదరాబాద్‌లో నాయెబ్‌ కొత్వాల్‌గా నియమితులైనారు. అనంతరం కొత్వాల్‌ (సిటీ పోలీస్‌ కమిషనర్‌) అయ్యారు. వేల్సు యువరాజు హైదరాబాదు వచ్చినప్పుడు చక్కని భద్రతా ఏర్పాట్లుచేసి గుర్తింపు పొందారు. 1933 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. 7వ నిజాంకి రాజా వెంకట్రామా రెడ్డి అంటే చాలా ఇష్టమని, ఆయనకు చాలా సన్నిహితంగా ఉండేవారని అనేక ఆధారాలు పేర్కొంటున్నాయి.[3][4]

విద్యా వ్యాప్తి

మార్చు

వెంకట రామారెడ్డి ఎన్నో సంస్థలను పోషించారు. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి సహాయమందించారు. 1946లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభకు వీరు అధ్యక్షత వహించారు. హైదరాబాదులో రెడ్డి విద్యార్థి వసతిగృహం నెలకొల్పారు. తెలంగాణలో విద్యావ్యాప్తిలోనూ, రాజకీయ చైతన్యం పెంపొందించడంలోనూ రెడ్డి హాస్టల్ కీలక పాత్ర పోషించింది. హాస్టల్‌ని ప్రారంభించేందుకు గద్వాల మహారాణి, వనపర్తి రాజా, పింగళి వెంకట్రామారెడ్డి, పింగళి కోదండరాం రెడ్డి, గోపాలు పేట, దోమకొండ రాజా, జటప్రోలు రాజా తదతరుల నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు చందాలు పోగుచేశారు. అలా తొలుత నగరంలో ఓ అద్దె ఇంట్లో రెడ్డి హాస్టల్‌ని ప్రారంభించారు. తర్వాత 1918లో ప్రస్తుతం అబిడ్స్‌లో ఉన్న రెడ్డి హాస్టల్ సొంత భవనంలోకి మారింది.

నారాయణగూడ ఆంధ్ర బాలికోన్నత పాఠశాలకు చాలా కాలం అధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్ర విద్యాలయ కార్యవర్గానికి స్వర్గస్థులయ్యేవరకు అధ్యక్షులుగా ఉన్నారు. 1926లో "గోలకొండ పత్రిక" స్థాపనకు ముఖ్య కారకులయ్యారు. ఆ కాలంలో వీరి వలన సహాయం పొందని తెలుగు సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. హరిజనోద్ధరణకు ఏర్పడిన సంఘాలకు, అనాథ బాలల ఆశ్రమాలు, కుష్టు నివారణ సంఘం జంతు హింసా నివారణ సమితి వంటి సంస్థలతో పనిచేసి, వాటికి ఉదారంగా ధనసహాయం చేశారు. ఈ క్రమంలోనే 1933లో రెడ్డి బాలికల హాస్టల్ (నారాయణ గూడ), 1954లో రెడ్డి మహిళా కళాశాల (నారాయణగూడ) లను ప్రారంభించారు.[5]

బిరుదులు - గుర్తింపులు

మార్చు
  • నిజాం రాజు జన్మదినోత్సవం సందర్భంగా 1921లో "రాజా బహద్దూర్" అనే గౌరవం ఇచ్చారు.
  • బ్రిటిష్ ప్రభుత్వం 1931లో వీరికి "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్" గౌరవం ప్రదానం చేశారు.
  • వెంకట రామారెడ్డి కాంశ్య విగ్రహం హైదరాబాదులో నారాయణగూడ చౌరస్తాలో ప్రతిష్ఠించారు.
  • వెంకట రామారెడ్డి పేరుతో హైదరాబాద్‌లో ఒక మహిళా కళాశాల స్థాపితమైంది.
  • వెంకట రామారెడ్డి పేరుమీద ట్రస్టును ఏర్పాటుచేసి, ఆ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌, సైబరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి అవార్డును అందజేస్తున్నారు.[6]

పధ్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి, గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్‌ స్థాపించి, ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కొత్వాల్‌ వెంకటరామారెడ్డి జనవరి 25 తేదీన 1953 సంవత్సరంలో పరమపదించారు. వీరి సమాధి లోయర్ ట్యాంక్ బండ్ లోని దోమలగుడ ప్రాంతంలో ఉంది.

ఇతని కొడుకు రంగారెడ్డి పుట్టిన కొన్ని నెలలకే అతని మొదటి భార్య చనిపోయింది. ఇతని రెండవ భార్యకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె నర్సమ్మకు పాతేరుగట్టి నిర్మించిన కాంట్రాక్టర్‌తో వివాహమైంది. కొడుకు లక్ష్మారెడ్డి బార్-ఎట్ లా చేసి, హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. RBVR Telangana State Police Academy
  2. తెలంగాణ మ్యాగజైన్. "భాగ్యనగరి 'కోహినూర్‌' కొత్వాల్‌". www.magazine.telangana.gov.in.
  3. "Grandson reveals Mir Osman Ali's connect with his Hindu employees | Hyderabad News – Times of India". The Times of India. 29 July 2019.
  4. "Raja Bahadur Venkata Rama Reddy key player in Hyderabad education".
  5. నమస్తే తెలంగాణ. "నగరంపై.. చెరగని సంతకం". Retrieved 14 June 2017.
  6. నవతెలంగాణ. "శ్రీధర్‌కు రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి అవార్డు ప్రదానం". Archived from the original on 10 ఆగస్టు 2019. Retrieved 14 June 2017.